జీతం ఆధారిత H-1B నిబంధన: అమెరికాలో భిన్నాభిప్రాయాలు
అమెరికా వీసా విధానాల్లో ప్రతిపాదిత మార్పులు ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.;
అమెరికా వీసా విధానాల్లో ప్రతిపాదిత మార్పులు ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా హెచ్1బీ వీసా ఎంపిక ప్రక్రియను లాటరీ పద్ధతి నుంచి వేతనస్థాయిల ఆధారంగా మార్చాలన్న ప్రతిపాదన ఇప్పుడు అమెరికాలో తీవ్ర భిన్నాభిప్రాయాలకు దారితీసింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) సేకరించిన బహిరంగ అభిప్రాయాల్లో ఈ విభజన స్పష్టంగా కనిపిస్తోంది.
నిపుణుల వాదన.. ఆవిష్కరణలకు విదేశీ ప్రతిభే ప్రాణం..
అమెరికాలోని టెక్నాలజీ దిగ్గజాలు , విద్యావేత్తలు ఈ నిబందనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారి వాదన ప్రకారం.. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న అంతర్జాతీయ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు తగ్గితే ప్రతిభావంతులు కెనడా లేదా యూరప్ వంటి దేశాలకు తరలిపోయే ప్రమాదం ఉంది. అమెరికాలో ఉత్పాదకత పెరగడానికి కొత్త ఆవిష్కరణలు జరగడానికి హెచ్1బీ నిపుణులు కీలకమని వారు గుర్తు చేస్తున్నారు.
స్టార్టప్ ల ఆందోళన.. చిన్న కంపెనీల పరిస్థితి ఏమిటి?
పెద్ద టెక్ కార్పొరేట్ సంస్థలు అధిక జీతాలు ఆఫర్ చేసి అత్యున్నత స్థాయి వీసాలను దక్కించుకోగలవు. కానీ పరిమిత వనరులున్న స్టార్టప్ లు, చిన్న పరిశ్రమలు ఈ పోటీలో వెనుకబడిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైనప్పుడు వారు హెచ్1బీపైనే ఆధారపడుతుంటారు. ఈ నిబంధన వల్ల వారు నష్టపోయే అవకాశం ఉంది.
మద్దతుదారుల వాదన.. స్వదేశీ నిరుద్యోగమే ప్రధాన సమస్య
మరోవైపు ఈ నిబందనను సమర్థించే వారు కూడా గట్టిగానే వినిపిస్తున్నారు. అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ చదివిన స్థానిక గ్రాడ్యూయేట్లలో నిరుద్యోగం పెరుగుతోందని.. వారికి ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుతున్నారు. కంపెనీలు తక్కువ జీతాలకే విదేశీయులను నియమించుకుంటూ అమెరికన్ల వేతనాలు తగ్గిస్తున్నాయని కొత్త నిబంధన వల్ల ఈ దోపిడీ ఆగుతుందని వారు వాదిస్తున్నారు.
డీహెచ్ఎస్ తుది నిర్ణయం ఏమిటి?
అన్ని వర్గాల అభిప్రాయాలను సమీక్షించిన తర్వాత డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) తన వైఖరిని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన వల్ల ఆర్థిక వ్యవస్థకు నష్టం జరగదని.. పైగా ఇది కేవలం అత్యున్నత నైపుణ్యం కలిగిన, ఎక్కువ వేతనాలు పొందే నిపుణులను మాత్రమే అమెరికాకు ఆకర్షిస్తోందని పేర్కొంది.
హెచ్1బీ వీసా చర్చ కేవలం వలస విధానానికే పరిమితం కాలేదు. ఇది అమెరికా ఆర్థిక భవిష్యత్తు, రాజకీయ మనుగడకు సంబంధించిన అంశంగా మారింది. ఈ మార్పులు అమలులోకి వస్తే భారతీయ ఐటీ నిపుణులపై, ముఖ్యంగా ప్రెషర్స్, మిడ్ లెవల్ ఉద్యోగులపై దీని ప్రభావం ఎలా ఉంటుందో వేచిచూడాలి.