మొయినా బాద్ ఫామ్ హైస్ లో దుబాయ్ పంచాయితీ?
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ.. పోలీసుల ఎంట్రీతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.;
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ.. పోలీసుల ఎంట్రీతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో ఉన్న పదకొండు మంది నేపథ్యాలు భిన్నంగా ఉండటం ఒక ఎత్తు అయితే.. ఈ వీకెండ్ పార్టీ వెనుక అసలు లెక్కలు వేరే ఉన్నాయా? ఒక సీరియస్ అంశానికి సంబంధించిన చర్చ కోసం ఈ పార్టీ కం పంచాయితీని ఏర్పాటు చేశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారంతో పాటు కొన్ని మీడియా రిపోర్టులు ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
ప్రస్తుతం ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్నయుద్ధంలో అనూహ్య రితిలో చిక్కుకొని విలవిలలాడుతోంది దుబాయ్. నిజానికి మీడియా రిపోర్టులు ఏవీ దుబాయ్ కు జరుగుతున్న వ్యాపార.. ఆర్థిక నష్టం మీద పెద్దగా కథనాలురాని పరిస్థితి. నిజానికి ఈ యుద్ధంలో అనూహ్య రీతిలో బ్రాండ్ ఇమేజ్ దారుణంగా దెబ్బ తిన్నది దుబాయ్. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన.. అత్యంత వేగంగా దూసుకెళుతున్న ఆర్థిక శక్తిగా సాగుతున్న ప్రచారాన్ని దారుణంగా దెబ్బ తీసేలా చేసింది తాజా యుద్ధం. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ అంతర్జాతీయ అనిశ్చితికి కారణమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నారు? మొయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీకి.. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధానికి.. దుబాయ్ కు లింకేమిటి? అంటే.. అక్కడికే వస్తున్నాం.
సినీ రంగానికి చెందిన వివాదాస్పద వ్యాపారవేత్త కేదార్ కొన్ని నెలల క్రితం దుబాయ్ లో వివాదాస్పద రీతిలో మరణించటం తెలిసిందే. అతను మరణించే సమయానికి ఆ ఫ్లాట్ లోనే రోహిత్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం జరిగింది. కట్ చేస్తే.. తాజా ఫామ్ హౌస్ పంచాయితీ కూడా దానికి కొనసాగింపుగా చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు.. సినీ తారలకు చెందిన కోట్లాది రూపాయిల పెట్టుబడులు కేదార్ ద్వారా దుబాయ్ లో పెట్టినట్లుగా ప్రచారం జరిగింది. గతంలోనూ దీనికి సంబంధించిన ఆరోపణలు బలంగా వినిపించాయి.అయితే..ఇదంతా నల్లధనమని.. బయటకు రాని లెక్కలకు చెందింది కావటంతో ఎవరూ బయటకు నోరు విప్పలేని పరిస్థితిగా అప్పట్లో ప్రచారం జరిగింది.
దుబాయ్ లో తాజా యుద్ధ పరిణామాల నేపథ్యంలో సాగుతున్న పరిణామాల నేపథ్యంలో తమ పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై చర్చ కోసమే ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. తమ పెట్టుబడులు ఏ మేరకు సురక్షితం? రానున్న రోజుల్లో ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్లాలి? అన్న దానిపై చర్చలు జరుగుతున్న సమయంలోనే పోలీసులు ఎంట్రీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అప్పట్లోనే కేదార్ - రోహిత్ రెడ్డి మధ్య బంధం పలు అనుమానాలు తావిచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో పలు అంశాలపై పోలీసులు ఇప్పుడు ఫోకస్ పెడుతున్నట్లుగా చెబుతున్నారు.