'ఎన్నారై'ల ఇలాకాల్లో.. లుకలుకలు.. !
రాష్ట్రంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్ఆర్ఐ నేతలు కొంతమంది విజయం సాధించారు.;
రాష్ట్రంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్ఆర్ఐ నేతలు కొంతమంది విజయం సాధించారు. గుడివాడ, కళ్యాణదుర్గం, బాపట్ల వంటి నియోజకవర్గంలో ఎన్నారై టిడిపి నేతలు గెలుపు గుర్రం ఎక్కారు. సుదీర్ఘకాలంగా ప్రయత్నం చేసిన వారు ఉన్నారు.. అప్పటికప్పుడు వచ్చి టికెట్ దక్కించుకుని గెలుపు గుర్రం ఎక్కిన నాయకులు కూడా ఉన్నారు. అయితే, తొలినాళ్ళల్లో ఉన్న పాజిటివిటీ ప్రస్తుతం వీరి విషయంలో తగ్గుముఖం పట్టిందన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట.
తొలినాళ్లలో ఎన్నారై టిడిపి నాయకులు ముఖ్యంగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నించారు. సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. పరిష్కారం కోసం కృషి చేశారు. సొంత నిధులను కూడా వెచ్చించారు. అయితే రాను రాను ఈ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. నాయకులు వివాదాల్లో చెక్కుకుంటున్నారు. ఆధిపత్య రాజకీయాలకు కూడా తెరదీస్తున్నారు. ముఖ్యంగా కళ్యాణదుర్గం, గుడివాడ నియోజకవర్గంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
నాయకుల పనితీరు పైన, ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా పార్టీ అధిష్టానానికి వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. కానీ గెలిచిన తొలి ఆరు మాసాల్లో మాత్రం ఇవే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు మంచి మార్కులు పడ్డాయి. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఎమ్మెల్యేల పనితీరు మైనస్‌లోకి వెళ్ళింది. ఇప్పుడు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొనే పరిస్థితి కూడా వచ్చింది. ఎంతగా అంటే అనుకూల పత్రికలు అనుకూల మీడియాలో కూడా ఆధారాలతో సహా వ్యతిరేక వార్తలు వచ్చే పరిస్థితిలోకి నాయకులు వచ్చేసారు.
మరి ఈ విషయంలో ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉంటారా లేకపోతే తమ పంథాలోనే నడుస్తారా అనేది చూడాలి. కానీ ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే ఎన్నారైలుగా గెలిచిన ఎమ్మెల్యేలు మళ్లీ అవకాశాన్ని దక్కించుకునే విషయంలో వెనకబడతారు అన్నది వాస్తవం. ఇక గుంటూరు ఎంపీగా గెలిచిన ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ప్రజలకు చేరువ కావడంలో ఇతరులకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమంతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్య ఇస్తున్నారు.
ఒక వైపు కేంద్ర మంత్రిగా ఉంటూనే మరోవైపు తరచుగా నియోజకవర్గంలో పర్యటించడం ప్రజలకు చేరువ కావడం వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ పరిణామాలను గమనిస్తే ఎన్నారై లను ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో మొదట్లో ఉన్నంత ఆసక్తికర పరిణామాలు ఇప్పట్లో ప్రస్తుతం కనిపించడం లేదనే చెప్పాలి.