చంద్రబాబు లండన్ టూర్.. టీడీపీ వివరణ ఇదే!
దీంతో తాజాగా మంగళవారం రాత్రి టీడీపీ స్పందించింది. చంద్రబాబు, నారా లోకేష్ లండన్ పర్యటనఫై వివరణ ఇచ్చింది.;
ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ కుటుంబంతో సహా లండన్ పర్యటనకు వెళ్లారు. 2026, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని లండన్‌లో వేడుకలు చేసుకునేందుకు కుటుంబం వెళ్లింది. అయితే.. ఈ వ్యవహారంపై వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున యాగీ చేసింది. ప్రభుత్వ ధనాన్ని విదేశీ పర్యటనలకు వాడుకుంటున్నారని.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చంద్రబాబు, లోకేష్ వేర్వేరుగా విదేశాల్లో పర్యటించారని.. ప్రత్యేక విమానాలకు కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారని పేర్కొంటూ.. విమర్శలు గుప్పించారు.
అంతేకాదు.. తాజా లండన్ పర్యటనను సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేష్‌లు గోప్యంగా ఉంచారని కూడా వైసీపీ సోషల్ మీడి యాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీనిని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేవని సీఎం చంద్రబాబు స్వయంగా చెబుతున్నారని.. అలాంటప్పుడు విదేశీ పర్యటనల కోసం.. కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.. వైసీపీ అనుబంధ మీడియా సహా.. సోషల్ మీడియాలోనూ మంగళవారం రోజు రోజంతా ఈ వ్యవహారమే చర్చకు వచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున టాక్ షోలు కూడా చేపట్టారు.
దీంతో తాజాగా మంగళవారం రాత్రి టీడీపీ స్పందించింది. చంద్రబాబు, నారా లోకేష్ లండన్ పర్యటనఫై వివరణ ఇచ్చింది. ఇది వారి వ్యక్తిగత పర్యటన అని పేర్కొంది. దీనికి సంబంధించి ప్రకటన ముందుగా జారీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. అంతేకాదు.. ప్రస్తుత లండన్ పర్యటన పూర్తిగా వ్యక్తిగతం కావడంతో దీనికి అయ్యే ఖర్చులను నారా లోకేష్ కుటుంబమే భరిస్తుందని.. ప్రజల సొమ్మును కానీ.. ప్రభుత్వ సొమ్మును కానీ.. వినియోగించడం లేదని టీడీపీ వివరణ ఇచ్చింది. అంతేకాదు.. చంద్రబాబు వెంట వెళ్లిన ఇద్దరు అధికారులకు అయ్యే పూర్తి ఖర్చును కూడా వ్యక్తిగత సొమ్ము నుంచే ఖర్చు చేస్తారని టీడీపీ వివరణ ఇచ్చింది.
ఇక, ఈ ఏడాది ఆరుసార్లు విదేశాలకు పర్యటించారన్న విషయంపైనా టీడీపీ వివరించింది. ఈ పర్యటనలు.. పూర్తిగా అధికారిక మని తెలిపింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో విదేశాలకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు అధికారిక హోదాలోనే వెళ్లారని తెలిపింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులే అప్పట్లో విడుదల చేసిన విషయాన్ని టీడీపీ ప్రకటించింది. ప్రస్తుతం పూర్తిగా వ్యక్తిగత పర్యటన కావడంతో అధికారికంగా ఈ పర్యటన వివరాలను ప్రజలతో పంచుకోలేదని తెలిపింది. దీనిపై వివాదం చేయడం సరికాదని టీడీపీ హితవు పలికింది. ముఖ్యమంత్రి, మంత్రులు అయినప్పటికీ.. వారికి కూడా వ్యక్తిగత కుటుంబాలు, వేడుకలు ఉంటాయని గుర్తు చేసింది.