దేశ రవాణాలో ఓ కొత్త విప్లవం... ఏమిటీ 'భారత్ ట్యాక్సీ'..!
ఓలా, ఉబర్ వంటి దిగ్గజాలకు ప్రత్యామ్నాయంగా రంగంలోకి దిగబోతున్న భారత్ ట్యాక్సీ వల్ల ప్రయాణికులకు పలు ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.;
సిటీల్లో ఆఫీసు నుంచి ఇంటికి, ఇంటినుంచి ఆఫీసుకి.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సొంత వాహనాలపై తిరగడం కంటే.. క్యాబ్ లపై ఆధారపడే అలవాటు ఇటీవల పెరిగిపోయిన సంగతి తెలిసిందే! ట్రాఫిక్ సమస్యకు ఇదోక ప్రత్యామ్నాయం గా కూడా భావిస్తారు! యాప్ ఓపెన్ చేసి లొకేషన్ పెడితే నిమిషాల్లో వాహనం వచ్చి ఆగిపోతుంది. అయితే ఈ వ్యవస్థ ఇప్పటివరకూ ప్రైవేటు దిగ్గజాల ఆధిపత్యంలో ఉండగా.. ఇప్పుడు ప్రభుత్వం అందులోకి ఎంట్రీ ఇస్తోంది.
అవును... ఇప్పటివరకూ క్యాబ్ సర్వీసులంటే ఓలా, ఊబర్, ర్యాపిడో, స్కై క్యాబ్ వంటివి మాత్రమే కనిపించేవి. అవి పూర్తిగా ప్రైవేటు సంస్థల ఆధిపత్యంలో నడిచేవి. ఈ నేపథ్యంలో.. ఈ ఆన్ లైన్ ట్యాక్సీ మార్కెట్ లోకి ప్రభుత్వ మద్దతుతో "భారత్ ట్యాక్సీ" సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయి. అధిక ఛార్జీలు, క్యాన్సిలేషన్ ఛార్జీలు వంటి సమస్యలతో విసిగిపోతున్న ప్రయాణికులకు.. తక్కువ కమిషనలతో సర్ధుకుపోతూ సతమతమవుతున్న డ్రైవర్లకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
ప్రయాణికులకు కలిగే లాభాలు!:
ఓలా, ఉబర్ వంటి దిగ్గజాలకు ప్రత్యామ్నాయంగా రంగంలోకి దిగబోతున్న భారత్ ట్యాక్సీ వల్ల ప్రయాణికులకు పలు ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. వాస్తవానికి ప్రయాణికులు తరచూ ఎదుర్కొనే రద్దీ సమయాల్లో ఎక్కువ ధరలు, డ్రైవర్ల రైడ్ క్యాన్సిలేషన్, మొదలైన సమస్యలకు భారత్ ట్యాక్సీ చెక్ పెట్టనుమని అంటున్నారు. పైగా కంపెనీ తీసుకునే కమిషన్ తగ్గడం వల్ల ప్రయాణికులపై పడే భారం సహజంగానే తగ్గనుందని చెబుతున్నారు.
దీనికి తోడు సమయంతో సంబంధం లేకుండా.. రద్దీ సమయాల్లో కూడా ధరలు స్థిరంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని అంటున్నారు. అన్నింటికంటే ప్రధానంగా... ప్రభుత్వ గుర్తింపు పొందిన డ్రైవర్లు ఉండటం వల్ల ప్రయాణికులు మరింత సేఫ్ గా ఫీలవ్వొచ్చని.. సురక్షితంగా ప్రయాణిమొచ్చని అంటున్నారు.
డ్రైవర్లకు చేకూరే ప్రయోజనాలు!:
ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలు అలా ఉంటే.. ఇక డ్రైవర్ల సంపాదనను మెరుగు పరచడంలోనూ ఈ భారత్ ట్యాక్సీ కీలక భూమిక పోషించనుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న దిగ్గజ సంస్థలు డ్రైవర్ల సంపాదనలో సుమారు 30శాతం వరకూ కమిషన్ రూపంలో తీసుకుంటున్నాయని చెబుతోన్న వేళ.. భారత్ ట్యాక్సీ ఈ విధానాన్ని పూర్తిగా మార్చేయనుందని చెబుతున్నారు. ఇందులో భాగంగా... 20% మాత్రమే మెయింటినెన్స్ ఛార్జీలు, ట్యాక్సుల రూపంలో కట్ చేయనుందని అంటున్నారు.
అందుకే భారత పౌర రవాణా విభాగంలో దీన్ని సరికొత్త విప్లవంగా పలువురు భావిస్తున్నారు. తక్కువ ఖర్చుతో సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా మొదలవబోతున్న ఈ ప్రయోగం జనవరి 1 నుంచి దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఇది సక్సెస్ అయితే త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ విస్తరించే అవకాశం ఉందని చెబుతున్నారు.