పెట్రోల్, డీజిల్ కార్లపై పూర్తి నిషేధం.. ఈయూ బ్యాక్ స్టెప్ వెనుక!
అవును... 2035 నాటికి కొత్త పెట్రోల్, డీజిల్ వాహనాల అమ్మకాలను నిషేధించాలని యూరోపియన్ యూనియన్ ప్రణాళిక రచించుకున్న సంగతి తెలిసిందే.;
వాతావరణంలో కాలుష్యం రోజు రోజుకీ పెరిగిపోతుందని.. అందుకు ప్రతీ శీతాకాలంలో ఢిల్లీలో కనిపించే పరిస్థితులే ఒక ఉదాహరణ అని.. ఆ వాయు కాలుష్య సమస్య పరిష్కారానికి పెట్రోల్, డీజిల్ కార్లపై పూర్తి నిషేధం విధించడమే సరైన చర్య అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో యురోపియన్ యూనియన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే... తాజాగా ఆ నిర్ణయం నుంచి బ్యాక్ స్టెప్ వేసింది.
అవును... 2035 నాటికి కొత్త పెట్రోల్, డీజిల్ వాహనాల అమ్మకాలను నిషేధించాలని యూరోపియన్ యూనియన్ ప్రణాళిక రచించుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ ప్రణాళిక నుంచి వెనక్కి తగ్గింది. ఈ క్రమంలో... ఆ తేదీ నుంచి విక్రయించబడే కొత్త వాహనాలు జీరో ఎమిషన్ (సున్నా ఉద్గారం) గా ఉండాలని పేర్కొంటున్నాయి.
యూరోపియన్ యూనియన్ కొత్త ప్రణాళిక ప్రకారం 2035 నుంచి అమ్ముడయ్యే కొత్త కార్లలో 90శాతం కంటే ఎక్కువ సున్నా ఉద్గారాలను కలిగి ఉండాలి. మిగిలిన 10% హైబ్రిడ్ లతో పాటు సంప్రదాయ పెట్రోల్ లేదా డీజిల్ కార్లతో తయారు చేయవచ్చు. ఈ సమయంలో.. యూరోపియన్ కార్ల తయారీదారుల సంఘం ఏసీఈఏ ప్రకారం.. ఎలక్ట్రిక్ కార్లకు మార్కెట్ డిమాండ్ ప్రస్తుతం చాలా తక్కువ ఉంది.
అదే నిబంధనల్లో మార్పుకు కారణం అని చెబుతున్నారు. ఈ సమయంలో.. పెట్రోల్, డీజిల్ వాహనాల ద్వారా సృష్టించబడే అదనపు ఉద్గారాలను భర్తీ చేయడానికి.. బయో ఇంధనాలు, ఇ-ఇంధనాలు అని పిలవబడే వాటి వాడకంలో పెరుగుదల కూడా ఉంటుందని యూరోపియన్ యూనియన్ ఆశిస్తోంది. అయితే ఈ చర్యను వ్యతిరేకిస్తున్నవారు మాత్రం.. ఇది ఎలక్ట్రిక్ వాహనాలవైపు పరివర్తనను దెబ్బతీసే ప్రమాదం ఉందని అంటున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన ఏసీఈఏ డైరెక్టర్ జనరల్ సిగ్రిడ్ డి విరీస్... 2030 సమీపిస్తోంది.. ఛార్జింగ్ పాయింట్లను నిర్మించడానికి, మార్కెట్ ను గాడిలో పెట్టడానికి ఆర్థిక, కొనుగోలు ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టడానికి సమయం పడుతుందని.. ఉద్యోగాలు, పెట్టుబడులు కొనసాగించడానికి తయారీదారులకు ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వాలని తెలిపారు.
అంటే... పెట్రోల్, డీజిల్ రహిత వాహనాల అమలు విషయం అంత ఈజీ కాదన్న మాట. ఈ సంగతి తాజాగా యూరోపియన్ యూనియన్ తీసుకున్న నిర్ణయమే ఉదాహరణ. పూర్తి ఈవీ యుగం రావడం కన్ఫామ్.. కాకపోతే మరింత సమయం పడుతుందన్నమాట!