రిపబ్లిక్ డే వేళ "26-26" ఉగ్ర కుట్ర... తెరపైకి షాకింగ్ విషయాలు!

2008 నవంబరు 26న (26/11) దేశ ఆర్థిక రాజధానిలో జరిగిన మారణహోమంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.;

Update: 2026-01-21 15:30 GMT

2008 నవంబరు 26న (26/11) దేశ ఆర్థిక రాజధానిలో జరిగిన మారణహోమంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఎటు చూసినా రక్తపుటేరులు.. మరి ఎటుచూసినా మాంసపు ముద్దలు.. ఏవైపు విన్నా హాహాకారాలు.. మిన్నంటిన ఆర్తనాదాలు.. నాడు ముంబయి మహానగరంలో కనిపించిన దృశ్యాలు.. ఆ కాళరాత్రి మిగిల్చిన జ్ఞాపకాలు. ఆ ఘటన జరిగిన దాదాపు 17 ఏళ్లు జరిగిపోయింది. ఈ క్రమంలో తాజాగా "26-26" ఉగ్ర కుట్ర వ్యవహారం తెరపైకి వచ్చింది.

అవును... ముంబయి పేలుళ్ల(26/11 అటాక్)తో నాడు దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో నాలుగు రోజుల్లో దేశం మొత్తం ఘనంగా రిపబ్లిక్ డే దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ సమయంలో భారతదేశంలో పెద్ద ఎత్తున దాడులు చేయడానికి ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) సమన్వయంతో పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కుట్ర పన్నినట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. దీనికి "26-26" అనే కోడ్ నేమ్ పెట్టుకున్నట్లు తెలిపాయి.

ఈ హెచ్చరిక నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ వంటి సున్నితమైన ప్రదేశాలలో భద్రతా చర్యలు పెంచబడ్డాయి. ఈ హెచ్చరిక అనంతరం.. తొలిసారిగా ఢిల్లీ పోలీసులు భారత ఉపఖండంలోని అల్ ఖైదా ఉగ్రవాది, ఢిల్లీ నివాసి అయిన మొహమ్మద్ రెహాన్ ఫోటోతో కూడిన వాంటెడ్ నోటీసు జారీ చేశారు. ఈ పోస్టర్‌ లో బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడుతో సహా దేశంలో జరిగిన పలు బాంబు పేలుళ్ల వెనుక ప్రధాన సూత్రధారిగా గుర్తించబడిన షాహిద్ ఫైసల్ కూడా ఉన్నాడు.

ఇదే సమయంలో... అయోధ్యలోని రామాలయం కూడా దాడులకు అవకాశం ఉన్న లక్ష్యంగా హెచ్చరికలో ఉందని అంటున్నారు. వాస్తవానికి.. డిసెంబర్ 6న ఉగ్రదాడికి ప్రణాళికలు సిద్ధం చేశారు కానీ.. భద్రతా సంస్థలు నిఘాను ముమ్మరం చేసి బలగాలను హై అలర్ట్‌ లో ఉంచడంతో వాయిదా పడినట్లు చెబుతున్నారు! ఈ తాజా సమాచారం నేపథ్యంలో... ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఉన్న ఇతర సున్నిత ప్రాంతాలలో భద్రతను గణనీయంగా కట్టుదిట్టం చేశారు.

ఇదే క్రమంలో... సోషల్‌ మీడియాలో ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్న కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాశ్మీరీ రెసిస్టెన్స్ గ్రూప్ కు చెందిన 'ఫాల్కన్ స్క్వాడ్' సోషల్ మీడియా ద్వారా ద్వేషాన్ని వ్యాప్తి చేసి, దాడులకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ సమయంలో పంజాబ్ లోని గ్యాంగ్ స్టర్స్ తో జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలపైనా దృష్టిసారించినట్లు తెలుస్తోంది!

కాగా... 2008 నవంబర్ 26న 10 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబయికి చేరుకుని.. ఛత్రపతి శివాజీ టర్మినస్, తాజ్ హోటల్‌, ఒబెరాయ్ ట్రైడెంట్, మొదలైన ప్రాంతాల్లో దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు.. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో తొమ్మిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ ను 2012 నవంబర్ 21న ఉరితీశారు.

Tags:    

Similar News