బౌలింగ్ చేయలేడు..బ్యాటింగ్ చేయలేడు.. చెన్నై కి గుదిబండలా జాదవ్‌

Update: 2020-10-20 15:30 GMT
కేదార్‌ జాదవ్‌ చెన్నై సూపర్​కింగ్​ జట్టుకు శనిలా దాపురించాడని సోషల్​మీడియాలో ట్రోల్స్​ మొదలయ్యాయి. ఈ సారి ఐదు ఇన్నింగ్స్‌ ఆడిన జాదవ్​ కేవలం 62 పరుగులు మాత్రం చేశాడు. చెన్నై మొత్తం 10 మ్యాచ్‌లు ఆడగా, 8 మ్యాచ్‌లలో జాదవ్​కు అవకాశం దక్కింది. కానీ అతడి ఆటతీరు మాత్రం తీవ్ర నిరాశ పరిచింది. టీంలో ఎంతోమంది యువ క్రికెటర్లు ఉండగా.. జాదవ్​ను అనవసరంగా నెత్తిన పెట్టుకున్నారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 14 బంతులు మిగిలి ఉన్న సమయంలో జాదవ్​ బ్యాటింగ్‌కు వచ్చాడు. అతి కష్టమ్మీద 7 బంతుల్లో 4 పరుగులు చేయగలిగాడు. ఎప్పుడూ ఫిట్‌నెస్‌ సమస్యలతో బాధపడే జాదవ్, చివరి ఓవర్లో జడేజాతో పాటు రెండో పరుగు తీయలేక కూర్చుండిపోయాడు! ఈ సీజన్‌లో బౌలింగే చేయని కేదార్, చురుకైన ఫీల్డర్‌ కూడా కాదు.

యువ ఆటగాళ్లు రుతురాజ్, జగదీశన్‌లను పక్కన పెట్టి మరీ జాదవ్‌కు అవకాశం ఇవ్వడం విమర్శలకు తావిస్తున్నది. 2018 వేలంలో రూ. 7.8 కోట్లకు చెన్నై అతడిని తీసుకుంటే ఒక్కటే మ్యాచ్‌ ఆడి గాయంతో దూరమయ్యాడు. 2019లో కూడా 12 ఇన్నింగ్స్‌లు ఆడినా చేసింది 162 పరుగులే. 'సీనియర్‌ సిటిజన్స్‌' అంటూ ఇప్పటికే పలు వ్యంగ్య విమర్శలు ఎదుర్కొంటున్న చెన్నై 35 ఏళ్ల జాదవ్‌కు అవకాశాలు ఇస్తోంది. మరోవైపు గత ఏడాది 26 వికెట్లతో 'పర్పుల్‌ క్యాప్‌' అందుకొని చెన్నై ఫైనల్‌ చేరడంలో కీలకపాత్ర పోషించిన ఇమ్రాన్‌ తాహిర్‌కు 10 మ్యాచ్‌లలో కూడా అవకాశం దక్కలేదు. జాదవ్​ ఆటతీరుపై మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Tags:    

Similar News