మాజీ సీఎం కొడుక్కి వైసీపీలో చెక్ ?

వైసీపీలో అధినాయకత్వం ఇపుడు ఇంచార్జిల పని తీరు మీదనే దృష్టి సారిస్తోంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించారు.;

Update: 2026-03-27 03:15 GMT

వైసీపీలో అధినాయకత్వం ఇపుడు ఇంచార్జిల పని తీరు మీదనే దృష్టి సారిస్తోంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించారు. అయితే 2024 ఎన్నికల్లో అటూ చాలా మందిని మార్చేశారు. అలా ఎనభై నుంచి వంద స్థానాల దాకా ఈ భారీ చేంజ్ సాగింది. ఇందులో కొందరిని తిరిగి పాత ప్లేస్ లకు తెచ్చారు. కానీ ఇంకా అనేక మంది 2024 లో వేరే చోటకు వెళ్ళి పోటీ చేసిన సీట్లలోనే ఇంచార్జులుగా కొనసాగుతున్నారు. అయితే వారంతా అయిష్టంగానే ఉన్నారు. తమ సొంత నియోజకవర్గాలలో తిరిగి బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. మరి కొందరు అయితే ఎన్నికల తర్వాత దాదాపుగా ఇనాక్టివ్ అయ్యారు. అలాంటి చోట పార్టీ నిశితంగా పరిశీలన చేస్తోంది అని అంటున్నారు.

తండ్రి సీఎం, తల్లి మంత్రి :

ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లాలో నేదురుమల్లి జనార్ధనరెడ్డి అంటే ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ఎమ్మెల్సీగా రాజకీయాల్లోకి అడుగు పెట్టి సుదీర్ఘ కాలం అలాగే పెద్దల సభలో పనిచేశారు. ఇక ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు. 1990లో ఆయన చెన్నారెడ్డి తరువాత ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. దాదాపుగా రెండేళ్ళకు పైగా సీఎం గా సేవలు అందించారు. ఆయన సతీమణి నేదురుమల్లి రాజ్యలక్ష్మి కూడా వైఎస్సార్ ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక వారి రాజకీయ వారసుడిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అడుగు పెట్టారు.

టికెట్ దక్కింది కానీ :

ఆయన నిజానికి 2019 ఎన్నికల్లోనే వైసీపీ నుంచి పోటీకి ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి సీటు ఆశించారు. కానీ ఆనాడు ఆనం రామ్ నారాయణరెడ్డికి టికెట్ ని జగన్ కేటాయించారు. అయితే రెండు శిబిరాలుగా ఆనం నేదురుమల్లి నియోజకవర్గ రాజకీయం సాగింది. దాంతో పార్టీ అక్కడ బలహీనపడింది. అదే సమయంలో ఆనం టీడీపీలోకి వెళ్ళారు, వెంకటగిరిలో టీడీపీకి బలమైన నేతగా కురుగొండ్ల రామకృష్ణ ఉన్నారు. ఆయన 2009, 2014, 2024లలో గెలిచి పసుపు పార్టీలో కీలకంగా ఉన్నారు. ఇక నేదురుమల్లి కుటుంబానికి సైతం వెంకటగిరి బలమైన స్థావరంగా ఉంటూ వచ్చింది. 1989లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 1999, 2004లలో నేదురుమల్లి రాజ్యలక్ష్మి గెలిచారు. కానీ వారి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి కి మాత్రం వెంకటగిరిలో పట్టు చిక్కడం లేదు, 2024లో ఆయన కూటమి ప్రభంజనంలో తొలిసారి పోటీ చేసి చేదు అనుభవం మూటగట్టుకున్నారు.

క్యాడర్ లో అసంతృప్తి :

ఇక ఓటమి తరువాత రామ్ కుమార్ రెడ్డి క్యాడర్ కి అందుబాటులో ఉండడం లేదని విమర్శలు ఉన్నాయి. ఆయన పార్టీ మొత్తాన్ని కలుపుకుని నియోజకవర్గంలో వైసీపీ పటిష్టతకు గట్టిగా కృషి చేయడం లేదని అధినాయకత్వానికి ఫిర్యాదులు వెళ్తున్నాయని అంటున్నారు. అంతే కాకుండా ఆయన నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వస్తున్నారని ఆయన వస్తే ఫలానా రోజులలో అందుబాటులో ఉంటారు అని పత్రికా ప్రకటనను చూసి క్యాడర్ తెలుసుకోవాల్సి వస్తోంది అని వాపోతున్నారు. ఇక రామ్ కుమార్ రెడ్డి జగన్ కి సన్నిహితుడు, స్నేహితుడు అని అంటున్నారు. అందుకే ఆయనకే 2019 తరువాత నుంచి వెంకటగిరి బాధ్యతలు అప్పగించారు అని అంటున్నారు. అయితే ఇక మీదట అలా కుదరదని కొత్త వారికి గట్టిగా పనిచేసేవారికి చాన్స్ ఇవ్వాలని క్యాడర్ నుంచి డిమాండ్ వస్తోందిట. మరి స్నేహితుడిని అలెర్ట్ చేసి కంటిన్యూ చేస్తారా లేక కొత్త ఇంచార్జిని తెచ్చి చెక్ పెడతారా అన్న చర్చ అయితే వెంకటరిగి వైసీపీలో పెద్ద ఎత్తున సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News