చైనాకు దిమ్మ తిరిగే షాక్.. అమెరికాలోనూ టిక్ టాక్ బ్యాన్

Update: 2020-08-07 06:00 GMT
సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవటమే కాదు.. దూకుడుగా వ్యవహరించే అధినేతగా పేరున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా  సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం మోడీ సర్కారు తీసుకున్నట్లే.. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. టిక్ టాక్ ను అమెరికాలో బ్యాన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. టిక్ టాక్ తో పాటు.. పలు చైనా యాప్ లను బ్యాన్ చేసే నిర్ణయంపై ఆయన సంతకాలు చేశారు.

అమెరికా దేశ భద్రతను.. దేశ ఆర్థిక వ్యవస్థను ముప్పుగా మారాయంటూ.. చైనీస్ యాప్స్ పైన సంతకం పెట్టిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాను సంతకం చేసిన నిషేధం నలభైఐదు రోజుల్లో వస్తుందని పేర్కొన్నారు. జాతీయ భద్రతా సమస్యల్ని చూపుతూ.. టిక్ టాక్.. వీ చాట్ లను తొలిసారి భారత్ బ్యాన్ చేస్తే.. తాజాగా ట్రంప్ సర్కారు ఇప్పుడు మోడీ ప్రభుత్వ బాటలో నడిచినట్లుగా కనిపిస్తోంది.

కొద్దినెలల్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అమెరికన్ల మనసుల్ని దోచుకోవటంతో పాటు.. జాతీయ భావాన్ని భావోద్వేగంగా మార్చటం ద్వారా రెండోసారి ఆ పదవిని చేజిక్కించుకోవాలన్న ఆలోచనలో ట్రంప్ ఉన్నారు. ఇందుకు తగ్గట్లేఆయన ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నారు.

టిక్ టాక్ ను అమెరికా బ్యాన్ విధించిన వేళ.. సదరుయాప్ లోని పలు అంశాలు చట్టవిరుద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. టిక్ టాక్ అప్లికేషన్ వినియోగించే వినియోగదారుడి నుంచి టిక్ టాక్ అధిక మొత్తంలో సమాచారాన్ని సంగ్రహిస్తుందని.. అమెరికన్ల వ్యక్తిగత యాజమాన్య సమాచారాన్ని చైనా కమ్యునిస్టుపార్టీకి చేరవేస్తున్నట్లుగా ట్రంప్ పేర్కొన్నారు. ఫెడరల్ ఉద్యోగులు..కాంట్రాక్టర్ల స్థానాల్ని ట్రాక్ చేయటానికి.. బ్లాక్ మొయిల్ చేయటం కోసం వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన పత్రాల్ని రూపొందటానికి సాయం చేస్తుందని పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే.. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం చైనాకు భారీ షాక్ గా మారుతుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరీ వ్యవహారంపై చైనా ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.
Tags:    

Similar News