సాములోరు ఇక.. వర్సిటీ కులపతా?

Update: 2015-10-09 09:26 GMT
సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి తనదైన మార్క్ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు చెబుతున్నారు. ఇంతకాలం.. ఏదైనా విశ్వవిద్యాలయానికి  ఉప కులపతి (వైస్ ఛాన్సలర్)ని నియమించాలంటే.. వర్సిటీకి ఛాన్సలర్ గా ఉన్న గవర్నర్ కు జాబితాను పంపటం.. దానికి ఆయన ఆమోదముద్ర వేసే పద్ధతి ఉండేది.

అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. వర్సిటీలకు ఛాన్సలర్ గా గవర్నర్ వ్యవహరించే విధానానికి స్వస్తి పలుకుతూ నిర్ణయం తీసుకున్నారు. అంటే.. ఇక వర్సిటీలకు వీసీలు.. వారిపై ఛాన్సలర్లు అంటూ ఉండరు. మొత్తంగా ఛాన్సలర్లే ఉంటారన్న మాట. ఇదిలా ఉంటే తాజాగా ఆయన మరో నిర్ణయాన్ని తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారని చెబుతున్నారు.

దీని ప్రకారం.. వివిధ వర్సిటీలకు ఛాన్సలర్లను నియమించేందుకు కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలుగు యూనివర్సిటీకి చినజీయర్ స్వామీజీని.. జేఎన్టీయూకి మైహోం  గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావులను ఛాన్సలర్లుగా నియమించాలని భావిస్తోన్నట్లు చెబుతున్నారు.

ఇక.. ఉస్మానియా.. కాకతీయ యూనివర్సిటీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఛాన్సలర్ గా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం.. ఛాన్సలర్లుగా ఉంటానికి నిర్దేశిత విద్యార్హతలు ఉండాలన్న నియమాన్ని కూడా పక్కన పెట్టాలని తెలంగాణ సర్కారు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ అంచనాలుగా ఉన్న ఈ నిర్ణయం కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటే మాత్రం.. ఇదో సంచలనంగా మారే అవకాశం ఉంది.
Tags:    

Similar News