షఫీకి పెద్ద దిక్కుగా మంత్రి హరీశ్

Update: 2015-09-04 18:54 GMT
రాజకీయాల్ని కాసేపు పక్కన పెడదాం.. తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తీరు కాస్తంత భిన్నంగా ఉంటుంది. తూటాల్లాంటి మాటలతో రాజకీయ ప్రత్యర్థులపై చెలరేగిపోయే హరీశ్ కు చెందిన మరో కోణం చాలా తక్కువ మందికి తెలుసు. తనను అభిమానించే కార్యకర్తల కోసం ఆయన విపరీతంగా శ్రమిస్తారు. ఒక్కరోజు వ్యవధిలో దాదాపు 1000 కిలోమీటర్లు ప్రయాణించిన రోజులున్నాయి. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఇన్నేసి కిలోమీటర్లు ఒక్కరోజులో ప్రయాణించి.. పక్కరోజు ఉదయం అదే ఉత్సాహంతో బయటకు రావటం ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది.

ఇదో కోణం అయితే.. ఏదైనా సంఘటన చోటు చేసుకుంటే వెను వెంటనే స్పందించే లక్షణం హరీశ్ కు ఉంది. వలసకూలీ షఫీ దయనీయ గాథ మీడియాలో ప్రముఖంగా రావటం తెలిసిందే. కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్లిన భార్య.. బిడ్డకు జన్మనిచ్చి చనిపోతే.. ఆమెను ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోకుండా పక్కన పడేస్తూ.. గుండెల్లో పొంగుకొస్తున్న బాధ ఒకవైపు.. ఊరికి తీసుకెళ్లేందుకు చేతిలో డబ్బుల్లేక సగం దూరానికి పిల్లల్ని.. శవంగా మారిన భార్యను ఆర్టీసీ బస్సులో తీసుకెళ్లిన వైనం తెలిసిన ప్రతిఒక్కరి మనసు కదిలిపోయింది.

దిక్కుతోచని స్థితిలో రోడ్డు పక్కన భార్య శవంతో ఉన్న షఫీ విషయం తెలుసుకొని ఆర్టీసీ కార్మికులు చందాలు వేసుకొని అతన్ని ఊరికి పంపిన వైనంపై హరీశ్ కదిలిపోయారు. వెంటనే అతగాడికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని అధికారుల్ని కోరారు. అతడి దీన పరిస్థితి గురించి అధికారులు ఇచ్చిన నివేదికను చదివి కదిలిపోయిన హరీశ్.. శుక్రవారం వూట్కూరులోని అతడింటికి వెళ్లారు.

అతడి పరిస్థితిపై స్పందించిన ఆయన వెనువెంటనే.. నారాయణపేట మార్కెట్ యార్డులో అవుట్ సోర్సు ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు సోమవారం నాటికి ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యర్థుల మీద విరుచుకుపడటమే కాదు.. తనలోని స్పందించే గుణాన్ని చాటి చెప్పారు.
Tags:    

Similar News