ఫామ్ హౌస్ పార్టీకి హాజరైన 11 మంది ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఇదేనా?
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. జాతీయ స్థాయిలోనూ సంచలనంగా మారిన ఈ ఉదంతానికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు.. సందేహాలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి.;
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. జాతీయ స్థాయిలోనూ సంచలనంగా మారిన ఈ ఉదంతానికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు.. సందేహాలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. రాజకీయ విభేదాలకు భిన్నంగా స్నేహాలు.. బంధాలు ఉంటాయన్న విషయం మరోసారి రుజువైంది. ఏపీ అధికార పార్టీ తెలుగుదేశానికి చెందిన ఎంపీ.. తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కు రావటం.. పార్టీకి హాజరు కావటం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఏ చిన్న విషయం వచ్చినా.. ఆంధ్రా.. తెలంగాణ అంటూ మాట్లాడే పార్టీకి చెందిన బీఆర్ఎస్ కు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే.. ఏపీ అధికార పార్టీకి చెందిన ఎంపీతో ఉన్న పార్టీ దోస్తానా ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. హాట్ టాపిక్ గా మారింది.
ఈ పార్టీకి మొత్తం 11 మంది హాజరు కావటం తెలిసిందే. ఈ పదకొండు మందికి సంబంధించి.. వారి బ్యాక్ గ్రౌండ్ ను చూస్తే ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. కాల్పులు జరిపిన నమిత్ శర్మను తొలుత రాజస్థాన్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేగా ప్రచారం జరిగినప్పటికి అందులో నిజం లేదని.. అతను ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తించారు. ఇంతకూ పార్టీలో ఉన్న 11 మందిలో కొందరికి సంబంధించి వేర్వేరు అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
1. పుట్టా మహేశ్ కుమార్
ఏలూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ.
2. పైలెట్ రోహిత్ రెడ్డి
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఇతనిదే. గతంలోనూ ఇదే ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేకు ఎర కేసు ఇక్కడే బయటకురావటం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసులో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావును పార్టీ మారాలని ప్రలోభ పెట్టిన వ్యవహారంలో రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీ తదితరులను అప్పట్లో సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.
3. రితేశ్ రెడ్డి
పైలెట్ రోహిత్ రెడ్డి సోదరుడు కం బిజినెస్ మ్యాన్. మొయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీ వేళ పోలీసులు సోదాలు నిర్వహించినప్పుడు కాల్పులు జరిపిన ఉదంతంలో.. వాడిన పిస్టల్ ఇతని పేరు మీదనే ఉంది.
4. మొరవినేని రమేశ్
రియల్ ఎస్టేట్ వ్యాపారి
5. వరమాచినేని శ్రవణ్ కుమార్
రియల్ ఎస్టేట్ వ్యాపారి కం ప్రైవేటు ఉద్యోగి
6. నమిత్ శర్మ
ఢిల్లీలోని బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి
7. నల్లపనేని విజయక్రిష్ణ
యానిమేషన్ కం సాఫ్ట్ వేర్ వ్యాపారం
8. కౌశిక్ రవి
బెంగళూరుకు చెందిన న్యాయవాది. పలు లా ఫార్మ్స్ ను నిర్వహిస్తుంటారు
9. తిరువీధుల అర్జున్ రెడ్డి
పుప్పాల గూడకు చెందిన వ్యాపారి, బాబిలోన్ పబ్ యజమాని.
10. సిలివేరు శరత్ కుమార్
వికారాబాద్ జిల్లాకు చెందిన వ్యాపారి, రోహిత్ రెడ్డి పీఏ కం డ్రైవర్ కూడా.
11. ఆర్. ప్రియాంకారెడ్డి
ఫిలింనగర్ కు చెందిన వారు. వైద్యురాలు.