జగన్ కి గోల్డెన్ చాన్స్...వైసీపీకి బూస్టింగ్

అవును. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కి ఒక విధంగా ఇది బంగారు అవకాశం. ఆయన నిర్ణయాలు ఆలోచనలే వైసీపీకి బూస్టింగ్ ఇస్తాయనడంలో సందేహం అవసరం లేదు.;

Update: 2026-03-27 03:00 GMT

అవును. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కి ఒక విధంగా ఇది బంగారు అవకాశం. ఆయన నిర్ణయాలు ఆలోచనలే వైసీపీకి బూస్టింగ్ ఇస్తాయనడంలో సందేహం అవసరం లేదు. ఆ అవకాశం ఇస్తోంది కూడా టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. ఒక వైపు కూటమి కూడా జగన్ ని రమ్మంటోంది వైసీపీయే ఇక ఆలోచించుకోవాల్సి ఉందని అంటున్నారు. ఇంతకీ ఈ అవకాశం ఏమిటి, వైసీపీకి జగన్ కి కలసి వచ్చే అంశమేమిటి అంటే అమరావతి రాజధాని ఇష్యూ. ఈ ఇష్యూలో వైసీపీ ఇక పక్కాగా క్లారిటీ ఇచ్చేందుకు అత్యున్నత వేదికగా రాష్ట్ర అసెంబ్లీ ఉంది. అక్కడ నుంచే జగన్ తన పార్టీ స్టాండ్ ఇదేనంటూ బిగ్ సౌండ్ చేయడం ద్వారా మొత్తం ఏపీ జనాలకు స్పష్టమైన సందేశం పంపించవచ్చు అని అంటున్నారు.

అలా చేస్తేనే :

అమరావతి రాజధానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియా ముందు చెప్పారు. తాము అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. అయితే అక్కడ జరుగుతున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకంగా ఉన్నామని అన్నారు. సరే సజ్జల చెప్పారు ఓకే అనుకున్నా పార్టీ అధినేతగా అయిదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన ముఖ్యమంత్రిగా మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకుని వచ్చిన నాయకుడుగా జగన్ ఇంతే విస్పష్టంగా చెబితేనే ఆ పార్టీకే మేలు అని అంటున్నారు. అంతే కాదు బిల్లు చేసి మళ్ళీ వెనక్కి తీసుకుని ఒక విధంగా వైసీపీతో పాటు రాష్ట్ర ప్రజలలోనూ ఒక కన్ ఫ్యూజన్ క్రియేట్ చేసిన తీరుతోనే ఫ్యాన్ పార్టీ ఇంబ్బందుల పాలు అయింది. వాటి అన్నింటికీ శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టేందుకు అమరావతి మీద ప్రత్యేక సమావేశం జరిగే అసెంబ్లీ వేదిక నుంచి తమ వాణిని బలంగా వినిపించడం కంటే బెస్ట్ చాన్స్ ఆ పార్టీకి మరొకటి ఉండదని అంటున్నారు.

ప్రజా తీర్పు చూసినా :

ఇక 2024 ఎన్నికల్లో ప్రజలు అంతా ప్రాంతీయ భేదాలు లేకుండా ముక్త కంఠంతో అమరావతి రాజధానికి ఓటేసారు. ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికే విలువ ఇవ్వాల్సి ఉంటుంది. అలా చూసుకుంటే వైసీపీ కూడా తమ ఆలోచనలు గతంలో ఎలా ఉన్నా అమరావతికే జై కొడుతున్నామని స్ట్రాంగ్ గా చెప్పేందుకు ప్రత్యేక సమావేశాలను ఉపయోగించుకోవాలని అంతా సూచిస్తున్నారు. ఆ విధంగా ప్రకటించడం ద్వారా అధికార విపక్షాలు అన్నీ కలసి ఏకగ్రీవంగా అమరావతి రాజధానిని ఆమోదించాయన్న మంచి సందేశం జనాలకు చేరుతుంది. ఇది రాష్ట్రానికి భవిష్యత్తులో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అని అంటున్నారు.

ఎప్పటికీ నిందగానే :

వైసీపీ తరఫున సజ్జల కానీ మరో నాయకుడు కానీ అమరావతి గురించి ఎంత ప్రకటించినా జనాల్లోకి వెళ్ళేది తక్కువ. అందుకే అధినేతగా విపక్ష నేతగా జగన్ అసెంబ్లీలో దీని మీద మాట్లాడి తన విధానం ప్రకటిస్తే మేలు అని అంటున్నారు. దాని వల్ల వైసీపీ మీద ఇక మీదట ప్రత్యర్ధులు సైతం ఏ విధంగానూ విమర్శలు చేసే చాన్స్ ఉండదు, అలా కాకపోతే ప్రజలలో సంశయాలు ఎప్పటికీ ఉంటాయి. ఇక ప్రత్యర్ధులు సైతం ఈ విషయంలో కెలుకుతూనే ఉంటారు. అందుకే వైసీపీ ఇపుడు కీలక నిర్ణయం తీసుకుని అసెంబ్లీ స్పెషల్ సెషన్ కి అటెండ్ అవడమే భేష్ అయిన నిర్ణయం అంటున్నారు. అలా కాకపోతే వైసీపీ మీద వారు అంటున్నట్లుగా నింద అలాగే ఉండిపోతుంది. నిజమన్నది ఆ పార్టీ తమ నాయకుల చేత మీడియా ముఖంగా ఎంత చెప్పించినా జనాలకు ఎక్కదు సరికదా దానిని అంత విలువ సైతం ఉండదని అంటున్నారు. అయిదు కోట్ల ప్రజల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకోవడం, సుదీర్ఘ కాలం రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉంటూ మళ్ళీ అధికారం చేపడతామని ఆశతో ఉన్న పార్టీగా వైసీపీ ఈ విషయంలో కనుక సరైన నిర్ణయం తీసుకుంటేనే ఆ పార్టీకి రాజకీయాలకు రాష్ట్రానికి ఎంతో మేలుగా ఉంటుందని అంతా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News