ఇంత హ్యాపీ కుర్రాడు చేసిన చిన్న తప్పు.. అతడే లేకుండా చేసింది

Update: 2021-08-13 03:36 GMT
ఈ ఫోటో చూశారు కదా? జాలీగా ఉన్న ఈ కుర్రాడు.. ఇప్పుడు లేడు. అవును.. నమ్మలేకున్నా ఇది నిజం. ఎలాంటి ఆరోగ్య సమస్యలు.. మరింకేమీ ఇష్యూలు లేని ఈ కుర్రాడు చేసిన తప్పు ఏమైనా ఉంటే.. ప్లాన్డ్ గా తన మీదకు విసిరిన ట్రాప్ లో అమాయకంగా చిక్కుకోవటం. అంతే.. అతగాడు తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించాడు. విన్నంతనే అయ్యో అన్న వేదనను కలిగించే ఈ ఉదంతంలో తెలుసుకోవాల్సిన నీతి ఏమంటే.. ఇలాంటి ఉచ్చు ఏ క్షణంలోనైనా మీ మీదా విసిరే ప్రమాదం ఉంది.

సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చి.. అది కాస్తా పాపులర్ అయ్యాక వచ్చి పడుతున్న ఇబ్బందులు..కష్టాలు.. సమస్యలు అంతా ఇంతా కాదు. ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. హైదరాబాద్ లోని లంగర్ హౌస్ కు చెందిన ఈ కుర్రాడి పేరు శివ శంకర్ నాయక్. వయసు 24 ఏళ్లు. తన పని తాను చేసుకోవటం తప్పించి.. మరింకేమీ తెలీదు. కాకుంటే.. అందరి మాదిరి అతడు నిత్యం సోషల్ మీడియాను ఫాలో అవుతుంటాడు. అదే అతడి జీవితాన్ని అర్థాంతరంగా చాలించేలా చేసింది.

ఎందుకంటే.. ఆన్ లైన్ లో ఇటీవల ఒక మహిళ పరిచయమైంది. కొద్దిరోజుల చాటింగ్ అనంతరం.. ఇరువురు మాట్లాడుకోవటం మొదలైంది. తాజాగా ఒక వీడియో కాల్ చేసి మాట్లాడాడు. అంతే.. కాసేపటికి అతను వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు రికార్డు చేసిన అతని నగ్న వీడియోను అతనికి పంపి.. వెంటనే డబ్బులు చెల్లించాలని.. లేనిపక్షంలో సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసి పరువు తీస్తామని బెదిరించారు. దీంతో.. బెదిరిపోయిన ఆ కుర్రాడు.. తాను చేసిన తప్పునకు కమిలిపోతూ.. సూసైడ్ చేసుకొని మరణించాడు.

ఇటీవల కాలంలో ఇలాంటి దందాలు ఎక్కువై పోతున్నాయి. కమ్మటి మాటలతో.. తియ్యటి చేష్టలతో స్నేహం పేరుతో వల విసురుతారు. అనంతరం తెలివిగా బోల్తా కొట్టించేందుకు మగాడి వీక్ నెస్ మీద దెబ్బ కొడతారు. వీడియో కాల్ చేసి.. అవతల ఉన్న మహిళ బట్టలు విప్పదీసి.. ఇవతల వారిని బట్టలు విప్పదీయాలని చెబుతారు. వారి ట్రాప్ లో ఉన్న వారు.. తమకు తెలిసిన మహిళతోనే ఇదంతా చేస్తున్నామని భావించి.. వారి చెప్పినట్లే చేస్తారు. అడ్డంగా బుక్ అవుతారు. ఇక్కడ గమనించాల్సిన విషయం.. తాము ట్రాప్ చేసిన వారిని బట్టలు విప్పదీయించటమే లక్ష్యం తప్పించి మరింకేమీ ఉండదన్న విషయాన్ని చాలామంది మిస్ అవుతారు. తెలిసిన మనిషితో వీడియో రొమాన్సు అన్నట్లుగా భావిస్తారే తప్పించి.. ఆ రూపంలో భారీ ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని గుర్తించారు.

ఇక్కడ గమనిచాల్సిన మరో అంశం.. ట్రాప్ విసిరే వారు.. సదరు అమ్మాయి ముఖాన్ని దాదాసు కవర్ చేస్తుంటారు. ఎక్కువగా బాడీ పార్ట్స్ మీదన ఫోకస్ చేస్తారు. బాధితుడి విషయంలో మాత్రం అతని ప్రైవేట్ పార్ట్స్ తో పాటు ముఖం స్పష్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే.. ఆ వీడియోతో బెదిరింపులకు పాల్పడి డబ్బులు సంపాదించటమే సైబర్ నేరగాళ్ల ప్లాన్. ఇలాంటి వాటికి అనుకోకుండా పడిపోయి.. అడ్డంగాబుక్ అయి భారీగా డబ్బులు పోగొట్టుకునే వారు కొందరైతే.. భయాందోళనలతో ఆత్మహత్యలు చేసుకునే వారు మరికొందరు. తాజా విషాద ఉదంతంలోని శివ రెండో కోవకు చెందిన వారు. ఇలాంటి ట్రాప్ లు మీ మీద కూడా విసురుతుంటారు. తస్మాత్ జాగ్రత్త.


Tags:    

Similar News