ఎఫ్ బీఐకి ఫుల్ పవర్స్ ఇచ్చేసిన సుప్రీం

Update: 2016-04-30 11:40 GMT
అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఆగ్రరాజ్యంలో కొత్త కలకలాన్ని రేపుతోంది. ఎఫ్ బీఐ (ఫెడరల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్) సంస్థకు విశేష అధికారాలు కల్పిస్తూ వెలువరించిన తీర్పుపై అమెరికాలోని పలువురు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక.. ప్రైవసీని విపరీతంగా అభిమానించి ఆరాధించే వారి పరిస్థితి అయితే మరింత ఇబ్బందికరంగా మారింది.

తాజాగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం అమెరికాలోని ఎఫ్ బీఐ అధికారులు ఏ కంప్యూటర్ ను అయినా హ్యాక్ చేసే అధికారాన్ని కట్టబెట్టినట్లైంది. కంప్యూటర్లను హ్యాక్ చేసేందుకు ఎఫ్ బీఐని అనుమతిస్తూ ఫెడరల్ న్యాయమూర్తులు ఆదేశాలు ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు డిసెంబరు ఒకటి నుంచి అమల్లోకి వచ్చే వీలుంది. దీంతో.. ప్రైవసీని కోరుకునే వారు.. పలు వర్గాల వారు హ్యాక్ చేసే అధికారాన్ని కట్టబెడుతూ ఇచ్చిన అధికారాల్ని నిరసిస్తూ రంగంలోకి దిగారు.

సుప్రీం ఇచ్చిన ఆదేశాలు డిసెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చే వీలు ఉండటంతో.. అంతలోపు ఈ నిర్ణయాన్ని అడ్డుకునే దిశగా పావులు కదపాలని నిర్ణయించారు. సుప్రీం ఆదేశాలతో యజమానితో సంబంధం లేకుండా ఏ కంప్యూటర్ ను అయినా హ్యాక్ చేసే అధికారం ఎఫ్ బీఐకి సంక్రమిస్తుంది. దీన్ని అడ్డుకోవటానికి యూఎస్ కాంగ్రెస్ లో బిల్లు ప్రవేశపెట్టాలని సీనియర్ డెమోక్రాట్లు భావిస్తున్నారు. డిజిటల్ యుగంలో తీసుకున్న ఈ నిర్ణయం పూర్తి ఏకపక్షంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News