జపాన్ వీధుల్లో భారతీయ పాప.. ఆకట్టుకుంటున్న అరుదైన వీడియో!

జపాన్‌లో ఒక భారతీయ మహిళ తన ఆరు నెలల చిన్నారితో చేసిన ప్రయాణం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.;

Update: 2026-01-02 06:58 GMT

జపాన్‌లో ఒక భారతీయ మహిళ తన ఆరు నెలల చిన్నారితో చేసిన ప్రయాణం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ అనుభవానికి సంబంధించిన వీడియో చూసినవారంతా ఎంతో ఆనందంగా ఫీలవుతున్నారు. ఆ వీడియోలో కనిపించే దృశ్యాలు చాలా అందంగా.. హృదయాన్ని తాకేలా ఉన్నాయి.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో సాయి కీర్తి అక్కినేని షేర్ చేశారు. ఆమె తన చిన్న బిడ్డతో కలిసి జపాన్‌లో తిరుగుతున్న సమయంలో ఈ దృశ్యాలను చిత్రీకరించారు. బిడ్డ స్ట్రోలర్‌లో కూర్చుని ఉండగా, అక్కడి జపాన్ ప్రజలు ఆగి నవ్వుతూ.. చేతులు ఊపుతూ.మీ చిన్న చిన్న హావభావాలతో బిడ్డను నవ్వించేందుకు ప్రయత్నించారు. ఆ క్షణాలు చూసేవారికి కూడా చిరునవ్వు వస్తుంది.

కొంతమంది బిడ్డ దగ్గరకు వచ్చి ఫన్నీ ఫేస్‌లు పెట్టారు. మరికొందరు చాలా జాగ్రత్తగా బిడ్డను ఎత్తుకుని ప్రేమగా మాట్లాడారు. బిడ్డను చూసిన ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపించింది. భాష తెలియకపోయినా..మాటలు అర్థం కాకపోయినా ప్రేమ మాత్రం అందరికీ ఒకేలా ఉంటుందనే విషయం ఈ వీడియోలో బాగా కనిపిస్తుంది.

ప్రత్యేకంగా ట్రైన్‌లో జరిగిన సంఘటనలు.. నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. ప్రయాణికులు తమ పనిలో బిజీగా ఉన్నప్పటికీ..బిడ్డను చూసిన వెంటనే ఆగి నవ్వడం, చేతులు ఊపడం, బిడ్డను సంతోషపెట్టడం చాలా అందంగా అనిపించింది. ఒక చిన్నారి ఎలా అనేక మంది మనసులను కలిపేస్తుందో ఈ వీడియో స్పష్టంగా చూపిస్తోంది.

ఈ వీడియోకి సాయి కీర్తి సరదాగా ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. “జపాన్‌లో పిల్లలు అరుదైన పోకెమాన్‌ లాంటివారు” అని ఆమె రాసింది. జపాన్‌లో పిల్లల సంఖ్య తగ్గుతూ ఉండటంతో బహిరంగ ప్రదేశాల్లో చిన్నారిని చూడడం అక్కడ అరుదుగా మారిందనే ఉద్దేశంతో ఆమె ఈ మాటలు రాసింది.

ఈ వీడియోపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. జపాన్‌లో జననాల రేటు తగ్గడం వల్లే ఇలాంటి ప్రేమాభిమానాలు కనిపిస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, ఈ వీడియో ప్రేమకు, మానవత్వానికి భాషలు..దేశాలు అడ్డుకావని మరోసారి నిరూపిస్తోంది.




Tags:    

Similar News