అజారుద్దీన్ మంత్రి పదవికి కౌంట్ డౌన్ !
తెలంగాణా రాజకీయాలను వేడెక్కించే ఒక అంశంగా మంత్రి అజారుద్దీన్ ఇష్యూ తెర మీదకు వస్తోంది.;
తెలంగాణా రాజకీయాలను వేడెక్కించే ఒక అంశంగా మంత్రి అజారుద్దీన్ ఇష్యూ తెర మీదకు వస్తోంది. అప్పట్లో అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేడిలో హడావుడిగా అజారుద్దీన్ ని మంత్రిగా తీసుకుని అర్జంటుగా ప్రమాణ స్వీకారం చేయించారు. అంతవరకూ కాంగ్రెస్ కేబినెట్ లో మైనారిటీ వర్గానికి చెందిన మంత్రి అంటూ ఎవరూ లేరు, జూబ్లీ హిల్స్ లో ఇది ప్రభావితం చేసే అంశం కావడంతో కాంగ్రెస్ అలా అజారుద్దీన్ ని తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. అయితే అప్పటికి అజారుద్దీన్ చట్ట సభలలో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కాదు, రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారం ఆరు నెలలలో ఎగువ దిగువ సభలలో ఏదో ఒక దానిలో ఎన్నిక కావాల్సి ఉంది. అయితే ఏప్రిల్ 30తో అజారుద్దీన్ మంత్రి పదవికి ఆరు నెలల గడువు పూర్తి అవుతోంది.
గవర్నర్ వైపే చూపు :
తెలంగాణాకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా వచ్చారు. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్ గా గతంలో బీజేపీలో పనిచేశారు. ఇక గవర్నర్ గా వేరే రాష్ట్రాలలో పనిచేసి వచ్చిన అనుభవం ఉంది. ఆయన్ని ఏరి కోరి తీసుకుని వచ్చారు అన్న మాట సైతం ఉంది. ఇపుడు ఆయన టేబిల్ మీద ఎమ్మెల్సీల నామినేటెడ్ లిస్ట్ ఫైల్ ఉంది ఆయన ఓకే చెబితే ఆరేళ్ల పాటు అజారుద్దీన్ ఎమ్మెల్సీగా చాన్స్ దక్కించుకున్నట్లే. అయితే అజారుద్దీన్ మీద హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు సైతం ఆయనను పదవి నుంచి తప్పుకోవాలని అప్పట్లో కోరింది అని అంటున్నారు. దాంతో ఈ వివాదాల నేపధ్యంలో ఆయన పేరుని గవర్నర్ కోటా నుంచి నామినేట్ చేయడానికి రాజ్ భవన్ అంత సులువుగా అంగీకరించదని అంటున్నారు
రాజీనామా చేయడమే :
దాంతో ఎమ్మెల్సీగా ఎక్కడా ఖాళీలు అయితే లేవు. ఎవరి చేత రాజీనామాలు ఇప్పించేది కూడా లేదు. పైగా ఒకరి చేత రాజీనామా చేయించినా ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించాలి. అన్నీ జరిగేసరికి పుణ్య కాలం దాటుంది. దాంతో ఇక అజారుద్దీన్ ఏప్రిల్ 30కి తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి రెడీగా ఉండడమే మార్గమని దానికి ఆయన ఫుల్ గా ప్రిపేర్ అయిపోవడమే అని అంటున్నారు.
మరోసారి ప్రమాణం :
అయితే కాంగ్రెస్ కి ఉన్న మరో మార్గం ఏంటి అంటే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత మరోసారి తిరిగి మంత్రిగా ప్రమాణం చేయించడం. అలా చేస్తే మళ్ళీ ఆరు నెలల గడువు దొరుకుతుంది. ఈ లోగా లోకల్ బాడీ కోటాలో అయినా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయితే ఆయనకు ఒకటి ఇవ్వవచ్చు అని అంటున్నారు. అయితే ఎక్కడా కూడా ఒకసారి మంత్రి పదవికి రాజీనామా చేసిన వారు ఏ చట్ట సభలో ఎన్నిక కాకుండా రెండవ మారు మంత్రిగా ప్రమాణం చేయడం అన్న సంప్రదాయం లేదు, అది ఒక దుష్ట సంప్రదాయంగా ఉంటుందని కూడా అంటున్నారు. నిజానికి ప్రజల నుంచి ఎన్నిక అయి మంత్రి అవడమే ఉత్తమ మార్గం. అరుదైన సందర్భాలలో మాత్రమే ఈ విధంగా చేయడానికి రాజ్యాంగం అనూంతి ఇచ్చింది. కానీ దానిని పదే పదే వాడడం వల్ల ప్రజాభిప్రాయాన్ని తృణీకరించినట్లే అవుతుందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.
ఇరకాటంలో కాంగ్రెస్ :
కొద్ది నెలలలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి. ఈ కీలక సమయంలో ఏకైక మైనారిటీ మంత్రిగా ఉన్న అజారుద్దీన్ ని మంత్రి వర్గంలో నుంచి లేకుండా చేసుకుంటే మైనారిటీల ఆగ్రహానికి గురి అవుతామన్న కంగారు అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంది అని అంటున్నారు. అంతే కాదు ఈ ఎన్నికల్లో ఎక్కువగా మైనారిటీలు ఉన్న అనేక వార్డులు ఉన్నాయి. అక్కడ విజయావకాశాల మీద తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. మొత్తానికి చూస్తే అజారుద్దీన్ ఇష్యూ అయితే కాంగ్రెస్ కి ఇరకాటంగానే ఉంది అని అంటున్నారు.