వైసీపీ హాట్ టాపిక్: అవినాష్ ఆశలు తీరేనా ..!
వైసీపీ యువ నాయకుడు, విజయవాడకు చెందిన సీనియర్ పొలిటీషియన్ దేవినేని నెహ్రూ వారసుడు.. దేవినేని అవినాష్.. ఆశలు వచ్చే కొత్త సంవత్సరంలో అయినా.. తీరుతాయా?;
వైసీపీ యువ నాయకుడు, విజయవాడకు చెందిన సీనియర్ పొలిటీషియన్ దేవినేని నెహ్రూ వారసుడు.. దేవినేని అవినాష్.. ఆశలు వచ్చే కొత్త సంవత్సరంలో అయినా.. తీరుతాయా? ఆయన కోరుతున్నట్టు పార్టీ అధినేత జగన్ కరుణిస్తారా? ఇదీ.. ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న ఆసక్తికర చర్చ. దీనికి ప్రధాన కారణం.. ఇప్పటి వరకు పోటీ చేయడమే తప్ప.. గెలుపు గుర్రం ఎక్కని అవినాష్ వచ్చే 2029 ఎన్నికల నాటికైనా విజయం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండడమే.
ప్రస్తుతం విజయవాడ వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న అవినాష్.. 2019 ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ తరఫున, 2024లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. దీనికి ముం దు 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ ఎంపీగా కూడా ఆయన పోటీ చేశారు. కానీ.. వరుసగా ఆయన పోటీ చేయడమే తప్ప.. గెలుపు గుర్రం ఎక్కింది లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్నప్పటికీ.. ఆయన మనసంతా.. పెనమలూరుపైనే ఉంది.
పెనమలూరులో దేవినేని నెహ్రూకు బలమైన వర్గంఉండడం.. గతంలో కంకిపాడు నియోజకవర్గం పరిధిలో ఉన్న నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గం పట్టు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అవినాష్ భావిస్తున్నారు. ఇప్పటికి రెండు సార్లు.. పార్టీ అధినేతను కలిసి విన్నవించారు. ఇక, పేనమలూరులో గత ఎన్నికల వరకు ఉన్న కొలుసు పార్థసారథి పార్టీ మారారు. దీంతో జోగిరమేష్‌ను తీసుకువచ్చారు. ఆయన ఓడిపోయి.. మైలవరం తన సొంత నియోజకవర్గం అంటూ.. అక్కడకు వెళ్లిపోయారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం పెనమలూరు ఖాళీగా ఉంది. దీనిని తనకు ఇవ్వాలని అవినాష్ కోరుతున్నారు. కానీ, పార్టీ నుంచి ఎలాంటి సూచనలు.. రాలేదు. అంతేకాదు.. పార్టీ లైన్ మరో విధంగా ఉందన్న చర్చ సాగుతోంది. విజయవాడ ఎంపీ స్థానాన్ని తీసుకోవాలని.. ఇక్కడ గెలిపించుకునే బాధ్యతను తామే తీసుకుంటామని చెబుతోంది. కానీ, అవినాష్ మాత్రం.. తాను ఎంపిగా పోటీ చేసే ఉద్దేశం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అటు అధిష్టానం.. ఇటు అవినాష్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు.