పుట్టా ఎపిసోడ్ : మంత్రి పదవి ఎగరగొట్టారా ?
ఈ క్రమంలో టీడీపీ చాలా వేగంగానే ఈ ఇష్యూ విషయంలో రియాక్ట్ అయింది. పుట్టా మహేష్ కి షోకాజ్ నోటీస్ జారీ చేయడం ద్వారా క్రమశిక్షణా చర్యలకు వెనకాడేది లేదని తమ నిబద్ధతను చాటుకుంది.;
ఏపీ రాజకీయాలను కకావికలం చేసింది ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఎపిసోడ్. ఆయన హైదరాబాద్ లో జరిగిన ఒక వీకెండ్ పార్టీలో పాల్గొన్నారని అక్కడ డ్రగ్స్ తీసుకున్నారు అంటూ వచ్చిన ఆరోపణలు జరిగిన ప్రచారంతో ఏకంగా కూటమి ప్రభుత్వం పూర్తిగా ఇబ్బందుల్లో పడినట్లు అయింది. ఈ క్రమంలో టీడీపీ చాలా వేగంగానే ఈ ఇష్యూ విషయంలో రియాక్ట్ అయింది. పుట్టా మహేష్ కి షోకాజ్ నోటీస్ జారీ చేయడం ద్వారా క్రమశిక్షణా చర్యలకు వెనకాడేది లేదని తమ నిబద్ధతను చాటుకుంది.
కేసు సంగతి సరే :
ఇక ఎంపీ మహేష్ తాను ఈ విషయంలో ఏ తప్పూ చేయలేదని అంటున్నారు. తాను నిజాయితీగా చెబుతున్న మాటలు అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన మాటలను ఎవరు ఎంత వరకూ విశ్వసిస్తారు అన్నది పక్కన పెడితే ఈ ఎపిసోడ్ వల్ల మహేష్ పొలిటికల్ కెరీర్ కి అయితే కొంతవరకూ ఇబ్బంది వచ్చింది అని అంటున్నారు తొలిసారి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఆయన బంపర్ మెజారిటీతో ఏలూరులో నెగ్గారు, ఎక్కడో కడప జిల్లాకు చెందిన మహేష్ ని పశ్చిమ గోదావరి జిల్లా ఆదరించింది. ఆ విధంగా రేపటి భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్న దశలో పుట్టా మహేష్ కి ఈ ఎపిసోడ్ అయితే కొంత సమస్యగానే ఉందని అంటున్నారు.
అక్కడ కొడుతోందా :
అయితే ఇది ఇంతటితో అయిపోలేదని అంటున్నారు. పుట్టా మహేష్ ఎపిసోడ్ సరిగ్గా ఒక కీలకమైన ఘట్టానికి చేరువగా ఆ కుటుంబం ఉన్న దశలో తెర పైకి రావడంతో ఏకంగా పుట్టా కుటుంబమే ఇబ్బందుల్లో పడింది అని అంటున్నారు. పుట్టా మహేష్ తండ్రి కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నారు టీడీపీలో సీనియర్ నేతగా ఆయన ఉన్నారు. గతంలో టీటీడీ చైర్మన్ గా కూడా సుధాకర్ యాదవ్ పనిచేశారు. ఇదిలా ఉంటే కూటమి త్వరలో చేసే మంత్రి వర్గ విస్తరణలో కడప జిల్లా నుంచి బీసీ నేతగా బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన పుట్టా సుధాకర్ పేరు సీరియస్ గా పరిశీలిస్తున్నారు అని ప్రచారం సాగుతూ వస్తోంది. కడప జిల్లా అంటే రెడ్లకే మంత్రి పదవులు ఇవ్వడం కాకుండా ఈసారి బీసీలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా తమ పార్టీ వారి వైపే ఉందని చాటుకోవడానికి కూడా టీడీపీ కూటమి ఈ నిర్ణయం తీసుకోబోతోంది అని ప్రచారం అయితే సాగుతోంది.
చెక్ పడ్డట్లేనా :
అంతే కాదు టీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ అయిన యనమల రామక్రిష్ణుడు కి పుట్టా సుధాకర్ యాదవ్ వియ్యంకుడు అవుతారు. ఇక యనమల అయితే గత ఏడాది ఎమ్మెల్సీగా రిటైర్ అయిన తరువాత ఏ పదవీ లేకుండా ఉన్నారు. ఆయన కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా ఉన్నా గోదవారి జిల్లా రాజకీయ సమీకరణాలలో ఆమెకు మంత్రి పదవి దక్కడం లేదని అంటున్నారు. దాంతో ఆ కుటుంబానికి చెందిన వారిని మంత్రి వర్గంలో చేర్చుకుంటే సీనియర్ నేతకు న్యాయం జరిగినట్లు అవుతుందందన్న కోణంలో నుంచి కూడా పుట్టా సుధాకర్ యాదవ్ పేరుని పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. సరిగ్గా ఈ సమయంలో పుట్టా మహేష్ యాదవ్ మీద ఈ తరహా ఆరోపణలు రావడం అది రచ్చకు దారి తీయడంతో ఇపుడు అటూ ఇటూ తిరిగి పుట్టా సుధాకర్ యాదవ్ కి మంత్రి పదవిని ఇచ్చే విషయంలో పునరాలోచన చేస్తారా అన్నది కూడా హాట్ హాట్ చర్చగా సాగుతోందిట. చూడాలి మరి ఈ ప్రచారాలలో ఎంత వరకూ వాస్తవం ఉందో.