కంచుకోటని నిర్మించిన గంటా

టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుది పాతికేళ్ళకు పైగా రాజకీయ ప్రయాణం.;

Update: 2026-01-02 02:59 GMT

టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుది పాతికేళ్ళకు పైగా రాజకీయ ప్రయాణం. ఒకసారి ఎంపీగా అయిదు సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఎక్కడ పోటీ చేసినా విజయం ఆయన ఖాతాలో పడుతుంది. అల అజేయుడిగా గంటాకు రికార్డు ఉంది. అంతే కాదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఏపీలో మంత్రిగా రెండేళ్ళ పాటు పనిచేశారు. టీడీపీ ప్రభుత్వంలో బాబు నాయకత్వంలో అయిదేళ్ళ పాటు కీలక మంత్రిత్వ శాఖలు చూశారు. విమర్శలు ఎవరి మీద హార్ష్ గా చేయకుండా అందరితో మంచిగా ఉంటూ అజాత శతృవుగా పేరు గడించారు గంటా. ఒక విధంగా ఆయన రాజకీయ జీవితం చాలా మందికి స్పూర్తిగా ఉంటుంది.

న్యూ ఇయర్ వేళ :

ఇక భీమిలీ నుంచి 2024 ఎన్నికల్లో రెండోమారు గెలిచిన గంటా ఈసారి సాధారణ ఎమ్మెల్యేగానే ఉంటున్నారు. దానికి సామాజిక ప్రాంతీయ సమీకరణలు కారణంగా ఉన్నాయి. అయినా సరే నిరుత్సాహం చెందకుండా ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజలతో నిత్యం మమేకం అవుతున్నారు. దాని ప్రభావం ఫలితం ఏమిటి అన్నది 2026 న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా స్పష్టంగా కనిపించింది. విశాఖలో ఉన్న గంటా నివాసానికి భీమిలీలో ఉన్న క్యాడర్ లీడర్ తో పాటు పెద్ద ఎత్తున జనాలు కూడా తరలివచ్చారు. గంటాకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పాలని వారు ఎంతో తపన పడడం చూస్తే గంటా వారితో ఎంతగా కలసిపోయారో అర్ధం అవుతుంది.

కుమారుడి కోసం :

ఇక 2029 ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయంగా విరామం ప్రకటించాలని గంటా ఆలోచిస్తున్నారు. ఆయన పుట్టిన రోజు గత నెలలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మనసులో మాటను చెప్పేశారు. రిటైర్మెంట్ జీవితం మీద కూడా తగిన యాక్షన్ ప్లాన్ తో ఉన్నారు. తన వారసుడిగా కుమారుడు గంటా రవితేజాను చూసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే ఆయన ప్రతీ పల్లెను చుట్టి వస్తున్నారు. ప్రతీ ఊరిలోకి వెళ్తున్నారు. చిన్న నుంచి పెద్ద కార్యక్రమం ఏది జరిగినా అటెండ్ అవుతున్నారు. వెంట కుమారుడిని కూడా తీసుకుని వెళ్తున్నారు. అలా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు రాచబాట వేసే ప్రయత్నంలో ఉన్నారు.

నాటి విమర్శలకు :

గంటా ఎక్కడ గెలిచినా ఆ నియోజకవర్గాన్ని అయిదేళ్ళలోనూ పెద్దగా సందర్శించినది లేదని విమర్శలు ప్రత్యర్ధులు చేస్తారు. అయితే ఆయన తనకు నమ్మకంగా ఉండేవారిని బాధ్యతలు అప్పగించి వారి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. కానీ ఈ టెర్మ్ మాత్రం అలా చేయడం లేదు, తానే అన్నింటా కనిపిస్తున్నారు. తానే ప్రతి చోటకూ వెళ్తున్నారు. అలా గంటా భీమిలీని కంచుకోటగా చేసుకున్నారు. దీంతో 2029 లో కుమారుడి విజయం ఖాయమని ప్రత్యర్ధి ఎవరైనా గంటా బ్రాండ్ పనిచేస్తుందని భావిస్తున్నారు. దాంతో పాటు భీమిలీ మొదటి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. సో గంటా మార్క్ ఎమ్మెల్యే పనితీరుతో భీమిలీ ఇపుడు పసుపు జెండా రెపరెపలతో బలంగా మారింది అని అంటున్నారు.

Tags:    

Similar News