స్లీపర్ బస్సులపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ట్రావెల్స్ కి భారీ దెబ్బ!
వరుస ప్రమాదాలతో ప్రైవేటు ట్రావెల్స్ లో సంస్కరణలు ప్రవేశపెట్టే దిశగా ఏపీ ప్రభుత్వం పావులు కదుపుతోంది.;
వరుస ప్రమాదాలతో ప్రైవేటు ట్రావెల్స్ లో సంస్కరణలు ప్రవేశపెట్టే దిశగా ఏపీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. ప్రధానంగా ప్రమాదాలకు కారణమవుతున్న స్లీపర్ బస్సులపై సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాలకు వస్తున్న బస్సులతోపాటు రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, తిరుపతి నుంచి నడుస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ విషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని చెబుతున్నారు. ప్రధానంగా ప్రైవేటు ట్రావెల్స్ లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్లీపర్ బస్సులను రద్దు చేయాలనే అంశంపై ప్రభుత్వం సీరియస్ గా చర్చిస్తోందని అంటున్నారు.
ఏపీలో ప్రైవేటు ట్రావెల్స్ కి చెందిన స్లీపర్ బస్సు సర్వీసులను రద్దు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ దిశగా ఆదేశాలు విడుదల చేయనున్నారని చెబుతున్నారు. రవాణాశాఖ ఉన్నతాధికారులు ఈ విషయమై చర్చిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రైవేటు బస్సులు తరచూ ప్రమాదానికి గురవుతున్నాయి. కర్నూలు, మార్కాపురం బస్సు ప్రమాదాలతో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర ఘటనల సమయంలో స్లీపర్ బస్సులు దహనం అవుతున్నాయి. బస్సుల్లో మంటలు వ్యాపించే సమయంలో తప్పించుకోడానికి వీలులేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఈ కారణంగానే ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందిందని అంటున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ అధికారుల స్థాయిలో జరుగుతున్న చర్చల సారాంశం ప్రకారం రాష్ట్రంలో నడుస్తున్న స్లీపర్ బస్సుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 300 కి.మీ. కన్నా ఎక్కువ దూరం ప్రయాణించే బస్సులకు కనీసం ఇద్దరు డ్రైవర్లు ఉండాలనే నిబంధన పక్కాగా అమలు చేయడం ఒకటైతే, ఆర్టీసీ సర్వీసులు మాదిరిగా ప్రైవేటు బస్సులకు నిర్దేష్ట వేగం నిర్ధారించడం, నిర్దేశించిన సమయం కన్నా ముందు గమ్యస్థానాలకు చేరుకునే బస్సు సర్వీసులకు అపరాధ రుసుం విధించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. దీనివల్ల అధిక వేగాన్ని నియంత్రించి ప్రయాణికుల ప్రాణాలకు భద్రత కల్పించే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.
మరోవైపు రాత్రిపూట నడిచే బస్సుల్లో రెండో డ్రైవర్ నిద్రపోయేందుకు ఒక సీటు కచ్చితంగా రిజర్వు చేయాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తోందని చెబుతున్నారు. అంతేకాకుండా బస్సుల్లో సీసీ కెమెరాలు అమర్చాలని సూచిస్తున్నారు. అగ్నిప్రమాదాలు సంభవించే సమయంలో మంటలు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వంటివాటిపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేలా అధ్యయనం చేస్తున్నట్లు చెబుతున్నారు. కర్నూలు ప్రమాదం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 50 బస్సులను సీజ్ చేశారు. ఆ తర్వాత కూడా కొన్ని బస్సులు ప్రమాదానికి గురికావడంతో ప్రభుత్వం అంతర్మథనానికి గురవుతోందని చెబుతున్నారు. ప్రధానంగా మార్కాపురం బస్సు ప్రమాదం తర్వాత రాష్ట్రంలో స్లీపర్ సర్వీసులు నిలిపివేయాలనే ప్రతిపాదనపై సీరియస్ గా దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే స్లీపర్ సర్వీసులు నిలిపివేసే ప్రతిపాదన ఆచరణ సాధ్యమేనా? అన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోనడిచే బస్సులు ఎక్కువగా ఇతర రాష్ట్రాల్లో రిజస్టర్ అయినవే అంటున్నారు. ఆల్ ఇండియా పర్మిట్ తో నడుస్తున్న ఈ బస్సు సర్వీసులను రాష్ట్రం రద్దు చేయడం కుదురుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో రెండు పట్టణాలు లేదా నగరాల మధ్య నడిచే బస్సులు, రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులను ప్రభుత్వం నియంత్రించే అవకాశం ఉన్నప్పటికీ, ఇతర రాష్ట్రాలు నుంచి నడిచే బస్సులు, లేదా రాష్ట్రం మీదుగా వెళ్లే అంతర్ రాష్ట్ర సర్వీసుల విషయంలోనే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.