బాబుకు ఏపీకి రావటం ఇష్టం లేకనే సమావేశాల బహిష్కరణ?

Update: 2021-05-19 02:59 GMT
కరోనా లాంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పుడు.. తప్పనిసరిగా అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించాల్సి వస్తే? ఎన్ని రోజులు నిర్వహిస్తారు? ఇప్పుడు కావాల్సింది ప్రాసెస్ ప్రకారం పనులు పూర్తి కావటం తప్పించి.. మరింకేమీ కాదు. ఆ మాటకు వస్తే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించటం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు కూడా. అసెంబ్లీ సమావేశాలన్నంతనే ఏపీలోని ఎమ్మెల్యేల వరకే పరిమితం కాదు. ఒక్కో ఎమ్మెల్యేతో పాటు.. కనీసం ఇరవై మంది వరకు సిబ్బంది సమావేశాలకు హాజరుకావాల్సి ఉంటుంది.

కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న వేళలో.. తప్పనిసరి పరిస్థితుల్లో సభను నిర్వహించాల్సి వస్తే.. వీలైనంత సాదాసీదాగా.. తక్కువ సమయంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ కారణంతోనే.. ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాన్ని ఒక రోజు నిర్వహించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఈ నిర్ణయాన్ని విపక్ష టీడీపీ వ్యతిరేకిస్తోంది. రూ.2.11లక్షల కోట్లతో ఉన్న బడ్జెట్ ను విపులంగా చర్చించాలని.. తూతూ మంత్రంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని టీడీపీ శాసనసభాపక్ష నేత అచ్చెన్నాయుడు విమర్శించారు.

కరోనా ఉన్న సమయంలో అసెంబ్లీ సమావేశాల్ని ఎలా నిర్వహిస్తారు? యాక్టివ్ కేసులు పెద్ద ఎత్తున ఉన్న వేళలో సభను నిర్వహించటం సరికాదన్న మాటను కాదనలేం. అందుకే.. ఒకరోజులో సభను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్లు విపక్షం స్పందించాల్సి ఉన్నప్పటికీ.. సమావేశాల్ని తాము బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించటం గమనార్హం. చూస్తుంటే.. కరోనా టైంలో హైదరాబాద్ నుంచి బయటకు రావటానికి ఏ మాత్రం ఆసక్తి చూపని చంద్రబాబు.. అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ రాకుంటే ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు తప్పవు. అందుకే.. అసెంబ్లీ సమావేశాల్ని తమ పార్టీబహిష్కరిస్తుందన్న మాటతో హైదరాబాద్ నుంచి బయటకు రాకుండా ఉండటమే బాబు ఆలోచనగా చెబుతున్నారు. మరీ.. విమర్శకు బాబు అండ్ కో ఏమని బదులిస్తారో చూడాలి.
Tags:    

Similar News