పాదయాత్ర 2.0 ...జగన్ ని సీఎం ని చేస్తుందా ?

ఆయన తాజాగా పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ మరో ఏణ్ణర్ధంలో పాదయాత్ర చేపడతాను అని ప్రకటించారు. అంటే 2027 మధ్యలో నుంచి అన్న మాట.;

Update: 2026-01-21 18:18 GMT

పాదయాత్రలకు తెలుగు నేల పెట్టింది పేరు. పాదయాత్రలు చేసి ఎంతో మంది అధికారాన్ని అందుకున్నారు 2003లో అప్పటి ఉమ్మడి ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో వైఎస్సార్ భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయన మండుటెండలో ఏప్రిల్ 9న తెలంగాణాలోని చేవెళ్ల నుంచి మొదలెట్టిన పాదయాత్ర దాదాపు 1400 కిలోమీటర్ల దూరం దాకా సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద ముగిసింది. ఆ మరుసటి ఏడాది 2004లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వైఎస్సార్ సీఎం కావడానికి ఆ పాదయాత్ర ఎంతో ఉపయోగపడింది. అంతే కాదు అధికారం అందుకోవడానికి షార్ట్ కట్ మెదడ్ కూడా రాజకీయ పార్టీలకు చెప్పింది.

సెంటిమెంట్ పవర్ ఫుల్ :

ఇదిలా ఉంటే పాదయాత్ర సెంటిమెంట్ తెలుగు నాట పవర్ ఫుల్ అని అనంతర కాలంలో చేసిన నాయకులు నిరూపించారు. 2013 అక్టోబర్ లో టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర సుదీర్ఘంగా చేశారు. ఆయన 2014లో ఏపీలో సీఎం అయ్యారు. ఇక 2017లో నాటి ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ ఏకంగా 3500 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేపట్టి 2019 ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టీ సీఎం అయ్యారు. 2023 జనవరిలో యువ నేత లోకేష్ పాదయాత్ర చేపట్టి సక్సెస్ అయ్యారు ఫలితంగా కూటమి మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.

మళ్ళీ జగన్ వంతు :

ఇలా రెండు దశాబ్దాలకు పైగా ఏపీ రాజకీయాల్లో పెనవేసుకుని పోయిన పాదయాత్రలతో నాయకులు అందరూ కాళ్ళు అరిగినా కూడా కుర్చీలు మాత్రం పట్టేశారు. ఇపుడు మళ్ళీ జగన్ వంతు వచ్చింది. ఆయన తాజాగా పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ మరో ఏణ్ణర్ధంలో పాదయాత్ర చేపడతాను అని ప్రకటించారు. అంటే 2027 మధ్యలో నుంచి అన్న మాట. 2029 మేలో ఎన్నికలు అంటే దానికి సరిగ్గా ఏణ్ణర్ధం ముందు జగన్ పాదయాత్ర చేయబోతున్నారు.

రెండోసారి ప్రయోగం :

మరి జగన్ మళ్ళీ సీఎం కావాలని చేస్తున్న ఈ పాదయాత్ర ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. నిజానికి చూస్తే తెలుగు రాజకీయాల్లో ఒకసారి పాదయాత్ర చేసిన వారు మరోసారి పాదయాత్ర చేపట్టలేదు, అది జగన్ తోనే మొదలవుతోంది అని చెప్పాలి. వైఎస్సార్ కానీ చంద్రబాబు కానీ ఒకేసారి పాదయాత్ర చేశారు. లోకేష్ కూడా ఆ లోటు తీర్చుకున్నారు. అయితే మొదటి సారి పాదయాత్ర చేస్తే ఆ మొదటి మోజూ క్రేజూ ఒక లెవెల్ అని అంటారు, అంతే కాదు రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వారు కానీ అధికారం చేపట్టకుండా ప్రతిపక్షంలో ఉన్న వారు కానీ చేసే పాదయాత్ర మ్యాజిక్ వేరేగా ఉంటుంది.

అసంతృప్తులను బుజ్జగించాలి :

జగన్ విషయానికి వస్తే అయిదేళ్ళ పాటు సీఎం గా పనిచేశారు. ఆయన పాలన ఏమిటో ప్రజలు చూశారు, ఆయన పాలన పట్ల అసంతృప్తి ఉన్న వారే 2024 లో ఓడించారు, మరి ఈసారి ఆ అసంతృప్తులను బుజ్జగించాలి, అలాగే, తన పట్ల జనాలలు మళ్ళీ మోజు పెరగాలి అంటే చాలానే చేయాలి. హామీలు కూడా కొత్తవి గుప్పించాలి. స్పీచ్ దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ దాకా అన్నీ మార్చాలి. తీరా ఎన్ని చేసినా ప్రజలు కనుక కూటమి ప్రభుత్వం పట్ల వైసీపీ అనుకున్న స్థాయిలో వ్యతిరేకత పెంచుకోకపోతే మాత్రం ఫ్యాన్ పార్టీ ఏ విధంగా దానిని చూస్తుందో కూడా ఆలోచించాలి. ఏది ఏమైనా మొదటిసారి గురి తగిలింది. రెండోసారి కూడా తగిలితే రికార్డు బ్రేక్ అవుతుంది. మరి జగన్ పాదయాత్ర 2.0 ఏమి చేస్తుందో తెలియాలి అంటే ఇంకా ఏడాదిన్నర కాలం వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News