కృష్ణదేవరాయలు, మైసూరు మహారాజా సరసన కేసీఆర్?

Update: 2017-02-22 09:35 GMT
తిరుమల వెంకన్నకు కోట్ల రూపాయల ఆభరణాలు సమర్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ను తితిదే ఈవో సాంబశివరావు ఆకాశానికెత్తేశారు. ఏకంగా ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలుతో పోల్చారు. గతంలో రాజులు - చక్రవర్తుల వంటి వారు ఖరీదైన కానుకలను శ్రీ వేంకటేశ్వరుడికి సమర్పించారని, నేడు కేసీఆర్ ఆవిధంగా చేశారని  సాంబశివరావు ప్రశంసించారు.
    
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తిరుమల శ్రీవారికి బంగారు ఆభరణాలు సమర్పిస్తానని నాడు మొక్కుకున్న కేసీఆర్, ఆ మొక్కును ఈ రోజు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఈవో సాంబశివరావు మాట్లాడుతూ, అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయలు, మైసూర్ మహారాజ్ వంటి వారు మాత్రమే ఎంతో ఖరీదైన కానుకలను తిరుమల శ్రీవారికి సమర్పించారన్నారు. మళ్లీ, అటువంటి ఖరీదైన కానుకలను కేసీఆర్ మాత్రమే సమర్పించారని, ఆయన కీర్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.
    
కాగా రెండేళ్ల కిందట ఏపీ సీఎం చంద్రబాబు కు మంత్రి నారాయణ ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పదవి నుంచి తితిదే ఈవోగా బదిలీ అయిన సాంబశివరావు ఇప్పుడు చంద్రబాబుకు ఏమాత్రం నచ్చని కేసీఆర్ ఆను ఈ రేంజిలో పొగడడం ఆయనకు ఇబ్బందులు తేవొచ్చంటున్నారు. ముక్కుసూటి అధికారిగా పేరున్న సాంబశివరావు వివాదాస్పదుడేమీ కాదు. అయితే... వాస్తవాలను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తారు. మరి.. ఇప్పుడు కేసీఆర్ సమర్పించిన కానుకలు నిజంగానే సమకాలీనంగా చూసుకుంటే ఇంకెవరూ దరిదాపుల్లో లేని స్థాయిలో ఉన్నాయి. అందుకే ఆయన్ను చక్రవర్తులు, రాజులతో పోల్చారు. కానీ.. చంద్రబాబుకు ఈ మాటలు రుచిస్తాయో లేదో చూడాలి.
    
మరోవైపు చంద్రబాబు కార్యాలయంలోకి సమర్థులైన అధికారులను నియమించేందుకు యోచిస్తున్నారు. ఐఏఎస్ ల పెర్ఫార్మెన్సులపై చంద్రబాబు తెప్పించుకున్న ఫీడ్ బ్యాక్ ప్రకారం సాంబశివరావు టాప్ లో ఉన్నారు. ఇలాంటి వేళ ఈ వ్యాఖ్యలు ఆయన అవకాశాలకు గండి కొడతాయని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News