అహంకారానికి ₹81 లక్షల గుణపాఠం: బ్రిటన్‌లో జాతి వివక్షపై భారతీయుడి గెలుపు!
విదేశాల్లో ఉద్యోగం అంటే కేవలం డాలర్లు, పౌండ్ల సంపాదన మాత్రమే కాదు.. అదొక ఆత్మగౌరవ పోరాటం కూడా అని నిరూపించాడు తమిళనాడుకు చెందిన మాధేశ్ రవిచంద్రన్.;
విదేశాల్లో ఉద్యోగం అంటే కేవలం డాలర్లు, పౌండ్ల సంపాదన మాత్రమే కాదు.. అదొక ఆత్మగౌరవ పోరాటం కూడా అని నిరూపించాడు తమిళనాడుకు చెందిన మాధేశ్ రవిచంద్రన్. తనపై జరిగిన జాతివివక్షను మౌనంగా భరించకుండా.. చట్టం ముందు నిలబడి పోరాడి ఏకంగా 81 లక్షల రూపాయలు (75000 పౌండ్ల) భారీ పరిహారాన్ని గెలుచుకున్నాడు. బ్రిటన్ లోని ఒక కేఎఫ్.సీ అవుట్ లెట్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
అవమానాల విష వలయం..
మాధేశ్ రవిచంద్రన్ బ్రిటన్ లోని ఒక ప్రసిద్ధ ‘కేఎఫ్.సీ’ బ్రాంచ్ లో పనిచేసేవాడు. అయితే అక్కడ అతడికి ఎదురైన పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండేవి. అతడి మేనేజర్ శ్రీలంకకు చెందిన వ్యక్తి. మాధేశ్ ను నిరంతరం జాతి వివక్షతో వేధించేవాడు. బానిస అంటూ భారతీయులు మోసగాళ్లు అంటూ కించపరచడం నిత్యకృత్యంగా మారింది. సహ ఉద్యోగులందరి ముందు మాధేశ్ ను తక్కువ చేసి మాట్లాడుతూ అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. పని ప్రదేశంలో కనీసం గౌరవం లేకపోవడంతో మాధేశ్ తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాడు.
రాజీనామా ఆపై రణరంగం
అవమానాలు భరించలేక మాధేశ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సాధారణంగా చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లో మౌనంగా వెళ్లిపోతారు. కానీ మాధేశ్ అలా చేయలేదు. తనకు జరిగిన అన్యాయానికి బాధ్యులైన వారికి బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నాడు. బ్రిటన్ ఎంప్లాయిమెంట్ ట్రిబ్యూనల్ ను ఆశ్రయించి తనపై జరిగిన జాతి వివక్ష వేధింపులపై ఫిర్యాదు చేశాడు.
న్యాయస్థానం సంచలన తీర్పు
దీర్ఘకాలంగా జరిగిన ఈ విచారణలో మాధేశ్ సమర్పించిన ఆధారాలు, సాక్ష్యాలను కోర్టు నిశితంగా గమనించింది. ‘"పని ప్రదేశంలో ఒక వ్యక్తిని వారి జాతి లేదా దేశం ఆధారంగా కించపరచడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. ఇది తీవ్రమైన నేరం" అని న్యాయస్థానం స్పష్టం చేసింది.మాధేశ్ పట్ల మేనేజర్ ప్రవర్తన అత్యంత అనుచితంగా ఉందని నిర్ధారిస్తూ.. అతడికి కలిగిన మానసిక వేదనకు పరిహారంగా సుమారు ₹81 లక్షలు చెల్లించాలని తీర్పునిచ్చింది.
ప్రవాస భారతీయులకు ఒక ‘టార్చ్ లైట్’
ఈ తీర్పు విదేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయ ఉద్యోగులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. వీసా పోతుందేమో లేదా ఉద్యోగం ఊడుతుందేమో అనే భయంతో వివక్షను భరించాల్సిన అవసరం లేదని ఈకేసు నిరూపించింది. ఏ దేశంలో ఉన్నా సరే.. చట్టం అందరికీ సమానమేనని.. అన్యాయంపై గొంతెత్తితే న్యాయం జరుగుతుందని ఈ విజయం చాటిచెప్పింది.
మాధేశ్ రవిచంద్రన్ సాధించిన ఈ విజయం కేవలం ఒక వ్యక్తి గెలుపు కాదు.. గౌరవం అనేది మనిషి పుట్టుకతో వచ్చే హక్కు అని చాటిచెప్పే ఒక నైతిక విజయంగా చెప్పొచ్చు. అహంకారంతో విర్రవీగే వారికి ఇదొక హెచ్చరిక.
మాధేశ్ రవిచంద్రన్ కథ ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ. అన్యాయం ఎదురైనప్పుడు మౌనం వహించకుండా చట్టబద్ధంగా పోరాడితే ఫలితం తప్పకుండా అనుకూలంగా ఉంటుందన్నదే ఈ తీర్పు సారాంశం.