గురుమూర్తి - మాగుంట.. ఒకే దారిలో ఉన్నారా ..!
తరచుగా గురుమూర్తితో మాగుంట టచ్‌లో ఉండడం.. ఇరువురు నాయకులు కూడా కలివిడిగానే సభలో వ్యవహరించడం వంటివి పార్టీల్లో చర్చకు దారితీసింది.;
ఇద్దరు ఎంపీలు.. కలిసి ఉండడం తప్పుకాదు. కానీ, వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులు కావడం.. బల మైన అధికార పక్షానికి చెందిన వారు ఒకరు.. ప్రత్యర్థి శిబిరానికి చెందిన వారు మరొకరు కావడమే ఇప్పుడు సమస్యగా మారింది. తాజాగా ఢిల్లీలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ ఈ విషయంపై అంతర్గతంగా చర్చించారు. ప్రత్యర్థి పార్టీ వైసీపీ నేతలకు దూరంగా ఉండాలని కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. అయితే.. ఎవరినీ ఆయన పేరు పెట్టి నేరుగా అనకపోయినా.. పార్టీలో అందరూ కూటమికే సపోర్టు చేయాలని పేర్కొన్నారు.
దీనికి కారణం.. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ నేత. కానీ.. ఈయన వైసీపీకి చెందిన తిరుపతి ఎంపీ గురుమూర్తితో కలివిడిగా ఉంటున్నారు. ఇరువురు నాయకులు కూడా లోక్‌సభలో పక్కపక్కనే కూర్చోవడం.. నవ్వుకోవడం.. వంటివి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయ్యాయి. గతంలో ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్న నేపథ్యంలో ఆ స్నేహాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నట్టు తెలుస్తున్నా.. ప్రస్తుతం పార్టీల మధ్య తీవ్ర మైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇది సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తరచుగా గురుమూర్తితో మాగుంట టచ్‌లో ఉండడం.. ఇరువురు నాయకులు కూడా కలివిడిగానే సభలో వ్యవహరించడం వంటివి పార్టీల్లో చర్చకు దారితీసింది. ఈ విషయంలో వైసీపీ మౌనంగా ఉంది. ఎవరు ఎవరితో కలిసినా.. తమకు ఇబ్బంది లేదని.. తమ పార్టీ విధానాలు తమకు ఉంటాయని వ్యాఖ్యానిస్తున్నా రు. కానీ, టీడీపీలో మాత్రం ఇలాంటివి సరికాదని అంటున్నారు. ప్రత్యర్థి పార్టీలకు ఉప్పందించేలా వ్యవహరిస్తున్న తీరును మంత్రి లోకేష్ తప్పుబడుతున్నారు.
వాస్తవానికి మాగుంటకు దేశవ్యాప్తంగా చాలా మంది ఎంపీలతో సంబంధం ఉంది. రాజకీయాల్లో ఉన్న వారు లేని వారితోనూ ఆయన కలివిడిగానే ఉంటున్నారు. దీనికి కారణం.. తన కు ఉన్న వ్యాపారాలు, వ్యవహారా లే. కానీ, గురుమూర్తికి ఎలాంటి వ్యాపారాలు లేవు. అయినప్పటికీ.. ఆయన కూడా అందరితోనూ కలివిడిగా ఉంటున్నారు. ఇలా కలిసి వుంటే.. ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయన్నది టీడీపీ ఆలోచన. అందుకే.. పార్టీలోని కూటమి నాయకులతోనే కలసి ఉండాలని నారా లోకేష్ తేల్చేశారు. మరి ఏం చేస్తారో చూడాలి.