ట్రంప్ వర్సెస్ బైడెన్.. వాడివేడిగా ఎన్నికల డిబేట్

Update: 2020-09-30 04:30 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన అభ్యర్థుల డిబేట్ వాడీవేడిగా జరిగింది. అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్తి డొనాల్డ్ ట్రంప్ ఈ ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. క్లీవ్ లాండ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సంధానకర్తగా క్రిస్ వాలెస్ వ్యవహరించారు.

ఈ సందర్భంగా ట్రంప్, బైడెన్ లు కొదమ సింహాల వలే అమెరికాలో సమస్యలపై చర్చలో దుమ్మెత్తిపోసుకున్నారు. ముఖ్యంగా అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ఎంపికలో వచ్చిన ఆరోపణలు, విమర్శలతో చర్చ ప్రారంభమైంది. ఆ తరువాత కరోనా విజృంభణ, నల్లజాతీయుల నిరసన, సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్నికతోపాటు కీలక అంశాలపై ఇద్దరు అభ్యర్థులు తమ అభిప్రాయాలు, విధానాలు ప్రస్తావించారు.

కరోనాను నియంత్రించడంలో ట్రంప్ విఫలమయ్యాడని బైడెన్ ఆరోపించారు. అమెరికా ప్రజల వైద్య, ఆరోగ్య విధానంపై ట్రంప్ కు ప్రణాళిక లేదన్నారు. ఒబామా కేర్ కు ప్రత్యామ్మాయంగా ఎందుకు కొత్త పథకం తీసుకురాలేదని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యాన్ని పెడచెవిన పెట్టాడని విమర్శించారు.

ఇక ట్రంప్ వీటికి కౌంటర్ ఇచ్చారు. డెమొక్రటిక్ పార్టీ 47 ఏళ్ల పాలనలో అమెరికాకు చేసిందేమీ లేదన్నారు. భారత్ సహా ఇతర దేశాల్లో కరోనాతో ఎంతమంది చనిపోయారో బైడెన్ కు తెలియదా అని ప్రశ్నించారు. తాము అప్రమత్తత వల్లే మరణాలు తగ్గాయన్నారు.పత్రికలు, మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధంగా ఉన్నామని.. అన్ని సౌకర్యాలు సిద్దం చేశామన్నారు.

ఇక సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ఎంపికలో వచ్చిన ఆరోపణలను బైడెన్ ప్రస్తావించారు. ట్రంప్ హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు. అయితే గత ఎన్నికల్లో గెలిచిన పార్టీకే సుప్రీం కోర్టు నియామకాల్లో పూర్తి స్వేచ్చ ఉంటుందని ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. పారదర్శక విధానాలు అవలంభిస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా కరోనా బారిన పడ్డ దేశాలు, మరణాల సంఖ్యను పోల్చుతూ ఇండియా దీన స్థితిని ట్రంప్ తన చర్చలో వాడుకున్నారు. ఈ క్రమంలోనే భారత్ లో అమెరికా కంటే ఎక్కువ నమోదవుతున్నాయంటూ కవర్ చేసుకున్నారు.
Tags:    

Similar News