రోహిత్ చెబితేనే కాల్పులు జరిపా.. నమిత్ శర్మ
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగిందన్న సమాచారంతో ఈగిల్ పోలీసులు సోదాలు నిర్వహించే క్రమంలో చోటు చేసుకున్న హైడ్రామా ఒక ఎత్తు అయితే.. మూడు రౌండ్లు కాల్పులు జరపటం మరో ఎత్తు.;
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగిందన్న సమాచారంతో ఈగిల్ పోలీసులు సోదాలు నిర్వహించే క్రమంలో చోటు చేసుకున్న హైడ్రామా ఒక ఎత్తు అయితే.. మూడు రౌండ్లు కాల్పులు జరపటం మరో ఎత్తు. ఇంతకూ అసలు కాల్పులు జరపాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్నది ప్రశ్న. ఇంతకూ పిస్టల్ ఎవరిది? లైసెన్సు ఎవరి పేరు మీద ఉంది? కాల్పులు జరిపింది ఎవరు? ఎందుకు కాల్పులు జరిపారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు సరిగా లభించని పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లుగా పక్కా సమాచారం అందుకున్న ఈగిల్ టీంతో పాటు శంషాబాద్, చేవెళ్ల ఎస్ వోటీ, మొయినాబాద్ పోలీసులు దాదాపు 40 మంది ఫామ్ హౌస్ వద్దకు వెళ్లారు. అయితే.. నేరుగా సోదాలకు వెళితే.. తప్పించుకునే వీలుందన్న ఉద్దేశంతో ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న గోడలు దూకి లోపలకు వెళ్లారు. చెట్ల చుట్టూ చీకటిలో దాక్కుంటూ పార్టీ జరిగే ప్రదేశానికి వెళుతున్న క్రమంలో మూడుసార్లు కాల్పుల శబ్ధం రావటంతో.. తమను గమనించి కాల్పులు జరుపుతున్నారన్న ఉద్దేశంతో అప్రమత్తమయ్యారు. వెంటనే.. తాము సోదాల కోసం వచ్చిన పోలీసులుగా వారు చెప్పారు.
అదే సమయంలో నమిత్ శర్మ పోలీసుల వైపు పిస్టల్ తో ఒక రౌండ్ కాల్చారు. అప్పటికే అప్రమత్తంగా ఉన్న పోలీసులు.. పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుున్నారు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకొని పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణం పోయేదన్న మాట వినిపిస్తోంది. నమిత్ శర్మ పక్కనే శరత్ కుమార్ దగ్గర బుల్లెట్లు.. షెల్స్ దొరికాయి. దీంతో.. కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చింది? పిస్టల్ ఎవరిది? లాంటి పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు లభించాయి. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేశ్ రెడ్డి పేరుతో పిస్టల్ లైసెన్సు ఉన్నట్లు తేల్చారు. అదే సమయంలో కాల్పులు జరపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్న అంశంపై పార్టీలో పాల్గొన్న పదకొండు మందిని విచారించారు.
అయితే.. రోహిత్ రెడ్డి చెప్పినందుకే తాను కాల్పులు జరిపినట్లుగా నమిత్ శర్మ పోలీసులకు వెల్లడించారు. దీంతో లైసెన్స్ డ్ పిస్టల్ ను దుర్వినియోగం చేసినందుకు రితేశ్ ను.. కాల్పులు జరిపినందుకు నమిత్ మీదా.. కాల్పులకు ఆదేశాలు ఇచ్చిన రోహిత్ రెడ్డి మీదా ఆయుధ చట్టం కింద వివిధ సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. ఆయుధాల చట్టంలోని సెక్షన్ 30, 25(1బి), (ఎ) తో పాటు ఎన్ డీపీఎస్ చట్టంలోని 8సి, 22ఎ, 27, 29 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎక్సైజ్ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. మిగిలిన ఎనిమిది మందికి నోలీసులు ఇచ్చి పంపారు. నమిత్ శర్మ ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పోలీసులు భావిస్తున్నారు.