బీజేపీకి రాయదుర్గం తంటా.. ఏం జరుగుతోంది ..!
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయాలు.. వేడివేడిగా ఉన్నాయి.;
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయాలు.. వేడివేడిగా ఉన్నాయి. కూటమి నాయకుల మధ్య సఖ్యత ఎలా ఉన్నా.. ఇక్కడ పాలిటిక్స్ మాత్రం నేతల మధ్య తీవ్ర వివాదాలకు దారి తీస్తున్నాయి. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయనకు ఎలాంటి హామీ దక్కలేదు. అయితే.. బీజేపీ నేతలతో ఆయనకు ఉన్న సంబంధాల నేపథ్యంలో తనకే దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు.
అయితే.. ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న కాల్వ శ్రీనివాసులు.. కాపు రామచంద్రారెడ్డి హవాకు బ్రేకులు వేస్తు న్నారన్న టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో టీడీపీ నాయకులను ఆయన తన వెంటే ఉండేలా ప్లాన్ చేశారు. అంతేకాదు.. కాపు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంచుతున్నారన్న చర్చ సాగుతోంది. ఈ పరిణామాలు కూటమిలో కలవరం రేపుతున్నాయి. నిజానికి కాపు వైసీపీలో ఉన్నప్పుడు.. 2019లో విజయం దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇవ్వలేదు.
దీంతో పార్టీపై అలిగిన కాపు.. బీజేపీ బాటపట్టారు. వాస్తవానికి నియోజకవర్గంలో బీజేపీ హవా పెద్దగా లేదు. ఉన్న వైసీపీ, టీడీపీ కేడర్‌నే తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాపు ప్రయత్నిస్తున్నారు. ఇది కాల్వకు ఇబ్బందిగా మారుతోంది. మరోవైపు కూటమి నాయకులు కలివిడిగా ఉండాలని చెబుతున్నా.. ఇరువురి మధ్య సీటు వ్యవహారం.. కేడర్ వ్యవహారం చర్చనీయాంశంగా మారి.. వివాదాలకు దారితీస్తోంది. ఇటీవల తన బంధువులపై కొందరు దాడులు చేయడాన్ని కాపు సీరియస్‌గా తీసుకున్నారు.
దీని వెనుక కాల్వ రాజకీయం ఉందన్నది ఆయన ఆరోపణ. కానీ, తనకు సంబంధం లేదని.. కాపును బీజేపీ నాయకులు కూడా దూరం పెడుతున్నారని కాల్వ చెబుతున్నారు. ఆయన ఆదిపత్య రాజకీయాలు చేస్తు న్నారని.. వీటిని సహించలేకే.. కొందరు దాడులు చేస్తున్నారని ఆయన అంటున్నారు. దీంతో రాయదుర్గం లో గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలు వేడెక్కాయి. ఇరు పక్షాల్లో ఎవరూ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి అయితే కనిపించడం లేదు. దీనిని సాల్వ్ చేసేందుకు కూడా కూటమి నాయకులు ముందుకు రావడం లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.