దేవాదాయ శాఖ ఏసీ శాంతి అవినీతి ‘విశ్వరూపం’.. నాలుగేళ్లలోనే అన్ని కోట్లా?
అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) శాంతి ఆస్తుల చిట్టా అవినీతిలో కొత్త రికార్డులు నమోదు చేసిందని టాక్ వినిపిస్తోంది.;
అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) శాంతి ఆస్తుల చిట్టా అవినీతిలో కొత్త రికార్డులు నమోదు చేసిందని టాక్ వినిపిస్తోంది. ఉద్యోగంలో చేరిన కేవలం నాలుగేళ్లలోనే ఏసీ శాంతి భారీగా ఆస్తులు కూడగట్టారని ఏసీబీ అధికారులు గుర్తించారు. లగ్జరీ ప్లాట్లు, కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన శాంతి ఇప్పటివరకు నమోదైన అవినీతి కేసుల్లో కొత్త రికార్డు నెలకొల్పారని వ్యాఖ్యానిస్తున్నారు. మంగళవారం శాంతి, ఆమె కుటుంబ సభ్యుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినట్లు గుర్తించి అరెస్టు చేశారు.
దేవాదాయశాఖలో ఏసీ శాంతి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగంలో చేరిన నాలుగేళ్లలోనే ఆమె రికార్డు స్థాయిలో ఆస్తులు పోగేసుకున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శాంతి అక్రమాస్తుల లిస్టు చూస్తే ఆమె ఇంత డబ్బు ఎలా సంపాదించారనేది అంతుచిక్కడం లేదని అంటున్నారు. 2020లో దేవాదాయశాఖ ఏసీగా విశాఖలో ఉద్యోగంలో చేరిన శాంతి 2024 జూన్ నుంచి సస్పెన్షన్ లో ఉన్నారు. రెండు రోజుల క్రితమే ఆమెపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. సస్పెండ్ అయిన ఏడాదిలోగా చర్యలు తీసుకోకపోతే పోస్టింగు ఇవ్వాలనే నిబంధనలతో హైకోర్టు ఆ తీర్పు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం సైతం శాంతిపై విధించిన సస్పెన్షన్ ను ఉపసంహరించుకుంది. ఇంతలోనే ఆమె అక్రమాస్తులపై ఏసీబీ పంజా విసిరింది.
మంగళవారం విశాఖపట్నం, తాడేపల్లిలో ఆకస్మిక తనఖీలు చేసిన ఏసీబీ అధికారులు శాంతికి చెందిన పలు ఆస్తులు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో త్రీబెడ్ రూం ప్లాట్, తాడేపల్లిలో మూడు అంతస్థుల విల్లా, సుమారు 770 గ్రాముల బంగారం, మూడు కిలోల వెండి, ఖరీదైన కారు, మోటార్ సైకిళ్లు, ఎలక్ట్రినిక్ వస్తువులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇవన్నీ అక్రమంగా సంపాదించినవే అంటూ ఆరోపిస్తున్నారు. 2020లో ఏపీపీఎస్సీ ద్వారా దేవాదాయశాఖలో ఉద్యోగం సంపాదించిన శాంతి విశాఖ అసిస్టెంట్ కమిషనర్ గా ఫస్ట్ పోస్టింగ్ దక్కించుకున్నారు. న్యాయవాద వృత్తిని చదివి హైదరాబాద్ లో కొన్నాళ్లు పనిచేసిన శాంతి ఓ సూట్ కేసుతో విశాఖలో అడుగు పెట్టినట్లు చెబుతున్నారు. తొలుత ఓ చిన్నగదిని అద్దెకు తీసుకుని ఆ తర్వాత పెద్ద ఇంటికి మారారని, కొద్దిరోజుల్లోనే మూడు పడక గదుల విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారని ఆరోపిస్తున్నారు.
ఏ ప్రభుత్వ ఉద్యోగి సంపాదించలేని విధంగా అసాధారణ ఆస్తులు సంపాదించి ఏసీ కొత్త రికార్డు నమోదు చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. దేశంలో అత్యున్నతస్థాయి అధికారుల నాలుగేళ్ల జీతం లెక్క వేసినా ఇంత సంపాదన ఉండదని అంటున్నారు. విశాఖనగరంలోని విలువైన దేవాదాయ భూములను అడ్డుపెట్టుకుని శాంతి భారీగా డబ్బు సంపాదించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖలో పనిచేసిన సమయంలో ఏసీ శాంతిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పటి అధికార పార్టీ అండదండలతో ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాంతిని పక్కన పెట్టింది. ఇప్పటివరకు ఆమెకు పోస్టింగ్ ఇవ్వలేదు. అదే సమయంలో ఆమెతో నిర్బంధ ఉద్యోగ విరమణ చేయించాలని ప్రయత్నాలు జరిగాయని అంటున్నారు. అయితే సచివాలయం స్థాయిలో ఆ ఫైలు నిలిపివేశారని అంటున్నారు. మొత్తానికి తాజా అరెస్టుతో శాంతి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.