ఐసోలేషన్‌ లో రెండు రోజుల్లో 12 మంది మృతి

Update: 2021-05-07 05:30 GMT
తెలంగాణ లో కరోనా వైరస్ మహమ్మారి జోరు రోజురోజుకి పెరుగుతుంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నా కూడా కరోనా ఏ మాత్రం కంట్రోల్ లోకి రావడంలేదు. ఇక రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. బెల్లంపల్లి ఐసోలేషన్‌ కేంద్రంలో కేవలం రెండు రోజుల  వ్యవధిలో 12 మంది మృతి చెందారు. కొద్ది గంటల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోవడం కలకలం సృష్టించింది. బెల్లంపల్లి కేంద్రంగా సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఐసోలేషన్‌ కేంద్రం నిర్వహిస్తున్నారు. సెకండ్‌ వేవ్‌ తీవ్ర రూపం దాల్చడంతో జిల్లాలో రోజూ దాదాపు 500 కేసులు నమోదవుతున్నాయి.

కాగా అనేక మంది రెండు మూడు రోజుల వ్యవధిలోనే తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితి లో ఐసోలేషన్‌ కేంద్రంలో చేరుతున్నారు. ఆక్సిజన్‌ స్థాయి 50 శాతానికి పడిపోయిన రోగులు ఆస్పత్రిలో చేరిన కొద్ది గంటల వ్యవధిలోనే చనిపోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 8 మంది, ఆ తర్వా త సాయంత్రం 7 గంటల వరకు మరో నలుగురు వ్యక్తులు కరోనాతో కన్నుమూశారు. ఇటీవలె మత్తు వైద్యులతో పాటు ఛాతీ వైద్యుడు, టెక్నిషియన్ ను అధికారులు నియమించారు. అయినప్పటికీ రోగులు భారీ సంఖ్యలో మృతి చెందడం కలవరపెడుతోంది. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది పరిస్థితి విషమించిన తర్వాత ఐసోలేషన్ సెంటర్ కి వస్తున్నట్లుగా అక్కడి వైద్యులు చెబుతున్నారు. అయితే మృతుల కుటుంబ సభ్యులు మాత్రం ఐసోలేషన్ లో సరైన చికిత్స అందించకపోవడం వల్లే మరణిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Tags:    

Similar News