బిగ్ న్యూస్... దావోస్ లో ట్రంప్ నోటి నుంచి జాలువారిన రత్నాలివే!

ఈ సందర్భంగా.. ఐరోపా దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఐరోపా కూటమి సరైన దిశలో వెళ్లడం లేదని విమర్శించారు.;

Update: 2026-01-21 18:12 GMT

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న "ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచమొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆయన ప్రసంగం కాస్త ఆలస్యంగా ప్రారంభమైనా.. చాలామంది ఊహించిన రీతిలోనే సాగింది. ఇందులో కొన్ని వ్యాఖ్యలు.. నవ్విపోదురుగాక నాకేటి అన్నట్లుగా ఉంటే.. ఈ మనిషి మారలేదు, మారేదీ లేదు అన్నట్లుగా మరికొన్ని వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు!

చుట్టూ స్నేహితులు.. కొంతమంది శత్రువులు!:

అవును... దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు సంచలన, భయానక, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు! మైకందుకున్న అనంతరం... తన చుట్టూ స్నేహితులు, కొంతమంది శత్రువులు ఉన్నారంటూ వెటకారంగా మొదలుపెట్టిన ట్రంప్... అమెరికాను భూగ్రహం యొక్క ఆర్థిక ఇంజిన్ అని పిలుస్తూ... అమెరికా విజృంభిస్తే, ప్రపంచం మొత్తం విజృంభిస్తుందని.. మీరందరూ మమ్మల్ని అనుసరిస్తారని చెప్పుకొచ్చారు.

ఐరోపా కూటమి పద్దతి సరిగా లేదు!:

ఈ సందర్భంగా.. ఐరోపా దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఐరోపా కూటమి సరైన దిశలో వెళ్లడం లేదని విమర్శించారు. పెద్దఎత్తున వచ్చే వలసలపై ఇక్కడ నియంత్రణ లేదన్నారు. వాస్తవానికి తాను యూరప్‌ ను ప్రేమిస్తున్నానని.. అది మంచిగా జరగాలని తాను కోరుకుంటున్నానని కానీ.. కానీ అది సరైన దిశలో వెళ్ళడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో.. ఐరోపాలో కొన్ని ప్రాంతాలకు ఇంకా గుర్తింపు లేదని ట్రంప్ నొక్కి చెప్పారు!

వెనిజువెలా తెగ సంపాదించబోతుంది!:

అనంతరం... ఎంతో కాలం వెనెజువెలా కూడా అద్భుతంగా ఉండేదని.. కానీ, సొంత విధానాలతో వాళ్లకు వాళ్లే నాశనం చేసుకున్నారని.. అయితే ఇటీవల తమతో ఒప్పందం కుదుర్చుకున్నాక తాము వారికి సహాయం చేస్తున్నామని ట్రంప్ తెలిపారు. వెనిజువెలా గత సంవత్సరాలుగా సంపాదించినదానికంటే ఎక్కువగా రాబోయే ఆరు నెలల్లో సంపాదిస్తారని తెలిపారు.

ఆ అందమైన ఐస్ ముక్క కావాలి!:

ఈ క్రమంలోనే.. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశాల్లో ఒకటైన గ్రీన్ ల్యాండ్ విషయంపైనా ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా.. ఇప్పుడు ఈ విషయంపై చర్చించాలని తాను అనుకోలేదు కానీ.. గదిలో ఏనుగును విస్మరిస్తే బ్యాడ్ రివ్యూస్ వస్తాయని చమత్కరిస్తూ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా తనకు గ్రీన్ లాండ్, డెన్మార్ ప్రజల పట్ల అపారమైన గౌరవం ఉందని.. ఆ అందమైన భారీ మంచు ముక్కను అమెరికా మాత్రమే రక్షించగలదని ట్రంప్ అన్నారు.

గ్రీన్ లాండ్ ను అమెరికా ఆధీనంలోకి తీసుకోవడం జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని.. వ్యూహాత్మక, అంతర్జాతీయ భద్రత కోసం ఇది తమకు అవసరమని ట్రంప్ నొక్కి చెప్పారు. ఇదే క్రమంలో.. రెండు శతాబ్దాలుగా గ్రీన్‌ ల్యాండ్‌ ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని గుర్తుచేశారు. అయితే.. ఈ విషయంలో తాను బలప్రయోగం చేయాల్సిన అవసరం లేదని.. తాను బలప్రయోగం చేయాలనుకోవడం లేదని.. అమెరికా అడుగుతున్నదల్లా గ్రీన్‌ ల్యాండ్ అనే ప్రదేశం మాత్రమేనని ట్రంప్ పునరుద్ఘాటించారు.

భారత్ – పాక్ వార్ పై పాత పాట!:

ఇదే క్రమంలో... భారత్ - పాక్ మధ్య గత ఏడాది మే నెలలో జరిగిన సరిహద్దు ఘర్షణపైనా ట్రంప్ స్పందిస్తూ.. పాత పాటే పాడారు. ఇందులో భాగంగా... తన ఏడాది పాలనలో భారత్ - పాక్ సహా ప్రపంచవ్యాప్తంగా 8 యుద్ధాలు ఆపానని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో 30 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న అర్మేనియా, అజర్ బైజాన్ ఉద్రిక్తతలను తాను ఆపడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆశ్చర్యపోయారని ట్రంప్ చెప్పుకొచ్చారు.. ఈ సమయంలో ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ఆపడంపై దృష్టి పెట్టాలని తాను పుతిన్ ని కోరినట్లు తెలిపారు!

Tags:    

Similar News