కేసీఆర్ సంచలనం : కేటీఆర్ ను కాదని హరీష్ రావుకు పగ్గాలు?
అసెంబ్లీలో కేసీఆర్ బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కొనసాగుతుండగా.. ఆయనకు సహాయకులుగా ముగ్గురు ఉప ఫ్లోర్ లీడర్లను నియమించారు.;
కేసీఆర్.. రాజకీయ చాణక్యుడు.. ఎప్పుడు ఎవరిని ఎలా కొట్టాలో ఆయనకు తెలుసు. ఎవరికి ఎప్పుడు బాధ్యతలు అప్పగించాలో ఆయనకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. సమయం, సందర్భంను బట్టి రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడంలో సిద్ధహస్తుడు. అలాంటి కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు కేటీఆర్ ని కాదని.. మేనల్లుడు హరీష్ రావుకు తన తర్వాత బాధ్యతలు అప్పగించడం బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అసెంబ్లీ లో పార్టీ గళాన్ని వినపించే బాధ్యతలను న మేనల్లుడు హరీష్ రావుకు అప్పగిస్తూ కుమారుడు కేటీఆర్ ను ఈ జాబితాలో చేర్చకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షంలో మరింత దూకుడు పెంచేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా శాసనసభ, శాసనమండలిలో పార్టీ పదవులను భర్తీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నియామకాలలో సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్ రావుకు అత్యంత ప్రాధాన్యత దక్కగా.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.
డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా 'ట్రబుల్ షూటర్'
అసెంబ్లీలో కేసీఆర్ బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కొనసాగుతుండగా.. ఆయనకు సహాయకులుగా ముగ్గురు ఉప ఫ్లోర్ లీడర్లను నియమించారు. సభలో విషయ పరిజ్ఞానం, వాక్చాత్యుర్యం కలిగిన హరీష్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. మహిళా గళాన్ని వినిపించేందుకు మాజీ మంత్రి సబితకు అవకాశం ఇచ్చారు. గట్టిగా వాదించగల నేతగా తలసానికి చోటు కల్పించారు.
కేటీఆర్ ఎందుకు లేరు?
పార్టీలో నంబర్ 2గా చలామణి అవుతున్న కేటీఆర్ పేరు ఈ జాబితాలో లేకపోవడంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ ఇప్పటికే పార్టీ వర్కింగ్ గా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ వ్యవహారాలను.. క్షేత్రస్థాయి క్యాడర్ ను సమన్వయం చేసుకునే బాధ్యతల్లో ఉన్నారు. అందుకే ఆయనను కేవలం అసెంబ్లీ బాధ్యతలకు పరిమితం చేయకూడదని కేసీఆర్ భావించి ఉండవచ్చు.
హరీష్ అనుభవంపై నమ్మకం..
అసెంబ్లీ నిబంధనలు.. బడ్జెట్ అంశాలు.. ప్రభుత్వ వ్యూహాలను తిప్పికొట్టడంలో హరీష్ రావుకున్న అనుభవం ఇక్కడ కలిసి వచ్చింది. గత కొన్ని సెషన్లలో హరీష్ రావు ఒంటరిపోరాటం చేసిన తీరు కేసీఆర్ ను మెప్పించిందని సమాచారం. పార్టీలో పట్టు కోల్పోకుండా ఉండటానికి హరీష్ రావుకు అసెంబ్లీలో, కేటీఆర్‌కు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ప్రాధాన్యతనిస్తూ కేసీఆర్ బ్యాలెన్స్ చేస్తున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి.
శాసనమండలిలో కూడా పార్టీ పట్టు కోల్పోకుండా ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలను ఉప నేతలుగా దేశపాటి శ్రీనివాస్‌ను పార్టీ విప్‌గా నియమించారు. మండలి ఫ్లోర్ లీడర్‌గా ఎస్. మధుసూదనాచారి యథావిధిగా కొనసాగుతారు.
మొత్తానికి హరీష్ రావుకు అసెంబ్లీలో కీలక బాధ్యతలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వంపై మరింత పదునైన విమర్శలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేటీఆర్ పేరు లేకపోవడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందా లేక ఇది కేవలం పని విభజనలో భాగమేనా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.