కాల్పులతో దద్దరిల్లిన బళ్లారి.. అసలేమైంది? ఎందుకీ గొడవ?
బళ్లారి.. మైనింగ్ సిటీగా గాలి జనార్దన్ రెడ్డి వల్ల పాపులర్ అయిన ఈ ప్రాంతం.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే బళ్లారి నగరం ఒక్కసారిగా రణరంగంగా మారింది.;
బళ్లారి.. మైనింగ్ సిటీగా గాలి జనార్దన్ రెడ్డి వల్ల పాపులర్ అయిన ఈ ప్రాంతం.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే బళ్లారి నగరం ఒక్కసారిగా రణరంగంగా మారింది.కేవలం బ్యానర్ల తొలగింపుతో మొదలైన చిన్న వివాదం రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టి చివరకు ఒక యువకుడి ప్రాణాలు తీసే వరకు వెళ్ళింది. పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సిన రావడం రాళ్లదాడులు నాటి చార్జీలతో నగరం భయాందోళనలతో వణికిపోయింది.
వివాదానికి కారణం చిన్న బ్యానర్
గురువారం ఉదయం ఒక వర్గానికి చెందిన బ్యానర్లు అనుకోకుండా పడిపోవడంతో ఈ గొడవకు బీజం పడింది. ఆ బ్యానర్ లను కావాలనే తొలగించారని ఒక వర్గం ఆరోపించగా.. పొరపాటున పడిపోయాయని దానికి క్షమాపణలు కూడా చెప్పామని మరో వర్గం వివరణ ఇచ్చింది. అయితే ఈ సర్దుబాటు ప్రయత్నాలు ఫలించలేదు సాయంత్రానికి ఇరు వర్గాల కార్యకర్తలు భారీగా రోడ్లపైకి చేరడంతో పరిస్థితి బళ్లారిలో అదుపు తప్పింది.
రణరంగమైన వీధులు..
రాత్రివేళ ఇరువు వర్గాల మధ్య మాటల యుద్ధం కాస్త భౌతిక దాడులకు దారితీసింది. బీరు సీసాలు విసురుకోవడం కర్రలతో దాడులు చేయడం వాహనాలను ధ్వంసం చేయడంతో బళ్లారి వీధులు యుద్ధక్షేత్రాన్ని తలపించాయి. ఈ క్రమంలోనే రాజశేఖర్ అనే యువకుడు ఈ దాడుల్లో మృతి చెందడం పరిస్థితిని అత్యంత విషాదకరంగా మార్చింది .
రాజకీయ వేడి.. గాలి వర్సెస్ భరత్ రెడ్డి
ఈ ఘర్షణ కేవలం కార్యకర్తలకే పరిమితం కాకుండా రాజకీయ రంగు పులుముకుంది. గాలి జనార్దన్ రెడ్డి దీనిపై స్పందించారు. ‘‘ మా ఇంటి ఆవరణలో ఉన్న బ్యానర్లు పడిపోతే క్షమాపణలు చెప్పాను అయినా మా ఇంటి పైకి గుండాలను పంపి రాళ్లు వేయించారు నేను గంగావతి నుంచి వస్తుండగా నా భద్రత సిబ్బంది ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చింది’’ అని గాలి జనార్దన్ రెడ్డి ప్రకటన చేశారు.
నారా భరత్ రెడ్డి కౌంటర్
మరోవైపు ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపనను అడ్డుకోవడానికి ఇలాంటి ఘర్షణాలు గాలి జనార్దన్ రెడ్డి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. యువతను రెచ్చగొడుతున్నారు దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఉద్రిక్తంగా బళ్లారి
ప్రస్తుతం బళ్లారిలో అదుపుతప్పిన గొడవలతో పోలీసులు భారీగా మోహరించారు. సెక్షన్ 144 అమలులో ఉన్నట్లు తెలుస్తోంది. దుకాణాలు మూతపడ్డాయి.. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.. నగరంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఎస్పీ స్థాయి అధికారులు స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షిస్తున్నారు.
రాజకీయ వైశమ్యాల వల్ల కేవలం ఒక బ్యానర్ పడిపోయిందని ఇంత పెద్ద గొడవకు రెండు రాజకీయ గ్రూపులు పాల్పడడం.. ఇందులో సామాన్య ప్రజలు బలి కావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.పరిస్థితి ఎప్పుడు సద్దుమణుగుతుందోనని బళ్లారి వాసులు ఆందోళనగా ఎదురుచూస్తున్నారు.