జనసేన బీజేపీ సీట్ల షేర్ పెరుగుతుందా ?

బూత్ లెవెల్ నుంచి పునాది బలంగా ఉన్న పార్టీ టీడీపీ. అంతే కాదు నాలుగున్నర దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా టీడీపీ క్షేత్ర స్థాయిలో పాతుకుని పోయింది.;

Update: 2026-04-08 08:30 GMT

ఏపీలో మూడు పార్టీలు కూటమిలో ఉన్నాయి. అందులో అతి పెద్ద పార్టీ టీడీపీ. బూత్ లెవెల్ నుంచి పునాది బలంగా ఉన్న పార్టీ టీడీపీ. అంతే కాదు నాలుగున్నర దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా టీడీపీ క్షేత్ర స్థాయిలో పాతుకుని పోయింది. ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ సీట్లలో అన్ని చోట్లా టీడీపీకి బలమైన పటిష్టమైన యంత్రాంగం పార్టీకి ఉంది. ఇక జనసేన తన బలాన్ని మెల్లగా విస్తరించుకుంటోంది. బీజేపీ అయితే పొత్తు పార్టీగా ఉంటూ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది.

మహత్తర అవకాశంగా :

అయితే కూటమి పార్టీలకు మహత్తర అవకాశంగా అసెంబ్లీ సీట్ల పెంపు ఉండబోతోంది అని అంటున్నారు. 2029 లో చూస్తే కనుక ఇపుడు ఉన్న 175 సీట్లు కాస్తా 263 సీట్లుగా పెరుగుతాయని అంటున్నారు. దాంతో మూడు పార్టీలకు మంచి రోజులే వచ్చినట్లు అని విశ్లేషిస్తున్నారు. 2024 ఎన్నికల్లో పొత్తుల కోసం ఎన్నో సర్దుబాట్లు దిద్దుబాట్లు చేసుకుని ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా కలసికట్టుగా పని చేయడం వల్ల విజయం సాధ్యమైంది అయితే 2029 నాటికి ఆ పరిస్థితులు ఉండకపోవచ్చు అని అంటున్నారు. మూడు పార్టీలలో ఆశావహులు త్యాగరాజులు కోటి ఆశలు పెట్టుకుని కూర్చున్నారు. సరిగ్గా అలాంటి వారి కోసమే ఈ అదనపు సీట్లు ఉంటాయని అంటున్నారు.

సీట్ల పంపకాల మీదనే :

దీంతో పెరిగే సీట్ల మీద మూడు పార్టీలలో అందరి దృష్టి ఉంది. జనసేనలో అయితే ఈసారి ఏకంగా డెబ్బై సీట్ల దాకా పోటీ చేస్తామని అంటున్న నాయకులు ఉన్నారు. బీజేపీ అయితే తన బలాన్ని ఏకంగా 30 సీట్ల దాకా పెంచుకోవాలని చూస్తోంది. టీడీపీ పెద్ద పార్టీగా తన సీట్లను కనీసంగా 200 ప్లస్ గా చేసుకోవాలని ఆరాటపడుతోంది. మరి ఈ లెక్కన చూస్తే పెరిగే 263 సీట్లు సరిపోతాయా అన్నది మరో చర్చ. అయితే కూటమి పార్టీలు జాగ్రత్తగానే ఈ సీట్ల పంపకాలను పూర్తి చేసుకుంటాయని అంటున్నారు. దానికి 2024 లో వచ్చిన ఓట్లు అపుడు ఇచ్చిన సీట్ల రేషియో అన్నది ఒక ప్రాతిపదికగా ఉండవచ్చు అని ప్రచారం సాగుతోంది.

అదే జరిగితే కనుక :

ఇక 175 సీట్లకు జనసేన 21 సీట్లలో పోటీ చేసి అన్ని సీట్లు గెలిచింది. బీజేపీకి 10 సీట్లు ఇస్తే ఎనిమిది గెలిచింది. మరి 2029లో ఈ సీట్లు పెరుగుతాయా అంటే కచితంగా పెరుగుతాయి. అయితే అవి ఒక రేషియోలోనే పంపిణీ చేసుకోవచ్చు అన్న చర్చ సాగుతోంది. జనసేనకు ఆ విధంగా చూస్తే 21 సీట్లకు రెట్టింపు లభించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంటే 42 నుంది 45 దాకా అలాగే బీజేపీకి 20 దాకా సీట్లు దక్కే చాన్స్ ఉండొచ్చు అని అంటున్నారు. ఆయా పార్టీలకు ఓట్ల షేర్ వాస్తవ బలాల అధారంగానే ఈ పంపిణీ జరగవచ్చు అని అంటున్నారు. అపుడు టీడీపీ 200 ప్లస్ సీట్లకు పోటీ చేయడానికి వీలు అవుతుందని అంటున్నారు.

ప్రత్యర్ధులకు నో చాన్స్ :

కూటమి పార్టీలు కలసికట్టుగానే 2029 ఎన్నికల్లో పోటీకి దిగాలని నిర్ణయించుకున్నాయి. ప్రత్యర్ధి వైసీపీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చూడాలని పట్టుదలగా ఉన్నాయి. అందువల్ల బలమున్న చోట తమకు పట్టున్న చోట సీట్లు తీసుకుని పోటీ చేయడం మిగిలిన చోట్ల కూటమి పార్టీలకు మద్దతు ఇవ్వడం అన్న ప్రాతిపదికగా ఈ మొత్తం వ్యవహారం ఉంటుంది అని అంటున్నారు. దాని వల్ల 2024 లో వచ్చినట్లుగా సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేటు సాధించే వీలు ఉంటుందని అదే సమయంలో అందరూ విజేతలుగా ఉంటారని భావిస్తున్నారు. మొత్తం మీద చూస్తే అదనపు సీట్ల వల్ల అన్ని పార్టీలకు మంచి అవకాశాలే లభిస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారం బట్టి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News