అప్సర హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు!

Update: 2023-06-10 14:25 GMT
హైదరాబాద్‌ నగరంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పెళ్లి చేసుకోవాలని వేధిస్తుండటంతో అప్సరను చంపేసిన పూజారి సాయికృష్ణ ఆమె మృతదేహాన్ని రోజంతా తన కారు డిక్కీలోనే ఉంచి తాను నివాసం ఉంటున్న అపార్టుమెంటు దగ్గర పార్కు చేశాడు.  

మరుసటి రోజు దుర్వాసన వస్తుండటంతో ఆమెను ఆ రాత్రి సరూర్‌ నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయం వెనుక వైపుకు తీసుకెళ్లి అక్కడ వినియోగంలో లేని మ్యాన్‌ హోల్‌ లో పడేశాడు. అంతేకాకుండా రాత్రికి రాత్రే రెండు టిప్పర్ల కంకరను తోలించి ఆ మ్యాన్‌ హోల్‌ ను పూడ్చేశాడు. మరుసటి రోజు ఉదయం అక్కడకు వెళ్లాడు. అక్కడ దుర్వాసన వస్తుండటంతో ఆ దగ్గరలోనే బోరు తవ్వించాడు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉండటంతో వాటి చుట్టుపక్కల శుభ్రం చేయించాడు. మ్యాన్‌ హోల్‌ ను మూసివేయడానికి కాంక్రీట్‌ మూతలు కొనుక్కుచ్చాడు.

అప్సర తల్లి తన కుమార్తె ఏదని అడగడంతో ఆమె తన స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్లిందని ఆమె నమ్మించాడు. అయితే రోజంతా అప్సర తల్లి ఫోన్‌ కు అందుబాటులోకి రాలేదు. దీంతో ఆమె సాయికృష్ణను ప్రశ్నించింది. దీంతో ఏమీ తెలియనట్టు సాయికృష్ణ ఆమె తల్లితో కలిసి మిస్సింగ్‌ కేసు నమోదు చేశాడు.
 
కాగా పోలీసుల విచారణలో మరో విషయం కూడా బయటపడింది. అప్సర కనిపించడం లేదని ఆమెను హత్య చేశాక అప్సర తల్లితో కలిసి సాయికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అతడిపై అనుమానంతో పోలీసులు మొదట అతడిని తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడ్ని వెంటనే ఓ మంత్రి పీఏ తన సొంత పూచీకత్తుపై బయటకు తీసుకొచ్చాడని వెల్లడైంది.

పోలీసుస్టేషన్‌ నుంచి విడుదలయ్యాక సాయికృష్ణ ప్రధాన అర్చకుడిగా ఓ ప్రతిష్టాపన కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడని తేలింది. ఆ తర్వాత 8వ తేదీన పోలీసులకు లొంగిపోయాడు. జూన్‌ 9వ తేదీన అప్సర మృతదేహం బయటపడింది.

కాగా జూన్‌ 10న అప్సర మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో మరిన్ని కీలక విషయాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. అప్సరను ఎన్ని రోజుల కిందట హత్య చేశాడు.. ఎలా హత్య చేశాడు లాంటి విషయాలు పోస్టుమార్టం రిపోర్టులో బయటపడనున్నాయి. అలాగే అప్సర గర్భవతా.. కాదా అనే విషయం కూడా వెల్లడి కానుంది.  

కాగా అప్సర, సాయికృష్ణ బంధువులని, ఆమె అతడి మేనకోడలని వార్తలు వచ్చాయి. అయితే పోలీసుల విచారణలో వారికి ఎలాంటి బంధుత్వం లేదని వెల్లడైంది. మద్రాసులో సినిమా అవకాశాలు దక్కకపోవడంతో అప్సర తల్లితో కలసి వచ్చి సరూర్‌ నగర్‌ ఏరియాలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో తరచూ ఆమె నివాసానికి దగ్గరలో ఉండే గుడికి వెళ్తుండేది.

అక్కడ సాయికృష్ణ ఆమెకు పరిచయమయ్యాడు. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం రిపోర్ట్‌ బయటకొచ్చిన తర్వాత ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే!

Similar News