పరాయి దేశంలో ఆవిరైన ఇంజినీరింగ్ కల.. 21 ఏళ్ల శ్రీరామ్ విషాదాంతం!

ఉన్నత విద్య కోసం ఎన్నో ఆశలతో విదేశీ గడ్డపై అడుగుపెట్టిన విద్యార్థులు, విగతజీవులుగా స్వదేశానికి తిరిగి రావడం కంటే పెద్ద విషాదం మరొకటి ఉండదు.;

Update: 2026-04-08 07:18 GMT

ఉన్నత విద్య కోసం ఎన్నో ఆశలతో విదేశీ గడ్డపై అడుగుపెట్టిన విద్యార్థులు, విగతజీవులుగా స్వదేశానికి తిరిగి రావడం కంటే పెద్ద విషాదం మరొకటి ఉండదు. ఒకవైపు ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలనే తపన.., మరోవైపు ఊహించని ప్రమాదాలు.. ఈ రెండింటి మధ్య ఎంతో మంది భారతీయ విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా న్యూజిలాండ్ నుంచి వచ్చిన వార్త వింటే గుండె తరుక్కుపోతోంది. కేవలం సరదా విహారయాత్ర ఒక కుటుంబంలో తీరని చీకటిని నింపుతుందని ఎవరూ ఊహించలేదు.

ఈస్టర్ పర్యటనలో ప్రమాదం..

భారత సంతతికి చెందిన 21 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి శౌర్య శ్రీరామ్, తన స్నేహితులతో కలిసి ఈస్టర్ సెలవులను ఆస్వాదించడానికి న్యూజిలాండ్‌లోని టౌపో సరస్సు ప్రాంతానికి వెళ్లాడు. ఏప్రిల్ 5న సుదీర్ఘ వారాంతం కావడంతో అందరూ కలిసి విహారయాత్రకు ప్లాన్ చేసుకున్నారు. సరదాగా నదిలో ఈత కొట్టడానికి దిగిన శ్రీరామ్, దురదృష్టవశాత్తు నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు అతడిని బయటకు తీసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ, ఫలితం దక్కలేదు. వైద్య సాయం అందేలోపే కన్నుమూశాడు.

అప్పుడే మొదలైన వసంతం.. ఇంతలోనే!

శౌర్య శ్రీరామ్ ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. విశేషం ఏంటంటే, మార్చి 1వ తేదీ అతను 21వ ఏట అడుగుపెట్టాడు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై కేవలం వారం మాత్రమే గడిచింది. ఉత్సాహంగా చదువును కొనసాగిస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం స్నేహితులను, తోటి విద్యార్థులను విషాదానికి గురిచేసింది. ఒక ప్రతిభావంతుడైన విద్యార్థి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం విశ్వవిద్యాలయానికి కూడా తీర్చలేని లోటే.

ముంబైలో ఉంటున్న శ్రీరామ్ తల్లిదండ్రులు ఈ వార్త విన్నప్పటి నుంచి స్పృహలో లేరు. కన్నకొడుకు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడని ఆశించిన ఆ తల్లిదండ్రులకు ఇది కోలుకోలేని దెబ్బ. వాస్తవానికి అతని తల్లిదండ్రులు ఇద్దరూ ఒకప్పుడు న్యూజిలాండ్‌లో శాశ్వత నివాసితులుగా ఉన్నారు, తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చారు. తన కొడుకును చదువు కోసం తాము నివసించిన దేశానికే పంపారు, కానీ అదే దేశం తమ బిడ్డను దూరం చేస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు.

చివరి చూపు కోసం ప్రయత్నాలు

ప్రస్తుతం శ్రీరామ్ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం భారతదేశానికి తీసుకువచ్చేందుకు బంధువులు, స్నేహితులు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి న్యూజిలాండ్‌లోని భారత రాయబార కార్యాలయం, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పరాయి దేశంలో ప్రాణాలు కోల్పోయిన తమ బిడ్డ కడచూపునకు ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం.

ఈ ఘటన విదేశాల్లో చదువుకుంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులకు ఒక హెచ్చరిక లాంటిది. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు, ముఖ్యంగా జలవనరులు, కొండల వద్ద విహారయాత్రలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాతావరణ పరిస్థితులు, నీటి లోతుపై అవగాహన లేకపోవడం ఇలాంటి ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తున్నాయి.

Tags:    

Similar News