మరణం ముంగిట...అతి పెద్ద నరకం
మనిషి జీవితంలో రెండు అతని ప్రమేయం తో సంబంధం లేనివి ఉంటాయి. అందులో ఒకటి జననం రెండవది మరణం.;
మనిషి జీవితంలో రెండు అతని ప్రమేయం తో సంబంధం లేనివి ఉంటాయి. అందులో ఒకటి జననం రెండవది మరణం. జననం కూడా నరకమే. కానీ అది తెలియదు, మరణం తెలిసే నరకం. కాబట్టి దాని బెంగ మనిషికి ఎక్కువగా ఉంటుంది. ఆ ఆందోళన అన్నది బాల్యంలో అసలు ఉండదు, పడుచు ప్రాయంలో అసలు ఊసే రాదు, నడి వయసులో ఎన్నో బాధ్యతలు బరువుల మధ్యన మెదడు నలిగిపోతూ ఈ తరహా ఆలోచనలకు చోటే ఇవ్వదు. మరి ఎపుడూ అంటే ఈ భౌతికపరమైన లోకంలో అన్ని బాధ్యతలను నెరవేర్చిన తరువాత తాపీగా పడక కుర్చీకి పరిమితం అయ్యాక అపుడు ఇబ్బడి ముబ్బడిగా చావుని గురించిన ఆలోచనలు తరుముకు వస్తూంటాయి.
సహచరులు ఒక్కొక్కరుగా :
తమ వయసు వారు వరస వారు, తమకు దగ్గర అనుకున్న వారు జీవిత భాగస్వాములు తోబుట్టువులు స్నేహితులు సన్నిహితులు ఇలా ఒక్కొక్కరుగా మృత్యువు కఠిన పాశానికి చిక్కి మెల్లగా అదృశ్యం అవుతున్న వేళ మిగిలిన వారికి అది మరింతగా భయపెట్టే ఆలోచనలను మెదడులో తట్టి లేపుతుంది. ఈ వయసులో వృద్ధులుగా పెద్దలుగా ఇంట్లో మిగిలిపోతూ ఉంటారు. తమ తరానికి ఆ కుటుంబంలోనే మిగిలిన తరానికి మధ్య అతి పెద్ద అంతరం ఏర్పడుతుంది. ఎవరితో తమ భావాలను పంచుకోలేరు. వేవ్ లెంగ్త్ అన్నది అసలు కుదరదు. ఇక ఏమి మాట్లాడినా పాత కాలం గొడవగా చాదస్తపు నసగా ఉంటుంది. కొన్నాళ్ళకు ఆ నోరు అలా అప్రకటిత నిషేధంగా మూసుకుపోతుంది.
భౌతిక ప్రపంచంతో :
దీంతో నెమ్మదిగా భౌతిక ప్రపంచంతో లింక్ తెగిపోతుంది. శారీరకంగా అలసిపోతారు, కాలు కదలదు, కంటి చూపు మందగిస్తుంది. మాట తడబడుతుంది, మెదడు మాత్రం చురుకుగానే పనిచేస్తుంది. అదే అతి పెద్ద శాపం కూడా అవుతుంది. ఆ సమయంలో తమ బ్యాచ్ వారు ఎవరైనా మరణించారు అన్న వార్త వారి మెదడుకు చేరితే ఇక అక్కడ నుంచి ప్రతీ సెకనూ నరకమే అవుతుంది. వారి జ్ఞాపకాలే పట్టి పీడిస్తాయి. వారు మంచాలు పట్టి ఎంతగా తీసుకుని ఎంతో వేదన రోదన అనుభవించి మరణించారు అన్న ఆలోచనలు ఈ వృద్ధ మెదళ్ళను ఒక్కలా ఉండనీయవు. రేపు తమ గతి ఏమిటి, తమకు ఎలాంటి మరణం సంభవిస్తుంది అన్నదే వారికి నిరంతరం చింతగా మారుతుంది.
ఉరి శిక్ష కంటే కూడా :
నిజానికి ఉరి శిక్షను పెద్ద శిక్ష అని అంతా అనుకుంటారు. కానీ దానికి ఒక డెడ్ లైన్ ఉంటుంది. ఈలోగానే సదరు శిక్షార్హుడు మెదడు పెట్టే టార్చర్ తో పోరాడుతుంటాడు. కానీ కాలం తెలియని ముగింపు లేని గందరగోళంలో వృద్ధులు సతమతమవుతుంటారు. ఈ నేపథ్యంలో తన వారు అనుకునే వారే దూరం పెట్టడం విమర్శలు తిట్లు శాపనార్ధాలు వారిని మానసికంగా మరింతగా కృంగదీస్తాయి. ఈ సమయంలో తలెత్తే వృద్ధాప్య సమస్యలు కూడా వారిని ఇంకా పాతాళం అంచులను చూపించేలా చేస్తాయి. దీని కంటే మరణమే మేలు కదా అని వారు అనుకోని క్షణం ఉండదు, కానీ మృత్యువు కూడా ఊరకే రాదు కదా దానికీ ఒక లెక్క ఉంది కదా.
ఆదరించి అండగా :
ఈ దేశం నిండా వయో వృద్ధులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. భారతదేశంలో సీనియర్ సిటిజన్ జనాభా అత్యంత వేగంగా పెరుగుతోంది, 2050 నాటికి వీరి సంఖ్య 347 మిలియన్లకు అంటే మొత్తం జనాభాలో ఐదవ వంతుకి చేరుకుంటుంది అని అంచనా వేస్తున్నారు. అంటే అప్పటికి భారత్ జనాభా 160 కోట్లు ఉంటే వీరు అందులో నలభై కోట్ల దాకా ఉండొచ్చు అని అంటున్నారు. ఇందులో అధికంగా మహిళా వృద్ధుల జనాభా కనిపిస్తోంది. సాధారణ జనాభా కంటే వేగంగా వృద్ధుల పెరుగుదల కూడా ఒక కీలక అంశంగా ఉంది. వీరిని గౌరవంగా చూడాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. వీరిని ఆదరించి అక్కున చేర్చుకోవాలని అండగా తాము ఉన్నామని ఒక భరోసా ఇస్తే వారి చివరి రోజులు ఎంతో కొంత మెరుగ్గా సాగుతాయని సామాజిక వేత్తలు సైతం సూచిస్తున్నారు. అయితే అత్యధిక శాతం వృద్ధులు మాత్రం దేశంలో వివక్షకు గురి అవుతున్నారు. వారిది క్షణ క్షణ నరకం అన్నట్లుగా పరిస్థితి ఉండడం అతి పెద్ద విషాదం.