రోహిత్ రెడ్డి కొంప ముంచిన కాల్పులు
కొన్నిసార్లు జరిగే పరిణామాలువిస్మయానికి గురి చేస్తాయి. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు.. వివిధ రంగాల్లో నిపుణులుగా పేరున్న వారు సైతం తప్పులు చేయటమా? అన్నది షాకింగ్ గా మారుతుంది.;
కొన్నిసార్లు జరిగే పరిణామాలువిస్మయానికి గురి చేస్తాయి. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు.. వివిధ రంగాల్లో నిపుణులుగా పేరున్న వారు సైతం తప్పులు చేయటమా? అన్నది షాకింగ్ గా మారుతుంది. ఇందుకు మొయినాబాద్ ఫామ్ హౌస్ లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిర్వహించిన పార్టీ.. అందులో డ్రగ్స్ తో పాటు విదేశీ మద్యం భారీగా స్వాధీనం చేసుకోవటం తెలిసిందే. ఈ పార్టీలో ఒక లోక్ సభ సభ్యుడు, ఒక పేరు మోసిన లాయర్, మరో రాజకీయ నాయకుడు ఉన్నారు. వీరంతా వ్యవస్థల్లో కీలకమైన స్థానాల్లో ఉన్న వారే. చట్టం గురించి అంతో ఇంతో తెలిసినోళ్లే. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు.. దాన్ని తెలివిగా ఎలా అధిగమించాలన్న అంశంపై సామాన్యుడి కంటే నాలుగైదు మెట్లు ముందుండే అవకాశం ఉంది.
అలాంటి వారు అడ్డంగా బుక్ కావటం ఏమిటి? అన్నది ఇప్పుడు ఎదురయ్యే ప్రశ్న. పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎపిసోడ్ చూస్తే.. ఈ మొత్తం ఎపిసోడ్ లో కాల్పుల ఉదంతం అన్నది లేకుంటే ఈ కేసు వేరేగా ఉండేది. కాల్పులతో కేసు తీవ్రతలో తేడా రావటమే కాదు.. మొత్తం స్వరూపమే మారిపోయింది. సోదాల సమయంలో వీరు పోలీసులకు సహకరించినా.. సహకరించకున్నా.. దానికి సంబంధించిన తీవ్రత కేసులు.. అందులో నమోదు చేసే సెక్షన్లలో పెద్దగా తేడా ఉండేది కాదు. కానీ.. ఎప్పుడైతే కాల్పులు జరిపారో విషయం మారింది.
సాధారణంగా డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు పట్టుబడితే.. వారిని బాధితులుగానే చూస్తారే కానీ బాధ్యులుగా చూడరు. అలా లెక్కలోకి తీసుకున్నా.. ఈ పార్టీ నిర్వాహకుడిగా రోహిత్ రెడ్డి వరకు కాస్త ఇబ్బంది ఉండేదే తప్పించి.. రిమాండ్ కు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. ఈ వాదనకు బలం చేకూరే అంశాలు ఎఫ్ఐఆర్ ను పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది. డ్రగ్స్ వాడకం కేసులో శిక్షా కాలం తక్కువగా ఉండటం.. విచారణకు సహకరిస్తామని హామీ ఇవ్వటం ద్వారా వారంతా స్టేషన్ బెయిల్ పొందే వీలు ఉండేది. అందుకే.. టీడీపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ కు స్టేషన్ బెయిల్ లభించింది.
పోలీసులు సోదాల సమయంలో నమిత్ శర్మ గాలిలోకి కాల్పులు జరపటం ఒకటైతే.. ఆ పిస్టల్ పైలెట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డిది కావటంతో ఆయన బుక్ అయ్యారు. తనను కాల్పులు జరపమని చెప్పింది పైలెట్ రోహిత్ రెడ్డి అని ఢిల్లీకి చెందిన బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ చెప్పటంతో ఆయనకు రిమాండ్ తప్పలేదు. దీనికి తోడు పార్టీ జరిగిన ఫామ్ హౌస్ రోహిత్ రెడ్డి కావటంతో ఆయనపై మూడు ప్రధానమైన ఆరోపణలు.. చట్టవిరుద్దమైన కార్యకలాపాలకు వేదికగా ఫామ్ హౌస్ ఉండటం.. కాల్పులు జరపాలని నమిత్ శర్మను ప్రేరేపించటం.. పోలీసుల సోదాల్ని అడ్డుకునే ప్రయత్నం చేయటం.
ఈ పరిణామాలు రోహిత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు (పిస్టల్ ఆయన పేరు మీదనే ఉంది. దీంతో ఆయుధాన్ని దుర్వినియోగం చేసిన తీవ్రమైన నేరం ఆయన మీద పడింది), కాల్పులు జరిపిన నమిత్ శర్మలనుఅరెస్టు చేసిన పోలీసులు పద్నాలుగు రోజులు రిమాండ్ కు తరలించారు. ఒకవేళ.. ఈ మొత్తం వ్యవహారంలో కాల్పుల అంశం లేకుంటే.. స్టేషన్ బెయిల్ లభించి ఉండేది. అక్కడే ఉన్న ఒక ప్రముఖ లాయర్.. చట్టవిరుద్ధంగా పిస్టల్ ను వినియోగించకూడదన్న విషయాన్ని ఎందుకు చెప్పలేదు? ఎందుకు వారించలేదు? అన్నది ప్రశ్న. అది కూడా పోలీసులు తాము సోదాల కోసం వచ్చామని చెప్పినప్పుడు కూడా కాల్పులు జరపటం చూస్తే.. అంత తెలివితక్కువతనంతో ఎలా వ్యవహరించారనన సందేహం కలుగకమానదు.