చేతులు జోడించి వీడియో చేస్తే ఏం లాభం పుట్టా?

ఉన్నత స్థానం ఊరికే రాదు. అలాంటి అరుదైన అవకాశం లభిస్తే.. ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండటమే కాదు.. ఇరుక్కునే ఏ చిన్న అవకాశాన్ని ఇవ్వకుండా.. వివాదాలకు ఆమడ దూరంలో ఉండాల్సిన అవసరం ఉంది.;

Update: 2026-03-16 04:19 GMT

ఉన్నత స్థానం ఊరికే రాదు. అలాంటి అరుదైన అవకాశం లభిస్తే.. ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండటమే కాదు.. ఇరుక్కునే ఏ చిన్న అవకాశాన్ని ఇవ్వకుండా.. వివాదాలకు ఆమడ దూరంలో ఉండాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో చేయకూడని తప్పు చేసిన పుట్టా.. ఇప్పుడు చేతులు జోడించి తాను సుద్దపూసగా చెప్పుకోవటం గమనార్హం. నలభై ఏళ్ల కంటే తక్కువ వయసులో.. మరింత సరిగ్గా చెప్పాలంటే 36 ఏళ్ల యువ ప్రాయంలో ఏలూరు ఎంపీగా విజయం సాధించటం చూసినప్పుడు.. ఎన్నో లక్షల మందికి దక్కని ఒక అరుదైన అవకాశం అతనికి దక్కిందని చెప్పాలి.

తనను తాను సామాన్యమైన ఉద్యోగంతో కెరీర్ మొదలు పెట్టిన వ్యక్తిగా చెప్పుకున్నప్పటికీ.. అతడి కుటుంబ నేపథ్యాన్ని చూసినప్పుడు.. నెలకు రూ.12 వేలతో ఉద్యోగం చేసిన వైనం సినిమాటిక్ గా ఉంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడే ఆయన కుటుంబ నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే.. అతగాడి వెనుకున్న బలమైన రాజకీయ పలుకుబడి ఇట్టే అర్థమవుతుంది. పుట్టా మహేశ్ కుమార్ తండ్రి ఎవరో కాదు మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. గతంలో ఆయన టీటీడీ ఛైర్మన్ గా పని చేవారు. తెలుగుదేశం పార్టీలో చాలా కాలంగా ఉంటున్న బీసీ నేత. ఇక.. మహేశ్ కుమార్ మామ మరెవరో కాదు.. ఏపీలో పలుమార్లు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పని చేసిన సీనియర్ టీడీపీ నేత యనమల రామక్రిష్ణుడు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. పార్టీలో ప్రధాన వ్యూహకర్త. ఈ బంధుత్వమే ఏలూరు ఎంపీ టికెట్ మహేశ్ కు రావటానికి కారణమైంది. అంతేకాదు..తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన సీనియర్ నేత.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబానికి బంధురికం ఉంది.

మహేశ్ కుమార్ కేవలం ఒక రాజకీయ నేత మాత్రమే కాదు. ఒక పేరున్న పారిశ్రామికవేత్త. ఆయన పీఎస్ కే ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ అనే పెద్ద నిర్మాణ సంస్థకు ఎండీగా వ్యవహరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పలు భారీ సాగునీటి, రహదారి ప్రాజెక్టులను నిర్వహిస్తున్న బ్యాక్ గ్రౌండ్ ఆయన సొంతం. బలమైన ఆర్థిక నేపథ్యంలో.. సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కావటంతో ఈ యువనేతకు టికెట్ ఇవ్వటం.. కూటమి గాలి నేపథ్యంలో ఏకంగా ఎంపీగా విజయం సాధించారు. తన గురించి ఏలూరు నియోజకవర్గ ప్రజలకు తెలుసని.. తాను ఏ తప్పు చేయలేదని చెబుతున్నా.. వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.

2024లో జరిగిన ఎన్నికల్లో ఏలూరు ఎంపీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకిదిగిన సమయంలో ఆయన తన నామినేషన్ దాఖలు సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ నుచూసినప్పుడు ఆయనపై నమోదైన కేసుల పర్వం లెక్క ఇట్టే తెలుస్తుంది. హత్యాయత్నం.. ప్రమాదకర ఆయుధాలతో దాడి చేయటం లాంటి తీవ్రమైన సెక్షన్లు అతడిపై ఉన్నాయి. సెక్షన్ 307, సెక్షన్ 324, సెక్షన్ 147, 148, 149 లాంటివి నమోదయ్యాయి. అంతేకాదు ఎస్సీ ఎస్టఅ అట్రాసిటీ యాక్టుకింద కూడా చిన్న గురివిగాల ఎల్లయ్యను కులం పేరుతో బెదిరించి.. దూషించిన ఆరోపణలతో కేసు నమోదైంది.

తాజాగా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో నిర్వహించిన పార్టీలో అతడు డ్రగ్స్ సేవించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. నిషేధిత మెథాంఫేటమిన్, కొకైన్ సేవించినట్లుగా డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ రావటంతో కేసు నమోదు8 చేశారు. అనుమతి లేకుండా మద్యం, ఇతర మత్తు పదార్థాలను సేవించినందుకు ఎన్ డీపీసీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. అయితే.. ఈ కేసుల్లో స్టేషన్ బెయిల్ లభించే వీలు ఉండటంతో అతనికి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. ఇదిలాఉంటే.. తాజాగా విడుదల చేసిన వీడియోలో చేతులు జోడించి..తన మీద వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని.. తాను ఎలాంటి వ్యక్తినో ఏలూరు ప్రజలకు.. పార్టీ నేతలకు తెలుసని చెప్పటం గమనార్హం.

స్నేహితుడు పిలిస్తే కలిసేందుకు మాత్రమే వెళ్లానని.. అంతే తప్పించి తనకు ఎలాంటి దురలవాట్లు లేవని.. ఏ తప్పు చేయలేదని పేర్కొన్నారు. మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయని.. ఆరోపణల్ని ఎవరూ నమ్మొద్దని పేర్కొన్నారు. ఇదంతా ఓకే. మరి.. నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ లో అన్ని కేసులు ఎందుకు ఉన్నట్లు? అన్నది ప్రశ్న. ఏమైనా.. విమర్శలు చేసే వారు.. ఆరోపణలతో విరుచుకుపడే వారు సైతం ఆయన చేతులు జోడించి తాను సుద్దపూసనని చెప్పిన పుట్టా మహేశ్ వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందే. ఏమైనా.. తాజా ఉదంతం ఆయన గురించి ఏలూరు ప్రజలకు మరింత బాగా అర్థమైందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News