ఒకే వ్య‌క్తికి రెండు పింఛ‌న్లు.. రూల్స్ మారాయి సార్‌.. సొమ్ములే సొమ్ములు!

Update: 2021-08-20 04:30 GMT
సాధార‌ణంగా.. ఒక వ్య‌క్తికి రెండు పింఛ‌న్లు అనేది ఉండ‌నే ఉండ‌దు. ఈ విష‌యంలో ఇప్ప‌టికే ఉద్యోగ సంఘాలు అనేక ఆందోళ‌న‌లు కూడా చేశాయి. అయిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఈ రూల్స్‌ను మార్చ‌లేదు. ఒక వ్య‌క్తికి ఒక పింఛ‌న్‌ను మాత్ర‌మే అమ‌లు చేస్తోంది. అయితే.. తాజాగా దేశ‌వ్యాప్తంగా వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌తోనో.. లేక‌.. ప్ర‌భుత్వంపై వ్యక్త‌మ‌వుతున్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకునే క్ర‌మంలోనే పింఛ‌న్ రూల్స్‌ను కేంద్రం స‌డ‌లించింది. దీంతో ఒకే వ్య‌క్తి రెండు పింఛ‌న్లు పొందేందుకు అర్హ‌త ఏర్ప‌డింది.

విష‌యం ఏంటంటే.. భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రూ ప్ర‌భుత్వ ఉద్యోగులు అయితే.. ఇద్ద‌రూ పింఛ‌న్ పొందేందుకు అర్హులుగా పేర్కొంటూ.. నూత‌న పింఛ‌న్ రూల్స్‌ను విడుద‌ల చేశారు. ఈ ఇద్ద‌రు ఉద్యోగుల్లో ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే.. వారి తాలూకు పింఛ‌న్‌ను కూడా కుటుంబ పింఛ‌న్ రూపంలో జీవించి ఉన్న‌వారు పొంద‌వ‌చ్చు. ఇక‌, వీరిద్ద‌రూ క‌నుక మృతి చెందితే.. జీవించి ఉన్న బిడ్డ‌ల‌కు కూడా పింఛ‌న్ సౌక‌ర్యాన్ని క‌ల్పించారు. ఈ మేర‌కు కేంద్రం పింఛ‌న్ల విభాగం `75 నియ‌మాలు` పేరుతో కొత్త రూల్స్‌ను ఇటీవ‌ల జారీ చేసింది.

దీని ప్ర‌కారం.. కొన్ని ష‌ర‌తుల‌కు లోబ‌డి.. ఒకే వ్య‌క్తి.. రెండు ర‌కాల పింఛ‌న్ల‌ను పొందే సౌల‌భ్యం క‌ల్పించారు. ఉద్యోగం చేస్తున్న త‌ల్లిదండ్రులు ఇద్దరూ జీవించి ఉండ‌గా.. విడాకులు తీసుకున్న లేదా.. భ‌ర్త మ‌ర‌ణించిన కుమార్తెకు పింఛ‌న్ సౌల‌భ్యం క‌ల్పించారు. అయితే.. ఈ కేసులు ఉద్యోగులైన త‌ల్లి లేదా తండ్రి జీవించి ఉన్న స‌మయంలోనే న‌మోదై.. కొన‌సాగి ఉండాలి. ఇక‌, వివాహం కాని కుమార్తె.. త‌న త‌ల్లిదండ్రులు ఇద్ద‌రూ ఉద్యోగులు అయితే.. కుటుంబ పింఛ‌న్‌కు అప్ల‌యి చేసుకునే అవ‌కాశం ఉంద‌ని.. దీనికి నిర్దేశిత స‌మ‌యం ఏదీ లేద‌ని పింఛ‌న్ విభాగం స్ప‌ష్టం చేసింది.

అయితే.. ఈ విష‌యంలో ఒక కీల‌క పాయింట్‌ను లేవ‌నెత్తింది. స‌ద‌రు కుమార్తె ఏదైనా ఉద్యోగంలో స్థిర‌ప‌డితే మాత్రం పింఛ‌న్ ఉండ‌దు. అదేవిధంగా వివాహం చేసుకోనంత వ‌ర‌కు ఈ పింఛ‌న్ సౌల‌భ్యం పొంద‌వ‌చ్చు. అదేస‌మయంలో ప్ర‌భుత్వ ఉద్యోగి పిల్ల‌లు.. విక‌లాంగులు అయితే.. వారికి కూడా కుటుంబ పించ‌న్‌ను ఇచ్చే నియ‌మాల‌ను స‌వ‌రించ‌నున్నారు. దీనికి సంబంధించిన రూల్స్ స‌వ‌ర‌ణ‌కు సిద్ధం చేసిన‌ట్టు తెలిపారు. విక‌లాంగులైన పిల్ల‌లు.. ఉద్యోగులైన త‌మ త‌ల్లిదండ్రులు మ‌ర‌ణిస్తే.. కుటుంబ పింఛ‌న్‌ను పొంద‌డంతోపాటు.. దానిని పెంచుకునే అవ‌కాశం కూడా క‌ల్పించ‌నున్నారు.


Tags:    

Similar News