టీ సర్కారుకు రూ.1500కోట్లు వస్తున్నాయా?

Update: 2015-10-09 06:16 GMT
ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుతో పాటు.. మరెన్నో హామీలు ఇస్తూ ముందుకెళుతున్న తెలంగాణ ప్రభుత్వం.. వాటి అమలుకు అవసరమైన నిధుల వేటులో తలమునకలవుతోంది. పేరుకు ధనిక రాష్ట్రమైనప్పటికీ.. ఇచ్చిన హామీలు భారీగా ఉండటం వాటిని పూర్తి చేయాలంటే భారీ ఎత్తున నిధులు అవసరమైన నేపథ్యంలో.. అనవసరమైన ఆస్తుల్ని అమ్మకానికి పెట్టాలని నిర్ణయించింది.

ఆస్తుల్లో భూములకు సంబంధించి విక్రయించాలని చూస్తోంది. 240 గజాల స్థలం నుంచి 30 ఎకరాల మధ్యలో ఉన్న భూములకు సంబంధించిన వివరాల్ని సేకరించిన తెలంగాణ సర్కారు.. చిన్న చిన్న భూములు కజ్జా కోరలకు చిక్కకుండా ఉండేందుకు వీలుగా.. వాటిని అమ్మేయాలని భావిస్తోంది. ఇందుకోసం భూవేలాల్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇలా భూములు అమ్మితే దాదాపు రూ.1500కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జించొచ్చన్న భావనలో ఉంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనికిరాని.. ఉపయోగంలో లేని భూములకు సంబంధించిన వివరాల్ని సేకరించిన తెలంగాణ ప్రభుత్వం.. వీటిని వ్యూహ్మాత్మకంగా అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమవుతోంది. తొలివిడతలో రూ.1500 కోట్ల మేర ఆదాయాన్ని అర్జించాలని భావిస్తోంది. హైదరాబాద్.. రంగారెడ్డి జిల్లాలకు చెందిన 27 భూముల్ని తొలిదశలో విక్రయించాలని భావిస్తోంది. దశల వారీగా చేపట్టే ఈ భూవేలంతో దాదాపుగా రూ.10వేల కోట్ల మేర నిధులు సమీకరించాలని భావిస్తోంది.

కొసమెరుపు ఏమిటంటే.. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని బుధవారం అసెంబ్లీలో ప్రకటించిన కాసేపటికే.. ప్రభుత్వం తన భూముల్ని అమ్మకాలకు పెడుతూ నిర్ణయం తీసుకున్న జీవోను విడుదల చేయటం విశేషం.
Tags:    

Similar News