వెనెజువెలా అధ్యక్షుడిగా ట్రంప్.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..

అమెరికా అంటే అగ్రరాజ్యం.. ప్రపంచానికి పెద్దన్నగా గుర్తింపు సంపాదించుకున్న ఈ దేశం ట్రంప్ ఈ టర్మ్ రాక ముందు బాగానే ఉండేది.. ఒకరిద్దరు ప్రెసిడెంట్లు కొంచెం అవగాహన లోపంతో ఉన్నా.. కాలం గడిచింది.;

Update: 2026-04-08 07:11 GMT

అమెరికా అంటే అగ్రరాజ్యం.. ప్రపంచానికి పెద్దన్నగా గుర్తింపు సంపాదించుకున్న ఈ దేశం ట్రంప్ ఈ టర్మ్ రాక ముందు బాగానే ఉండేది.. ఒకరిద్దరు ప్రెసిడెంట్లు కొంచెం అవగాహన లోపంతో ఉన్నా.. కాలం గడిచింది. కానీ ట్రంప్ ఈ టర్మ్ లో చేస్తున్న పనులు.. తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.. నిర్ణయాలు పక్కన పెడితే.. ఆయన వ్యాఖ్యలు కూడా ఒక్కోసారి నవ్వు, మరోసారి కోపం తెప్పించేలా ఉంటున్నాయి. డొనాల్డ్ ట్రంప్ నోటి నుంచి వచ్చే ప్రతి మాట సంచలనమే. అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడిగా ఉంటూనే, మరో దేశానికి కూడా తానే లీడర్ అవుతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తనదైన శైలిలో హాస్యాన్ని, రాజకీయ వ్యూహాన్ని కలగలిపి ఆయన మాట్లాడే తీరు చూస్తుంటే.. భవిష్యత్తులో గ్లోబల్ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయో అన్న ఆసక్తి కలుగుతోంది. ఒకవైపు వెనెజువెలాపై ప్రేమను కురిపిస్తూనే, మరోవైపు మిత్రదేశాల తీరుపై ఆయన విరుచుకుపడ్డారు.

వెనెజువెలా అధ్యక్షుడిగా ట్రంప్?

శ్వేతసౌధంలో విలేకర్లతో మాట్లాడుతూ ట్రంప్ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. వెనెజువెలాలో తనకు ప్రజాదరణ పుష్కలంగా ఉందని, ఒకవేళ తాను అక్కడ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే రికార్డు స్థాయి ఓట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ‘అమెరికా అధ్యక్షుడిగా నా పదవీకాలం ముగిశాక, వెనెజువెలా వెళ్లి అక్కడి అధ్యక్షుడిగా పోటీ చేస్తానేమో’ అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడితో అమెరికా సంబంధాలు బాగున్నాయని, ఇప్పటికే అక్కడి నుంచి కోట్లాది బ్యారళ్ల చమురు దిగుమతి చేసుకున్నామని ఆయన గుర్తు చేశారు.

మిత్రదేశాలపై అగ్గిమీద గుగ్గిలం

ఇరాన్‌తో జరిగిన యుద్ధం విషయంలో అమెరికాకు అండగా నిలవని మిత్రదేశాలపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా వంటి దేశాలు కష్టకాలంలో తమకు సాయం చేయలేదని మండిపడ్డారు. ఈ యుద్ధం నాటో ప్రతిష్టపై మాయని మచ్చను మిగిల్చిందని, ఇది తన మనసు నుంచి ఎప్పటికీ చెరిగిపోదని వ్యాఖ్యానించారు. గ్రీన్‌లాండ్ అంశం వచ్చినప్పటి నుంచే నాటోతో విభేదాలు మొదలయ్యాయని స్పష్టం చేశారు.

సైనిక రక్షణ ఇచ్చినా ఫలితం శూన్యం..

జపాన్ - దక్షిణ కొరియా దేశాలకు అమెరికా ఇస్తున్న సైనిక రక్షణను ట్రంప్ ప్రస్తావించారు. ఉత్తర కొరియా నుంచి రక్షించేందుకు జపాన్‌లో 50 వేల మంది, దక్షిణ కొరియాలో 45 వేల మంది అమెరికా సైనికులను మోహరించామని, ఇంత చేస్తున్నా ఆ దేశాలు తమకు యుద్ధంలో సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కిమ్ జోంగ్ ఉన్‌తో తనకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతూనే, సహాయం చేయని దేశాల తీరును తప్పుబట్టారు.

యుద్ధం సమయంలో ముఖం చాటేసిన దేశాలు, ఇప్పుడు అమెరికా గెలుపు ఖరారయ్యాక సాయం చేస్తామంటూ ముందుకు రావడంపై ట్రంప్ చమత్కరించారు. సంక్షోభం ఉన్నప్పుడు అండగా నిలవని మిత్రులు, విజయం దక్కిన తర్వాత భాగస్వామ్యం కోరడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అగ్రరాజ్యంగా తాము బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు, మిత్రదేశాలు కూడా తమ వంతు బాధ్యతను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఎప్పుడూ ఒక పజిల్ లాగే ఉంటాయి. ఒకవైపు వెనెజువెలాలో పోటీ చేస్తానని చెబుతూనే, మరోవైపు ప్రపంచ దేశాలన్నింటికీ హెచ్చరిక పంపారు. అమెరికా ఇచ్చే రక్షణను అనుభవిస్తూ, అవసరమైనప్పుడు అండగా ఉండని దేశాలతో కఠినంగా ఉంటామనే సంకేతాన్ని ఇచ్చారు. ట్రంప్ పదవీకాలం ముగిశాక నిజంగానే వెనెజువెలా రాజకీయాల్లోకి వెళ్తారా లేక ఇది కేవలం ఆయన మార్క్ వ్యూహమా అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News