వైసీపీ మాజీల మీద ఈ ప్రచారమేంటి ?
వైసీపీకి చెందిన కీలక నేతలు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు అలాగే సీనియర్ నేతల మీద ప్రచారం ఇంకా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సాగుతూనే ఉంది.;
వైసీపీకి చెందిన కీలక నేతలు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు అలాగే సీనియర్ నేతల మీద ప్రచారం ఇంకా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సాగుతూనే ఉంది. ఏపీలో అధికార మార్పిడి జరిగి ఇరవై నెలలకు దగ్గర పడుతోంది. ప్రారంభంలో వెళ్లాల్సిన వారు అంతా వైసీపీ గూడు వీడి వెళ్ళిపోయారు. అందులో రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు. పార్టీ పుట్టిన నాటి నుంచి ఉన్న వారు సైతం ఉన్నారు. అలాగే వైఎస్సార్ ఫ్యామిలీతో మొదటి నుంచి సన్నిహితంగా ఉన్న వారు సైతం గుడ్ బై చెప్పారు. అలాగే ఎమ్మెల్సీలు అనేక మంది పార్టీని వీడారు. సీనియర్ నేతలు మాజీ మంత్రులు పార్టీలో ఉండలేమని ఫ్యాన్ నీడన ఉక్కబోత అని కూడా అంటూ సలాం కొట్టేశారు.
నికరంగా ఉంటారంటూ :
అయితే వెళ్ళిన వారు వెళ్ళిపోగా ఇక నికరంగా ఉన్న వారే వైసీపీ మనుషులు అని వారితోనే పార్టీని బలోపేతం చేయాలని వైసీపీ అనేక రకాలైన ఆలోచనలు చేస్తోంది. 2026 లో వీరిని అందరినీ మరింతగా ప్రజా క్షేత్రంలోకి పంపించి పార్టీకి కొత్త ఊపిరి అందించాలని కూడా చూస్తోంది. అదే సమయంలో అధినేత జగన్ కూడా జనంలోకి వస్తారని ఆయన సైతం జిల్లాల టూర్లు చేపడతారు అని కూడా అంటున్నారు. ఇటువంటి కీలక సమయంలో వైసీపీ నుంచి ఫిరాయింపులు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేయడం అన్నది ఇపుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది.
మాజీ మంత్రుల పేర్లతో :
వైసీపీ నుంచి మాజీ మంత్రులు కొందరు పార్టీ మారుతున్నారని ప్రచారం అయితే చేస్తూ వస్తున్నారు అందులో నిజానిజాలు ఎలా ఉన్నా ఈ వార్తలు అయితే తెగ వైరల్ అవుతున్నాయి. ఈ లిస్ట్ లో మాజీ మహిళా మంత్రులు ఆర్కే రోజా విడదల రజనీ ఉండడం విశేషం. రజనీ అయితే బీజేపీలోకి వెళ్తారని ప్రచారంలో ఉంటే రోజా ఏ పార్టీలోకి వెళ్తారో చెప్పకపోయినా వైసీపీకి గుడ్ బై కొడతారు అని అంటున్నారు. రోజా సొంత సీటు నగరిలో ఆమె రాజకీయ ప్రాధాన్యతను తగ్గిస్తున్నారు కాబట్టి ఆమె అసంతృప్తిగా ఉన్నారని అందుకే పార్టీకి దూరంగా ఉంటున్నారని వార్తలు వ్యాప్తి చేస్తున్నారు. అలాగే రజనీని రేపల్లెకి షిఫ్ట్ చేయబోతున్నారు అని అందుకే ఆమె కూడా ఫ్యాన్ పార్టీ కి దూరం అంటున్నారని కూడా చెబుతున్నారు. విచిత్రం ఏంటి అంటే వైసీపీకే కాదు వైఎస్సార్ కుటుంబానికే వీర విధేయుడు అయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు సైతం పార్టీని వీడుతారు అని ప్రచారం చేయడం పట్ల వైసీపీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయని అంటున్నారు.
పెద్దాయన ఫ్యామిలీతో :
అంతే కాకుండా నెల్లూరు జిల్లాకు చెందిన పెద్దాయన మేకపాటి రాజమోహన్ రెడ్డి తన కుటుంబంతో సహా టీడీపీలోకి వెళ్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఆయన కూడా ఇటీవల కాలంలో వైసీపీ అధినాయకత్వం తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. అయితే ఈ వార్తలు నిజాలు కావని వైసీపీ వైపు నుంచి తిప్పుకొడుతున్నారు. అదే సామాజిక మాధ్యమం ద్వారా వైసీపీ నేతలు అభిమానులు కూడా ఇవన్నీ కావాలని చేస్తున్న ప్రచారం అంటున్నారు. ఇలా కావాలనే కూటమి పార్టీల నుంచి కొందరు లీకులు ఇస్తున్నారు తప్ప జరిగేవి కావని అంటున్నారు.
పార్టీ మారాక :
ఇదిలా ఉంటే వైసీపీ నుంచి చాలా మంది మాజీ మంత్రులు కీలక నేతలు పార్టీలు మారారని ప్రస్తుతం కూటమిలో వారి పరిస్థితి పొజిషన్ వారికే అర్ధం కాక ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేస్తున్నారు. వారికే అలా ఉంటే అన్నీ చూసిన తరువాత ఎవరు ఆ పార్టీల వైపు వెళ్తారు అని ప్రశ్నిస్తున్నారు. అయితే నిప్పు లేనిదే పొగ రాదు కదా అన్నది మరో వైపు రాజకీయంగా పాత సామెతను గుర్తు చేస్తున్న వారూ ఉన్నారు. మరి ఇందులో ఏది నిజం ఏది కాదు అన్నది పక్కన పెడితే వైసీపీలో నుంచి ఇంకా అసంతృప్తులు అసమ్మతి గళాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. సరిచేసుకోవాల్సిన అనివార్యతను ఈ లీకుల లాంటి వార్తలు తెలియచేస్తున్నాయని కూడా అంటున్నారు.