నూతన సంవత్సర వేడుకల వీడియోలు.. సంస్కారం.. స్వేచ్ఛ మధ్య సన్నని గీత!

నూతన సంవత్సర వేడుకల వీడియోలు.. సంస్కారం.. స్వేచ్ఛ మధ్య సన్నని గీత!;

Update: 2026-01-02 06:54 GMT

ప్రతి ఏటా జనవరి 1వ తేదీ వచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపిస్తుంది. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికే క్రమంలో యువత చేసే సందడి అంతా ఇంతా కాదు. అయితే ఈ ఏడాది బెంగళూరు, గుర్గావ్, పుణె వంటి నగరాల నుండి వెలుగులోకి వచ్చిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చకు దారితీశాయి.

వైరల్ వీడియో హాట్ టాపిక్

పబ్బులు, క్లబ్బుల బయట మద్యం మత్తులో తూలుతూ కనీస స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న యువతను భద్రతా సిబ్బంది బయటకు తీసుకువస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలపై నెటిజన్లు రెండు గ్రూపులుగా విడిపోయి తమ వాదనలు వినిపిస్తున్నారు.

భిన్న వాదనలు

సంప్రదాయవాదులు ఈ పరిణామాలపై ఆందోళన చెందుతున్నారు. ఒక వర్గం వారు దీనిని ‘పాశ్చాత్య సంస్కృతి ప్రభావంగా అభివర్ణిస్తున్నారు. స్వేచ్ఛ పేరుతో యువత తమ హద్దులు దాటుతున్నారని వారి వాదన.. మద్యం సేవించి రోడ్లపై అసభ్యంగా ప్రవర్తించడం వల్ల భవిష్యత్తు తరాలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ వ్యవస్థ, ప్రభుత్వాలు ఇలాంటి ఉన్మాదపూరిత వేడుకలను అరికట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు నేటి తరం యువత దీనిని తమ వ్యక్తిగత హక్కుగా చూస్తోంది. నచ్చినట్టు జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని.. చట్టవిరుద్ధం కానీ పనులు చేసినప్పుడు ఇతరులు తీర్పులు ఇవ్వడం సరికాదని వారు వాదిస్తున్నారు. ఏడాది పొడవునా పడ్డ కష్టాన్ని మర్చిపోవడానికి ఒక రోజు పార్టీ చేసుకోవడంలో తప్పేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

బాధ్యతాయుతమైన స్వేచ్ఛ అవసరం..

ఈ రెండు వాదనలను గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. స్వేచ్ఛ అనేది ఎప్పుడూ ఒంటరిగా రాదు.. అది బాధ్యత తో కూడి ఉండాలి.వేడుకలు చేసుకోవడం తప్పు కాదు.. కానీ అది మన ఆరోగ్యాన్ని లేదా గౌరవాన్ని ఫణంగా పెట్టేలా ఉండకూడదు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు పక్కనున్న వారికి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం కనీస పౌర ధర్మం. ఆధునికతను ఆహ్వానించడం అంటే మన మూలాలను మర్చిపోవడం కాదు... సంస్కారం, స్వేచ్ఛ మధ్య సమతుల్యత పాటించినప్పుడే ఏ వేడుకైనా అర్థవంతంగా ఉంటుంది.

కొత్త ఏడాది కొత్త లక్ష్యాలకు నాంది కావాలి కానీ.. అనవసర వివాదాలకు వేదిక కాకూడదు. ఆనందం హద్దులు దాటినప్పుడు అది విషాదంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి యువత ఉత్సాహాన్ని బాధ్యతతో జోడించి వేడుకలను జరుపుకోవడమే ఈ చర్చకు అసలైన పరిష్కారం.




Tags:    

Similar News