మరో లాక్ డౌన్ వస్తోందా?

ప్రపంచం మరోసారి అనిశ్చితి నీడలోకి వెళ్తోంది. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి.;

Update: 2026-03-26 22:30 GMT

ప్రపంచం మరోసారి అనిశ్చితి నీడలోకి వెళ్తోంది. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో రగులుతున్న ఈ ఘర్షణలు కేవలం యుద్ధ వాతావరణానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్త ఇంధన సరఫరా గొలుసు ను ఛిన్నాభిన్నం చేసే ప్రమాదం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే “ఎనర్జీ లాక్‌డౌన్” అనే కొత్త భావన ఇప్పుడు మేధావులు, సామాన్యుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.

ఏమిటీ ఎనర్జీ లాక్‌డౌన్?

ఇటీవల సోషల్ మీడియాలో ఒక యువ విశ్లేషకురాలు ఈ పరిస్థితిని విశ్లేషిస్తూ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆమె వివరణ ప్రకారం.. యుద్ధం లేదా రాజకీయ అనిశ్చితి వల్ల ముడి చమురు ఉత్పత్తి ఆగిపోవడం లేదా సరఫరా మార్గాల్లో ఉదాహరణకు హార్ముజ్ జలసంధి ఆటంకాలు ఏర్పడటం వల్ల ఇంధన లభ్యత పడిపోతుంది. దీనివల్ల ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇంధనం అందుబాటులో లేక లేదా సామాన్యుడు కొనలేని స్థాయికి ధరలు పెరగడం వల్ల ప్రజల కదలికలు, రవాణా వ్యవస్థ స్తంభించిపోవడాన్నే ఆమె “ఎనర్జీ లాక్‌డౌన్”గా అభివర్ణించారు.

భారత్‌పై ప్రభావం.. ప్రధాని హెచ్చరిక

భారతదేశం తన చమురు అవసరాలలో దాదాపు 80% పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో చిన్న అలజడి రేగినా అది భారత రూపాయి విలువపై, దేశ ఆర్థిక లోటుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇదే అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లోక్‌సభలో ప్రస్తావించడం గమనార్హం. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి దేశం సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పరిస్థితులు విషమిస్తే గతంలో కరోనా సమయంలో చూసిన ఆంక్షల తరహాలోనే ఇంధన పొదుపు కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చని ఆయన సూచించారు. ఇది ఎనర్జీ లాక్‌డౌన్ హెచ్చరికలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

ద్రవ్యోల్బణం - సామాన్యుడికి భారమైన జీవనం

ఇంధన ధరలు పెరగడం అంటే అది కేవలం పెట్రోల్ బంకుల వద్ద ముగిసే సమస్య కాదు. దీని ప్రభావం గొలుసుకట్టుగా అన్ని రంగాలపై పడుతుంది. లారీలు, విమానాలు, నౌకల రవాణా వ్యయం పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. కూరగాయలు, పాలు, బియ్యం వంటి ప్రాథమిక ఆహార పదార్థాల ధరలు సామాన్యుడికి భారమవుతాయి. సిమెంట్, ఇనుము రవాణా ఖర్చు పెరిగి ఇళ్ల నిర్మాణం ఖరీదైనదిగా మారుతుంది. పరిణామాలు ఇలాగే కొనసాగితే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ద్రవ్యోల్బణం నియంత్రణ తప్పి, ఆర్థిక మాంద్యానికి దారితీసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పరిష్కారం ఏమిటి?

“ఎనర్జీ లాక్‌డౌన్” అనే పదం వినడానికి భయానకంగా ఉన్నప్పటికీ, ఇది దేశాలకు ఒక మేల్కొలుపు పిలుపు. ఇంధన భద్రతను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. సోలార్, విండ్ ఎనర్జీ వంటి ప్రత్యామ్నాయ వనరులపై పెట్టుబడులు పెంచాలి. ఎలక్ట్రిక్ వాహనాలతో ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈవీ రంగాన్ని ప్రోత్సహించాలి. అనవసర ఇంధన వినియోగాన్ని తగ్గించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి సంక్షోభ సమయాల కోసం ముడి చమురు నిల్వలను పెంచుకోవాలి.

గ్లోబల్ మార్కెట్‌లో వస్తున్న ఈ మార్పులను గమనిస్తూ ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉంటేనే ఈ ఇంధన సంక్షోభం నుండి గట్టెక్కడం సాధ్యమవుతుంది.

Tags:    

Similar News