'బంగారు' రాజా... ట్రంప్ ఉన్నంత కాలం వారికి పండగే(నా)..!

ఈ నేపథ్యంలో.. గత ఏడాది జనవరిలో ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత బంగారం, వెండిపై ఓ మోస్తరు పెట్టుబడి పెట్టి ఉంటే.. ఇప్పుడు దాని విలువ ఊహించని రీతిలో పెరిగి, లాభాల పంట పండించిందనే చెప్పాలి.;

Update: 2026-01-21 18:03 GMT

రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ను ఇంటా బయటా చాలా మంది ద్వేషిస్తున్నారనే చర్చ బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వస్తోన్న పలు సర్వేల సగటును పరిశీలిస్తే.. ఆమోదం 42.4% వద్ద ఉండగా.. 55.6% మంది తిరస్కరించారని అంటున్నారు. ఇది అమెరికాలో పరిస్థితి! ఇక మిగిలిన ప్రపంచ దేశాల్లో భారత్ సహా ట్రంప్ విషయంలో ఏ దేశం ఏ స్థాయిలో విరుచుకుపడుతుందనే తెలిసిన విషయమే.

ప్రధానంగా.. ఇరాన్, రష్యా, చైనా లు రెగ్యులర్ గా ట్రంప్ (అమెరికా అధికారాన్ని) ను వ్యతిరేకిస్తాయనే సంగతి అటుంచితే.. తాజాగా కెనడా, గ్రీన్ లాండ్, వెనిజువెలా ప్రజలైతే ట్రంప్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఇక.. వీసాల విషయంలో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్న భారతీయులూ ట్రంప్ 2.0పై ఫైరవుతున్నారు. ఆఖరికి ఎలాన్ మస్క్ సైతం ట్రంప్ తో విభేదించిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కొంతమంది మాత్రం ట్రంప్ కు థాంక్స్ చెబుతున్నారని అంటున్నారు.

అవును... ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను వెల్ కం చేసే వారు చాలా తక్కువగా ఉంటారని అంటున్న వేళ.. ఓ వర్గం ప్రజానికం మాత్రం ఆయనకు రోజురోజుకీ మానసికంగా రుణపడిపోతున్నారని.. లోలోపల ఆయనకు థాంక్స్ చెబుతున్నారని అంటున్నారు. అందుకు కారణం... కొనుగోలుదార్లకు ఆందోళన కలిగిస్తూ.. పెట్టుబడిదార్లకు ఆనందం కలిగిస్తూ దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలే!

సాధారణంగా బంగారం, వెండిపై పెట్టుబడులు పెట్టే విషయంలో భారతీయులు ముందుంటారనే సంగతి తెలిసిందే. గత ఏడాది తెరపైకి వచ్చిన మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం... భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం విలువ 5 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.450 లక్షల కోట్లు) దాటిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ప్రపంచంలోని అత్యంత తెలివైన పెట్టుబడిదారులుగా భారతీయ గృహిణిలను వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ సచిన్ జైన్ అభివర్ణించారు కూడా.

ఈ నేపథ్యంలో.. గత ఏడాది జనవరిలో ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత బంగారం, వెండిపై ఓ మోస్తరు పెట్టుబడి పెట్టి ఉంటే.. ఇప్పుడు దాని విలువ ఊహించని రీతిలో పెరిగి, లాభాల పంట పండించిందనే చెప్పాలి. ఎందుకంటే.. సరిగ్గా ఏడాది క్రితం ట్రంప్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి బంగారం ధర.. ఆయన ఏడాది పాలన పూర్తి చేసుకునే నాటికి ఏకంగా 70% పెరిగింది. వెండి సంగతి చెప్పే పనే లేదు.. 200 శాతానికి పైనే పెరిగిన పరిస్థితి!

అయితే.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు.. గ్రీన్ ల్యాండ్ తో పాటు పలు ప్రపంచ దేశాలపై ట్రంప్ చేస్తున్న పనులు, తీసుకుంటున్న నిర్ణయాలు వెరసి.. ఈ రెండు లోహాల విలువ అలా పై పైకి వెళ్తూ కొండెక్కి కూర్చునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. అంటే... ట్రంప్ రెండోసారి రెండో ఏడాది పూర్తి చేసుకునేనాటికి 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ భారత్ లో దగ్గరి దగ్గరగా రెండు లక్షలకు.. వెండి మూడున్నర లక్షల పైన పలికే ఛాన్స్ ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు.

తాను రెండోసారి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ... అమెరికా ఫస్ట్, రిమైనింగ్ నెక్స్ట్ అన్నట్లుగా చెలరేగిపోతూ.. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్టేట్ మెంట్ ఒకటి భుజాన వేసుకుని ట్రంప్ చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో.. ఆయన సుంకాల బాదుడు బాధినప్పుడు.. ఇతర దేశాల గురించి వ్యాఖ్యానించినప్పుడు.. సురక్షితమైన పెట్టుబడి ఆప్షన్స్ అయిన బంగారం, వెండి ధరలకు రెక్కలు వస్తున్నాయి. గత కొంతకాలంగా జరుగుతున్నది ఇదే!

అందువల్ల... ట్రంప్ తన వైఖరిని ఇప్పట్లో మార్చుకునే పరిస్థితి ఉండకపోవచ్చని అంటున్న వేళ.. పైగా గ్రీన్ లాండ్, కెనడా, వెనిజువెలలతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఓ క్లారిటీ వచ్చే వరకూ.. ఈ ఏడాది నవంబర్ లో అమెరికాలో కొన్ని స్థానాలకు మధ్యంతర ఎన్నికలు వచ్చే వరకూ.. ట్రంప్ వైఖరిలోనూ.. ఫలితంగా, బంగారం, వెండి ధరలకు రెక్కల విషయంలోనూ మార్పులు ఉండకపోవచ్చని చెబుతున్నారు! అందుకే.. గత ఏడాది ప్రారంభంలో బంగారం, వెండిపై పెట్టుబడులు పెట్టినవారికి ట్రంప్ కచ్చితంగా "బంగారు" రాజానే!!

Tags:    

Similar News