జంపింగ్స్‌పై కోర్టు గడపెక్కిన టీ తమ్ముళ్లు

Update: 2015-05-25 07:35 GMT
తెలంగాణ రాష్ట్రంలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ అధికారపక్షాన్ని ఇరుకున పడేసేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. పార్టీ గోడ దూకేసి అధికారపక్షంలో చేరిపోయి.. పదవులు చేపట్టిన నేతలపై అనర్హత వేటు పడేందుకు వీలుగా వారు మరోసారి కోర్టు గుమ్మం తొక్కారు.

ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా తెలంగాణ అధికారపక్షంతో చెట్టాపట్టాలు వేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లపై న్యాయపరమైన చర్యలు తీసుకోవటంతో పాటు.. ఎమ్మెల్యేలుగా అనర్హత వేటు వేయించటం ద్వారా అధికారపక్షాన్ని దెబ్బ తీయాలని భావిస్తోంది. తనకు అవకాశం ఉన్న దాని కంటే ఒక స్థానంలో అదనంగా అభ్యర్థిని బరిలోకి దింపటం ద్వారా.. విపక్షాలను దెబ్బ తీయాలని అధికారపక్షం పావులు కదుపుతోంది.

అయితే.. ఈ వ్యూహాన్ని ఏదోలా దెబ్బ తీయాలనుకుంటున్న తెలంగాణ తెలుగుదేశం నేతలు తాజాగా హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి ఓటుహక్కు కల్పించకుండా అనర్హత వేటు వేయాలని వారు కోరారు. టీటీడీపీ పార్టీ తరఫున పోటీ చేసిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.. గవర్నర్‌ చేత మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించటాన్ని తన పిటీషన్‌లో పేర్కొన్నారు. మరి.. తమ్ముళ్ల పిటీషన్‌పై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.


Tags:    

Similar News