ట్రంప్ సంచలనం.. ఆయన గెలిస్తే.. అమెరికా చైనా చేతుల్లోకే

Update: 2020-08-22 07:10 GMT
వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు తెలిసిందే. కరోనా నేపథ్యంలో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావాలన్న ఆయన కోరిక తీరటం అంత తేలిగ్గా కనిపించటం లేదు. పరిస్థితులు తనకు ప్రతికూలంగా ఉన్న వేళలో.. వెనుకాముందు ఆలోచించకుండా విమర్శలు చేసే ట్రంప్.. తాజాగా ఆ పనిని మరింత తీవ్రతరం చేశారు. తన రాజకీయ ప్రత్యర్థి జో బెడైన్ పై ఆయన నిప్పులు చెరుగుతున్నారు.

డెమొక్ర్రాట్ల అభ్యర్థి జో బైడెన్ కానీ గెలిస్తే అమెరికా చైనా చేతుల్లోకి వెళ్లిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లకు ఉన్న చైనా బూచిని బైడెన్ కు అంటగట్టేయటం ద్వారా ఎన్నికల్లో లబ్థి పొందాలన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. అమెరికాను చైనా సొంతం చేసుకునే అవకాశం బైడెన్ గెలుపుతో ఉంటుందని భయపెడుతున్నట్రంప్.. తన వాదనకు బలం ఉందంటూ ఒక లాజిక్ బయటకు తీశారు.

తాజాగా ముగిసిన డెమొక్రాట్ల సదస్సులోనూ చైనాకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. ‘‘అమెరికాను ముక్కలు చేసేందుకు ప్రయత్నించే ఏ పార్టీని అమెరికా పౌరుడు సమర్థించడు. చాలా విషయాల్ని జో తన ప్రసంగంలో విస్మరించారు. శాంతిభద్రతల గురించి మాట్లాడలేదు. డెమొక్రాటక్ల చేతుల్లో అదుపు తప్పిన నగరాల భద్రత గురించి ఆయన ప్రస్తావించలేదు. చైనా గురించి కనీసం ఏ రూపంలోనూ ప్రస్తావించలేదు’’ అని పేర్కొన్నారు.

బైడెన్ గెలవాలని చైనా బలంగా కోరుకుంటున్న వైనాన్ని ప్రస్తావించిన ట్రంప్.. ఆ విషయాన్ని తాను చెప్పటం లేదని.. నిఘా వర్గాలే స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ఒకవేళ తాను గెలవాలని చైనా అనుకుంటే.. తనకు అంతకు మించిన అవమానం మరొకటి ఉండదన్నారు. తాను గెలవాలని చైనావారు అనుకుంటారని తాను భావించటం లేదన్నారు. చూస్తుంటే.. ఎన్నికల్లో తన విజయం మొత్తం చైనా చుట్టూ తిప్పటం ద్వారా.. తన పదవిని కాపాడుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News